ప్రతి గింజనూ కొంటాం

ABN , First Publish Date - 2020-04-05T10:23:53+05:30 IST

రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మెదక్‌ జిల్లా చేగుంట

ప్రతి గింజనూ కొంటాం

ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు

చేగుంటలో కొనుగోలు కేంద్రం ప్రారంభం


చేగుంట, ఏప్రిల్‌ 4: రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మెదక్‌ జిల్లా చేగుంట ప్రాథమిక వ్యవసాయం సహకార పరపతి సంఘం కార్యలయంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ మెదక్‌ జిల్లాలో 285 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తితో లాక్‌డౌన్‌ నేపథ్యంలో అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు, వ్యవసాయ, రెవెన్యూ శాఖలు, ప్రాథమిక సహకార సంఘాల ఆధ్వర్యంలో రైతులకు టోకెన్లు అందజేస్తారని తెలిపారు. టోకెన్‌ పొందిన రైతు మాత్రమే ఆ రోజే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని తెలిపారు.


అనంతరం హరీశ్‌రావు కాన్వాయ్‌లో వెళ్తుండగా మెదక్‌ వెళ్లే రహదారిలో చేగుంట పారిశుధ్య కార్మికులు చేతులకు గ్లౌస్‌, మాస్కులు లేకుండా పనులు చేస్తూ కనిపించారు. దీంతో మంత్రి వారిని మందలించారు. మాస్కులు, గ్లౌస్‌తో పాటు శానిటైజర్లను అందచేశారు. కచ్చితమైన జాగ్రత్తలు తీసుకుని పారిశుధ్య పనులు చేయాలని సూచించారు. ఆయన వెంట అడిషనల్‌ కలెక్టర్‌ నగేశ్‌, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి పరశురాం నాయక్‌, మార్క్‌ఫెడ్‌ జీఎం నర్సింగరావు, డీసీఎంఎస్‌ జిల్లా డైరెక్టర్‌ సండ్రుగు స్వామి, జడ్పీటీసీ ముదాం శ్రీనివాస్‌, సర్పంచ్‌ శ్రీనివాస్‌, ఎంపీటీసీ వెంకటలక్ష్మి, తహసీల్దారు విజయలక్ష్మి, ఎంపీడీవో ఉమాదేవి, ఏవో జయశంకర్‌ పాల్గొన్నారు. 


ప్రజలెవ్వరూ అధైర్యపడొద్దు : మంత్రి హరీశ్‌

మెదక్‌ అర్బన్‌: మెదక్‌ ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి కరోనా సోకిందని భయపడొద్దని ప్రజలకు ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు సూచించారు. శనివారం పట్టణంలోని అజంపురలో మెదక్‌, దుబ్బాక ఎమ్మెల్యేలు పద్మారెడ్డి, రామలింగారెడ్డి, కలెక్టర్‌ ధర్మారెడ్డి, అదనపు కలెక్టర్‌ నగేశ్‌తో కలిసి మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రజలతో మాట్లాడుతూ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల ఆధ్వర్యంలో ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు చేస్తున్న సర్వేకు ప్రజలు సహకరించాలన్నారు. వార్డుల్లో రోజుకు రెండుసార్లు సోడియం హైపో క్లోరైడ్‌ రసాయనాన్ని పిచికారి చేయాలన్నారు. పాల కేంద్రాలు తెరవకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు కాలనీ ప్రజలు మంత్రి దృష్టి తీసుకెళ్లారు. పాల విక్రయకేంద్రాన్ని తెరిపించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు హరీశ్‌రావు సూచించారు. 

Updated Date - 2020-04-05T10:23:53+05:30 IST