ఐదు రోజులు గడువిస్తున్నాం

ABN , First Publish Date - 2022-07-30T05:17:11+05:30 IST

‘కొందరు జల్సాల కోసం ఆటోలు నడుపుతూ అమ్మాయిలను వేధిస్తున్నారు.. ప్రేమపేరుతో మాయమాటలు చెప్పి వారిని తీసుకొనిపోతున్నారు.. మైనర్‌ అమ్మాయిలను లేవదీసుకుపోయే కేసుల్లో నూటికి 34 మంది ఆటోడ్రైవర్లే ఉంటున్నారు.. ఇది నిజం కాదా? కాదు అంటే చెప్పండి నా వద్ద పూర్తి డేటా ఉంది.. ఇక ఏమాత్రం సహించబోం.. పద్ధతి మార్చుకోవడానికి ఐదు రోజులు సమయం ఇస్తున్నాం.. ఆ తరువాత కఠినంగా వ్యవహరిస్తాం’ అని జిల్లా ఎస్పీ ఆర్‌.వెంకటేశ్వర్లు ఆటోడ్రైవర్లను తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

ఐదు రోజులు గడువిస్తున్నాం
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ ఆర్‌.వెంకటేశ్వర్లు

- మారకపోతే మీ ఖర్మ

- ఆటో డ్రైవర్లకు పోలీస్‌ బాస్‌ మాస్‌ హెచ్చరిక

- ప్రేమపేరుతో అమ్మాయిలను వేధిస్తున్నది మీరే

- వందలో 34 మంది ఆటోడ్రైవర్లే

- ఆటోడ్రైవర్ల అవగాహన సదస్సులో ఎస్పీ ఆర్‌.వెంకటేశ్వర్లు


మహబూబ్‌నగర్‌, జూలై 29: ‘కొందరు జల్సాల కోసం ఆటోలు నడుపుతూ అమ్మాయిలను వేధిస్తున్నారు.. ప్రేమపేరుతో మాయమాటలు చెప్పి వారిని తీసుకొనిపోతున్నారు.. మైనర్‌ అమ్మాయిలను లేవదీసుకుపోయే కేసుల్లో నూటికి 34 మంది ఆటోడ్రైవర్లే ఉంటున్నారు.. ఇది నిజం కాదా? కాదు అంటే చెప్పండి నా వద్ద పూర్తి డేటా ఉంది.. ఇక ఏమాత్రం సహించబోం.. పద్ధతి మార్చుకోవడానికి ఐదు రోజులు సమయం ఇస్తున్నాం.. ఆ తరువాత కఠినంగా వ్యవహరిస్తాం’ అని జిల్లా ఎస్పీ ఆర్‌.వెంకటేశ్వర్లు ఆటోడ్రైవర్లను తీవ్రస్థాయిలో హెచ్చరించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని రాయల్‌ ఫంక్షన్‌హాల్‌లో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆటోడ్రైవర్ల సంఘ వ్యతిరేక చర్యలపై కాస్త గట్టిగానే మందలించారు. రెండుగంటల పాటు ఆటోలు నడపడం.. జేబులో రూ.2-3వందలు జమకాగానే ఆటోపక్కన పడేసి ఆమ్మాయిల వెంట తిరుగుతున్నారని చెప్పారు. ఆటోడ్రైవర్లు కాని కొందరు జల్సాకోసం ఆటోలు నడుపుతూ సంఘవ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని, ఇన్‌షర్ట్‌ వేయడం, రోమన్‌ కట్టింగ్‌ చేయించుకుని ఫ్యాషన్‌గా ఉండి చిల్లరగా జాయ్‌ రైడింగ్‌ చేస్తూ అమ్మాయిల వెంట పడటం కరెక్ట్‌కాదని, కొందరి చర్యల కారణంగా ఆటోడ్రైవర్లకు మచ్చవస్తుందని అన్నారు. ఆటోలను అద్దెకు ఇచ్చేవారు వారి క్యారెక్టర్‌ను గమనించాలని లేదంటే మీరూ ఇబ్బంది పడాల్సి వస్తుందని స్పష్ఠం చేశారు. ఆటోలలోనే గంజాయి, గుట్కా సరఫరా చేస్తున్నారని అన్నారు. నెంబర్‌ ప్లేట్‌ లేకుండా తిరగడం, నెంబర్‌ ప్లేట్లను తారుమారు చేయడం సరికాదన్నారు. ఇకపై నెంబర్‌ ప్లేట్‌ లేకుండా వాహనం నడిపితే దొంగతనం చేసిన వాహనంగా పరిగణిస్తామన్నారు.  నేటి నుంచి ఐదురోజులు సమయం ఇస్తున్నామని, డ్రైవర్‌ నడిపినా, ఓనర్‌ నడిపినా యూనిఫామ్‌ వేసుకోవాలని, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. దొంగతనం చేసిన వ్యక్తులను చూసి చెప్పకపోవడం కూడా నేరం చేసినట్లేనని ఎస్పీ వెల్లడించారు. అందరూ లైసెన్స్‌, ఇన్సూరెన్స్‌ తప్పనిసరిగా కలిగి ఉండాలని తెలిపారు. ఏఎస్పీ ఏ.రాములు, డీఎస్పీ మహేశ్‌, ఇన్‌స్పెక్టర్లు ప్రవీణ్‌కుమార్‌, అశోక్‌, ఎస్సై గోపాల్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-30T05:17:11+05:30 IST