ప్రతీ గింజ కొనుగోలు చేస్తాం

ABN , First Publish Date - 2020-04-09T10:34:06+05:30 IST

రైతులు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు నిర్భయంగా ఉండాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ స్పష్టంచేశారు

ప్రతీ గింజ కొనుగోలు చేస్తాం

జిల్లా వ్యాప్తంగా 432 కొనుగోలు కేంద్రాలు 

మొక్కజొన్నకు మద్దతు ధర రూ. 1,760

మిర్చి రైతులు కోల్డ్‌స్టోరేజ్‌లను వినియోగించుకోవాలి

నిల్వ ధరలు పెంచితే యజమానులపై చర్యలు

రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌


చింతకాని/రఘునాథపాలెం, ఏప్రిల్‌ 8: రైతులు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు నిర్భయంగా ఉండాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ స్పష్టంచేశారు. చింతకాని మండలంలో లచ్చగూడెం, చింతకాని, నాగిలిగొండ, రఘనాథపాలెం మండలంలోని వీవీ పాలెం, అర్బన్‌ పరిధిలోని అల్లీపురం గ్రామాలలో మక్కలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా  ఏర్పాటు చేసిన సమావేశాలలో  ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ధాన్యం, మక్కలు విస్తారంగా పండాయన్నారు. అందుకు అనుగుణంగా గతంలో 96 కేంద్రాలు ఉండగా ప్రస్తుతం 432 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.


మార్క్‌ఫెడ్‌ ద్వారా 234 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి 3,500కోట్లు కేటాయించి వరి, మొక్కజొన్న కొనుగోలు చేయనున్నట్టు తెలిపారు. ఇప్పటికే 128 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్టు తెలిపారు. మొక్కజొన్నకు మద్దతు ధర రూ.1,760గా నిర్ణయించామన్నారు. ఉమ్మడి జిల్లాకు సరిపడా హార్వెస్టర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. మిర్చి రైతులు తమ మిర్చిని ఏసీ గోడౌన్‌లో నిలువ ఉంచుకోవాలన్నారు. నిల్వ ధరలు పెంచింతే కఠిన చర్యలు ఉంటాయన్నారు. 2లక్షల 40వేల బస్తాలను నిలువచేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందు చూపుతో  సాగునీటి ప్రాజెక్టులు, మిషన్‌ కాకతీయ పనుల వల్ల నీటి సామర్ధ్యం పెరిగి రాష్ట్రం ధాన్యాగారంగా మారిందన్నారు.


కరోనా వైరస్‌ వల్ల కొంత ప్రతిష్టంభన ఉన్నా రైతులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం గ్రామాలలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పంటలు కొనుగోలు చేస్తుందని, రైతులు తొందర పడకుండా సామాజిక దూరం పాటించాలని కోరారు.  రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకొని కనీస మద్ధతు ధరను పొందాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు లాక్‌డౌన్‌ పెంచే అవకాశం అవకాశం ఉందని, ప్రజలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలకు ఇతర సౌకర్యాలు కల్పించనున్నట్టు తెలిపారు.


కార్యక్రమాలలో  మార్క్‌ఫెడ్‌ రాష్ట్ర వైస్‌ చైర్మన్‌ బొర్రా రాజశేఖర్‌, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ,  జడ్పీచైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరావు, ఎమ్మెల్యే రాములు నాయక్‌, డీసీసీబి చైర్మన్‌ కురాకుల నాగభూషణం, రైతు సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరావు, అదనపు కలెక్టర్‌ మధుసుధన్‌రావు,  డీసీఎంఎస్‌ చైర్మన్‌ రాయల శేషగిరిరావు, ఏఎంసీ చైర్మన్‌ మద్దినేని వెంకటరమణ, వైస్‌ చైర్మన్‌ పిన్ని కోటేశ్వరరావు, ఎంపీపీ భూక్యా గౌరి, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2020-04-09T10:34:06+05:30 IST