చట్ట ప్రకారమే భూమిని కొన్నాం

ABN , First Publish Date - 2021-05-07T09:41:08+05:30 IST

మేడ్చల్‌ జిల్లా దేవరయాంజాల్‌ వద్ద ఉన్న నమస్తే తెలంగాణ దినపత్రిక ప్రింటింగ్‌ ప్రెస్‌ భూమి విషయంలో కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని ఆ

చట్ట ప్రకారమే భూమిని కొన్నాం

మొత్తం భూమి 4.14 ఎకరాలు మాత్రమే

రేవంత్‌రెడ్డి ఆరోపణలు నిరాధారం

నమస్తే తెలంగాణ ప్రింటింగ్‌ ప్రెస్‌ భూమిపై

పత్రిక యాజమాన్యం టీపీపీఎల్‌ వివరణ


హైదరాబాద్‌, మే 6(ఆంధ్రజ్యోతి): మేడ్చల్‌ జిల్లా దేవరయాంజాల్‌ వద్ద ఉన్న నమస్తే తెలంగాణ దినపత్రిక ప్రింటింగ్‌ ప్రెస్‌ భూమి విషయంలో కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని ఆ పత్రిక యాజమాన్యమైన తెలంగాణ పబ్లికేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (టీపీపీఎల్‌) పేర్కొంది. ప్రింటింగ్‌ ప్రెస్‌ భూమి కొనుగోలు విషయంలో తాము పూర్తి పారదర్శకంగా, చట్ట ప్రకారం వ్యవహరించామని తెలిపింది. ఈ మేరకు టీపీపీఎల్‌ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రింటింగ్‌ ప్రెస్‌ నిర్మాణం కోసం దేవరయాంజాల్‌లో టీపీపీఎల్‌ మూడు దఫాలుగా భూమిని కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. మొదటి డీడ్‌ 2011 జనవరి 5న డాక్యుమెంట్‌ నంబర్‌ 9/2011తో జరిగిందని, సర్వే నంబర్‌ 437లోని ఎకరం భూమిని కె.తారకరామారావు నుంచి  కొనుగోలు చేశామని తెలిపింది.


దీనికి సంబంధించిన ల్యాండ్‌ కన్వర్షన్‌ 2011 ఫిబ్రవరి 11న జరిగినట్లు పేర్కొంది. రెండో డీడ్‌ 2015 మే 6న డాక్యుమెంట్‌ నంబర్‌ 1829/2015తో జరిగిందని, 437 సర్వే నెంబర్‌లోని 2.08 ఎకరాల భూమిని జాదవ్‌ వనమాల వద్ద నుంచి కొనుగోలు చేసినట్లు, ల్యాండ్‌ కన్వర్షన్‌ 2015 నవంబర్‌ 5న జరిగినట్లు వెల్లడించింది.  మూడో డీడ్‌ 2019 సెప్టెంబర్‌ 19న డాక్యుమెంట్‌ నంబర్‌ 10407/ 2019తో జరిగిందని, 437 సర్వే నంబర్‌లోని 1.06 ఎకరాల భూమిని రాజబోయిన యాకయ్య వద్ద నుంచి కొనుగోలు చేసినట్లు పేర్కొంది. అయితే ఈ భూమి కొనుగోలు ఒప్పందం 2015లోనే జరిగిందని, రిజిస్ట్రేషన్‌ 2019లో పూర్తయిందని, దీనికి సంబంధించిన ల్యాండ్‌ కన్వర్షన్‌ 2020 సెప్టెంబరు 25న జరిగిందని వివరించింది. దేవరయాంజాల్‌లో టీపీపీఎల్‌కు ఉన్న మొత్తం భూమి 4.14 ఎకరాలు మాత్రమేనని, ఇదంతా టీపీపీఎల్‌ ప్రతినిధి దీవకొండ దామోదర్‌ (తండ్రిపేరు నారాయణరావు) పేరిట ఉందని తెలిపింది. ఈ మొత్తం భూమి 437 సర్వే నంబర్‌లోనే ఉందని, ఈ సర్వే నంబర్‌ ఎండోమెంట్‌ జాబితాలోగానీ, నిషిద్ధ భూముల జాబితాలోగానీ ఎంతమాత్రమూ లేదని పేర్కొంది. 


పూర్తిగా పట్టా భూమి..

1954-55 ఖాస్రా పహాణీ మొదలుకొని 2020-21 అన్‌ పహాణీ వరకు అన్ని రెవెన్యూ పహాణీల్లోనూ 437 సర్వే నంబరు పూర్తిగా పట్టా భూమి అని టీపీపీఎల్‌ పేర్కొంది. ఈ సర్వే నంబర్‌లో మొత్తం 10.37 ఎకరాల భూమి ఉందని, ఇదంతా కట్టా బాల్‌, కట్టా అంజిరెడ్డి, కట్టా నర్సింహారెడ్డి, కట్టా లక్ష్మారెడ్డి పేరిట ఉందని, వీరి వారసుల నుంచి ఈ భూమిపై క్రయ విక్రయాలు జరిగాయని తెలిపింది. దేవరయాంజాల్‌లో టీపీపీఎల్‌ మొట్టమొదట భూమిని కొనుగోలు చేసింది 2011లో అని, అప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా.. కాంగ్రెస్‌ ప్రభుత్వమే అధికారంలో ఉందని గుర్తు చేసింది. ప్రింటింగ్‌ ప్రెస్‌ నిర్మాణానికి టీపీపీఎల్‌ సంస్థ అప్పటి దేవరయాంజాల్‌ గ్రామ పంచాయతీ నుంచి 2011 మార్చి 14న, ఇన్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ నుంచి 2012 మార్చిలో అనుమతి తీసుకుందని అనుమతి నంబర్‌ జేడీఎం/675/2012గా పేర్కొంది.


అప్పటి నుంచి ప్రభుత్వానికి రుసుములను క్రమం తప్పకుండా చెల్లిస్తూ ఇన్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ నుంచి, విద్యుత్తు శాఖ నుంచి ప్రతి ఏటా అవసరమైన క్లియరెన్సులు పొందుతున్నదని వెల్లడించింది. నాటి దేవరయాంజాల్‌ గ్రామపంచాయతీకి, ఇప్పటి తూముకుంట మునిసిపాలిటీకి ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఆస్తిపన్ను చెల్లిస్తున్నట్లు తెలిపింది.  ప్రింటింగ్‌ ప్రెస్‌ భూమిపై ఎవరికైనా అనుమానాలుంటే, ప్రభుత్వం నియమించిన ఐఏఎ్‌సల కమిటీకి ఫిర్యాదు చేసుకోవచ్చని ప్రకటించింది.  

Updated Date - 2021-05-07T09:41:08+05:30 IST