Abn logo
Feb 27 2020 @ 01:00AM

ఛీ కొట్టుకోవాలి, మనల్ని మనం!

ఢిల్లీలో జరిగిన ఘోరానికి ఒకరిని ప్రత్యక్షంగానూ, చాలా మందిని పరోక్షంగానూ నిందించవచ్చు. ఎవరో ఒకరి మీద మన ఆక్రోశాన్ని గురిపెట్టుకోవచ్చు. కానీ, ఇది జరిగాక కూడా, ఇట్లా జరుగుతుందని తెలిశాక కూడా, మరొకచోట ఇట్లా జరిగితే, జరిగే పరిస్థితే వస్తే, అందుకు ఆ ఒక్కరే కాదు, ప్రతి ఒక్కరూ బాధ్యులే అవుతారు. మీరూ, నేనూ అతడూ, ఆమె అందరూ జవాబుదారీయే.


అయ్యా నాయకులుంగారూ, చేసిన చట్టంలో ఈ దేశపౌరులకు నష్టం జరిగేది ఏదీ లేదంటున్నావు. పదే పదే అదే వల్లిస్తున్నావు. అయినా, ఎందుకు నమ్మకం కలగడం లేదు? నమ్మకం కలిగించవలసిన బాధ్యత ఎవరిది? పాలించేవాడే కదా, ఆలకించాలి, లాలించాలి. అంటే, ఆ చట్టం పేరు మీద దేశంలో ఈ విభజన, అభద్రత వర్థిల్లాలని నువ్వే కోరుకుంటున్నావని అనిపిస్తే తప్పేముంది? ఈ దేశ దౌర్భాగ్యం కాకపోతే, ఇంతగా వ్యతిరేకత వ్యక్తమవుతున్న చట్టానికి పార్లమెంటులో జై కొట్టడమేమిటి, చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమేమిటి? పార్లమెంటులో జైకొట్టిన పక్షాలన్నీ నేటి దుర్మార్గానికి కారకులే. 


సిగ్గుండాలి– ఈ మాట ఒక్కటి అనలేదు కానీ, టెలిగ్రాఫ్‌ పత్రిక బుధవారం నాడు అంతకంటె ఎక్కువే అన్నట్టుంది. ఢిల్లీ తగలబడుతుంటే, నీరోల్లాగా డిన్నర్లు చేశారని రాష్ట్రపతి భవన్‌ బొమ్మ వేసి మరీ వ్యాఖ్యానించింది. ఇది ఢిల్లీకి పాకిన గుజరాత్‌ నమూనా అని పతాకశీర్షికలోనే అభిప్రాయపడింది. ట్రంపు తాజ్‌మహల్‌లో పరవశిస్తుంటే ఢిల్లీ తగలబడుతోందని అమెరికా, ఇంగ్లండ్‌ పత్రికలు మునుపే రాశాయి. ఎందుకోసం వచ్చాడో ఏమి సాధించుకుని పోయాడో తెలియదు కానీ, ఎన్నికల ఏట ట్రంపుకి ఇండియా యాత్ర అచ్చిరాలేదు. ప్రపంచమంతా తప్పు పడుతున్న విధానాల విషయంలో నోరుమెదపకుండా, అదే పనిగా హగ్గుల మీద హగ్గులు ఇచ్చిరావడమేంటని డెమొక్రాట్లే కాదు, నైతిక ఆధిక్యభావన కలిగిన అమెరికన్లందరూ తప్పుపడతారు. ఇండియాకు ఆయుధాలు అమ్మడమేంటని డెమొక్రటిక్‌ అభ్యర్థిత్వ రేసులో ముందుకు వెడుతున్న బెర్నీ శాండర్స్‌ ఘాటుగానే విమర్శిస్తున్నాడు. వందల కోట్లు ఖర్చుపెట్టి, ఇంత ఘనంగా అతిథి మర్యాద చేస్తే, ఆ ఘరానా అంతా ఎటో పోయి, ఢిల్లీ వైఫల్యం ఒక్కటే ప్రపంచం చూస్తోంది. ప్రపంచం ముందు భారత్‌ ఇవాళ దోషిగా నిలబడింది రాజధాని కొంతభాగంలో హింసాకాండ జరిగిందని మాత్రమే కాదు, మానవత్వపు దరిదాపుల్లో కూడా సంచరించని నేతలను, మాటలకు కూడా అందని వారి నైతిక హీనతను ఈ దేశం ఎట్లా భరిస్తున్నదా అని లోకులు ఆశ్చర్యపోతున్నారు. ఏదో చెబుతారే, ఆధ్యాత్మిక దేశమని, తాత్వికత వెల్లివెరుస్తుందని, సహనమే సంస్కృతి అనీ... ఎక్కడుంది అమాత్యా? మాతృదేశాన్ని ప్రపంచం ముందు ఇంతగా అవమానాల పాలు చేస్తారా? 


ఇది మానవీయ స్థితి, దీనిలోకి రాజకీయాలు తీసుకురావద్దట. అమానుష స్థితులను, అమానవీయ కృత్యాలను రాజకీయాలకు ఉపయోగించకూడదని ఎప్పటినుంచి తెలిసిందో వారికి, ఆశ్చర్యమే! ప్రతిపక్ష నాయకురాలు అకస్మాత్తుగా ప్రత్యక్షమై, ఆరోపణలు గుప్పిస్తే, కొంత ఆశ్చర్యం ఉంటుంది, కోపమూ వస్తుంది. తనపార్టీ ఇంకా బతికే ఉన్నదని చెప్పడానికి ఓకె కానీ, ఈ నేరంలో తమ పార్టీకి ఏ పాత్రా లేనట్టు, ఆరోపణలు గుప్పించడం మాత్రం అన్యాయమే. దేశవ్యాప్తంగా, ఒక రాజ్యాంగ అంశం మీద ప్రజాందోళనలు జరుగుతుంటే, ఆ ఉద్యమానికి నాయకత్వం వహించకపోతే మానె, కనీసం అండదండలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఆ పార్టీ నాయకత్వం ఉన్నది. అధికారంలో ఉన్న రోజుల్లో, తాము, తమ భాగస్వాములు ఆరగింపులో ఆరితేరి ఉండకపోతే, తమరు ఓడిపోయి ఉండేవారు కాదు. దేశానికి ఈ స్థితి ప్రాప్తించేదీ కాదు. మీది స్వయంకృతం. ప్రజలు తమకున్న అవకాశాల మేరకు స్పందించారు. ఇప్పుడు అవకాశాలే లేని దుస్థితి దాపురిస్తోంది. మూడు దఫాలు ఢిల్లీని ఏలారు, ఇప్పుడు జీరోగా మిగిలారు. ముప్పైఐదేళ్ల కిందట ఢిల్లీలో తమ దుర్మార్గం, ప్రత్యర్థులకు తిరుగులేని ఆయుధం, ఇంకేం నైతికత ఉన్నది మీకు? సెక్యులరిజం అన్నది ప్రభుత్వ విధానం మాత్రమే కాదు. అది ఒక ప్రజాజీవన శైలి. మీ ప్రభుత్వాలు సరే, మీ పార్టీ, మీ శ్రేణులు ప్రజలలో కాసింత సహనాన్ని నేర్పలేకపోయినాయా? 


ఎంతగా భ్రష్టు పట్టిపోయినా, కాంగ్రెస్‌ చేస్తున్న ఆరోపణలను తీసిపారేయలేం. శాంతియుతంగా సాగుతున్న ఆందోళనను పనిగట్టుకుని హింసాయుతం చేసి, ఉభయ మతాల వారినీ బాధితులు చేసిన పాపం ఎవరిదో అందరికీ తెలిసిందే! ఏం మనుషులండీ వీళ్లు, పెత్తందారీ దేశాధిపతి వస్తున్నాడంటే, దరిద్రం కనిపించకుండా గోడలు కడతారు, తమ పార్టీ నేతల నోళ్లకు తాళాలు వేయలేరా? అక్కడో ముఖ్యమంత్రి, ఇక్కడో నాయకుడు, మరోచోట ఓ రాజకీయస్వామి, ఒక యోగి, ఒక భోగి– ఎవడి నోటికొచ్చినట్టు వాడు మాట్లాడుతున్నారు, లేదు లేదు, నోటికొచ్చినట్టు మనసుకు వచ్చినట్టు కాదు, వ్యూహం చెప్పినట్టు మాట్లాడుతున్నారు. మూయకూడదనుకుంటే తప్ప, మూయలేని నోళ్లా అవి? అటువంటి వాచాలురను కట్టడి చేయాలని కోర్టు చెప్పాలా? క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడానికి కోర్టుకు వెళ్లి ఉత్తర్వులు తెచ్చుకోవాలా?


ఇప్పుడిక, శవాల దగ్గరికి వెళ్లి, కాలిపోయిన ఇళ్ల దగ్గరికి వెళ్లి, ఈశాన్య ఢిల్లీలో రహదారుల పొడవునా కనిపిస్తున్న భస్మవాహనాలను చూసి, ఎవడు చేశాడీ పని, ఏ మతం వాడు మరణించాడు, ఏ మతం వాడు చంపి ఉంటాడు– అని ఆరాలు మొదలయినయి. తుపాకీ పట్టుకుని వీరంగం వేసిన ఆ ఫలానా వాడు ఎవడు? ఇవీ ఆసక్తులు. తెలుసుకోవలసిందే. కానీ, ఆలోచన కలిగినవారికి గణాంకాలు అవసరం లేదు. బాధితులలో అందరూ ఉంటారు. ఆయా నిష్పత్తులలో ఉంటారు. జరిగిన సంఘటనలు కొన్ని చోట్ల ఘర్షణలు అయి ఉండవచ్చు. చాలా చోట్ల దాడులే అయి ఉండవచ్చు. అన్నిటికి మించి తెలుసుకోవలసింది, ఈ హింసా సంఘటనలు వాటంతట అవే పుట్టినవి కావు, వాటికి ఒక నేపథ్యం ఉన్నది. ఒక ఉద్రిక్తత ఉన్నది. ఆ ఉద్రిక్తతను రెచ్చగొట్టే శక్తులున్నాయి. ఆ వాతావరణపు విస్ఫోటనమే ఈ సన్నివేశం.


ఎవరో కుట్రపన్నారు, ట్రంప్‌ పర్యటన సందర్భంగా– అంటారు ప్రభుత్వంలోని వ్యక్తులు. జాతీయ అధికారపార్టీ వ్యక్తులే దీనికి పథకరచన చేశారు అంటారు మరి కొందరు. లేదు, హింసాత్మక ప్రకటనలకు రెచ్చిపోయిన సిఎఎ వ్యతిరేక ఉద్యమకారులే హింసకు దిగారని, ఇతరులు ఎదురుదాడులు మాత్రమే చేశారని ఇంకొందరు అంటారు. దీనివెనుక కుట్ర గిట్ర ఏమీ లేదు, అది లేకపోవడమే పెద్ద ప్రమాదం అంటున్నారు యోగేంద్రయాదవ్‌. సిఎఎ– వ్యతిరేక ఆందోళనలు సుదీర్ఘకాలం కొనసాగి, ఆ కాలంలో ఆ ఆందోళనల మీద వివిధ ఆరోపణలు, ఆపాదనలు వస్తున్నప్పుడు, ఆ క్రమం అంతా కూడా దేశవ్యాప్తంగా ఒక విభజనను నిర్మించడానికి విచ్ఛిన్నకర శక్తులు ఉపయోగించుకున్నాయని ప్రగతిశీలురు, చైతన్యవంతులు, ఉదారులతో కూడిన శిష్టసమాజం, గుర్తించలేకపోయిందా? దానికి విరుగుడు చేయవలసిన పక్షాలు మౌనంగా ఉండిపోయాయా? పౌరసత్వ ప్రదానంలో మతవివక్ష ఉండకూడదన్న ఒక సూత్రానికి అనుకూలంగా, వ్యతిరేకంగా జరిగిన అభిప్రాయసమీకరణ, భౌతికరూపంలోకి అనువదితమైతే ఇంత బీభత్సం అవుతుందా? ప్రజలలో ఇంతగా ద్వేషం నిర్మితమవుతోందా? అది అన్నిటికంటె ప్రమాదకరం. ఎందుకంటే, దేశవ్యాప్తంగా ఈ ఆందోళన సాగుతున్నది, ఉద్యమ శిబిరాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. కానీ, విభజన లోలోపల ఏమి చేస్తున్నదో? ఎవరన్నా నిప్పురవ్వ వేస్తే? నోరుతెరిస్తే నిప్పులే కదా, మన నాయకులకు! 


అలాగని,ప్రజాస్వామ్య హక్కు అయిన నిరసనను కట్టిపెట్టుకోవాలా? అట్లా విరమింపజేయడానికే ఇది జరిగిందా? వ్యక్తీకరణ ఆగిందా, నినాదం విశ్రమించిందా, అది కల్లోల మరణాల కంటె ఎక్కువ నష్టం. 


అయ్యా నాయకులుంగారూ, చేసిన చట్టంలో ఈ దేశపౌరులకు నష్టం జరిగేది ఏదీ లేదంటున్నావు. పదే పదే అదే వల్లిస్తున్నావు. అయినా, ఎందుకు నమ్మకం కలగడం లేదు? నమ్మకం కలిగించవలసిన బాధ్యత ఎవరిది? పాలించేవాడే కదా, ఆలకించాలి, లాలించాలి. అంటే, ఆ చట్టం పేరు మీద దేశంలో ఈ విభజన, అభద్రత వర్థిల్లాలని నువ్వే కోరుకుంటున్నావని అనిపిస్తే తప్పేముంది? ఈ దేశ దౌర్భాగ్యం కాకపోతే, ఇంతగా వ్యతిరేకత వ్యక్తమవుతున్న చట్టానికి పార్లమెంటులో జై కొట్టడమేమిటి, చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమేమిటి? పార్లమెంటులో జైకొట్టిన పక్షాలన్నీ నేటి దుర్మార్గానికి కారకులే. కనీసం, దేశవ్యాప్త చర్చ జరిపి, ప్రజాభిప్రాయాన్ని కూడగట్టి ఇటువంటి వివాదాస్పద చట్టాలను ప్రతిపాదిస్తారు. ఏవో మాయ మాటలు చెప్పి, మెజారిటీ సాధించగానే, దేశ ప్రజల జీవితాన్ని అతలాకుతలం చేయగలిగే అధికారం వస్తుందనుకుంటున్నారా?


ఢిల్లీలో జరిగిన ఘోరానికి ఒకరిని ప్రత్యక్షంగానూ, చాలా మందిని పరోక్షంగానూ నిందించవచ్చు. ఎవరో ఒకరి మీద మన ఆక్రోశాన్ని గురిపెట్టుకోవచ్చు. కానీ, ఇది జరిగాక కూడా, ఇట్లా జరుగుతుందని తెలిశాక కూడా, మరొకచోట ఇట్లా జరిగితే, జరిగే పరిస్థితే వస్తే, అందుకు ఆ ఒక్కరే కాదు, ప్రతి ఒక్కరూ బాధ్యులే అవుతారు. మీరూ, నేనూ అతడూ, ఆమె అందరూ జవాబుదారీయే.


దుఃఖిద్దాం. దుఃఖించండి. ఇంత హీనంగా ఉన్నందుకు, ఇంత దీనంగా మారినందుకు, మనచేతులకు ఎవరో నెత్తురు పూస్తున్నందుకు.

ఏమన్నా చేద్దాం, ఏమన్నా చేయండి. మంచిచెడ్డలు చెప్పే పని, మంచిని పెంచే పని, ప్రేమను పంచే పని, ధైర్యం కలిగించే పని.

కె. శ్రీనివాస్