ప్రతి గింజనూ కొంటాం

ABN , First Publish Date - 2020-03-28T09:34:20+05:30 IST

పండిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు గత్తరబిత్తర, ఆగమాగం కావొద్దని సీఎం కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. వ్యవసాయ మార్కెట్లను

ప్రతి గింజనూ కొంటాం

రైతాంగం గత్తరబిత్తర కావొద్దు: సీఎం

హైదరాబాద్‌, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): పండిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు గత్తరబిత్తర, ఆగమాగం కావొద్దని సీఎం కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. వ్యవసాయ మార్కెట్లను మూసేస్తున్నామని, ఏప్రిల్‌ మొదటి వారంలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమవుతాయని చెప్పారు. గ్రామాలకే అధికారులు వచ్చి కొనుగోళ్లు జరుపుతారని తెలిపారు. ప్రగతి భవన్‌లో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘‘పుచ్చ, ఇతర పండ్ల పంటలు 50-54 లక్షల ఎకరాల్లో చేతికొస్తున్నాయి. వీటి నూర్పిడికి హార్వెస్టర్లు దండిగానే ఉన్నాయి. కానీ.. రైతులు ఆ పంటలను అమ్ముకోవాలి. ఇప్పుడు దేశం మొత్తం కర్ఫ్యూలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అనవసరమైన ఒత్తిడికి, మానసిక ఆందోళనకు గురి కావొద్దు. రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే తీసుకుంటుంది. ప్రస్తుతం మార్కెట్లన్నీ మూసేశారు. ఈరోజు నుంచి మార్కెటింగ్‌ సెక్రటరీలు, సిబ్బంది, వ్యవసాయ శాఖ సిబ్బంది మొత్తం గ్రామాల్లోనే మోహరిస్తారు.


ఏప్రిల్‌ తొలి వారంనుంచి కొనుగోళ్లు ప్రారంభమవుతాయి. మునుపటిలా ఐకేపీ సెంటర్లుండవు. హమాలీలు, బస్తాలు, కాంటాలను చేర్చాలి. కొన్న ధాన్యాన్ని తరలించడానికి వాహనాలు, వ్యాన్లు కావాలి. వీటన్నింటినీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. రైతుబంధు కమిటీ సభ్యులు,  సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు కథానాయకులు కావాలి. మీ ఊరి రైతులు ఎలాంటి ఆటంకాలు లేకుండా ధాన్యం అమ్ముకునేలా సహకరించాలి’’ అని వ్యాఖ్యానించారు. మక్కలు, ధాన్యం, ఇతర పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, కనీస మద్దతు ధరతో చెక్కులను రైతుల ఖాతాల్లో వేస్తుందని తెలిపారు. పంటను తీసుకొచ్చేటప్పుడు రైతులు బ్యాంకు ఖాతా నెంబర్‌, పాస్‌ బుక్కులు తీసుకురావాలని, నెల రోజుల్లో చెక్కు క్లియర్‌ అవుతుందని చెప్పారు. గోదాములు సరిపోకపోతే, గ్రామాల్లోని పాఠశాలలు, కాలేజీలను వాడుకుంటామన్నారు. వారం ఆలస్యమైనా ఊళ్లోనే అమ్ముకోవాలని, మార్కెట్లకు పోవద్దని  రైతులకు సీఎం కేసీఆర్‌ సూచించారు.

  

పండ్లను బయటకు పంపించకండి

బీమార్‌ను ఎదుర్కొనాలంటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని, సీ విటమిన్‌ ఉండే నిమ్మ, బత్తాయి, దానిమ్మ బాగా ఉపయోగపడతాయని సీఎం చెప్పారు. అందుకే, ఈ పండ్లను రాష్ట్రంనుంచి ఇతర రాష్ట్రాలకు పంపించవద్దని, పండ్ల వాహనాలు హైదరాబాద్‌కు వచ్చేలా పాస్‌లు ఇస్తామ ని చెప్పారు. ఈ వాహనాలను ఎవరూ ఆటంకపరచరని, నగరంలోని కాలనీలు, రైతు బజార్లలో అమ్మిస్తారన్నారు. 


పాలు, పశుగ్రాసం వాహనాలకూ..

పాలు, కూరగాయలు, పండ్లు, నిత్యావసర సరుకులతోపాటు పశుగ్రాసం వాహనాలు తిరగాల్సిందేనని, ఎవరూ అడ్డుకోబోరని సీఎం చెప్పారు. చాలామంది దుర్మార్గులు చికె న్‌ తింటే వ్యాధి వస్తుందని తప్పుడు ప్రచారం చేశారని, చికె న్‌, గుడ్లు తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని సీఎం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షలపైగా ఎకరాల్లో పంట చేతికొచ్చిన దశలో ఉందని, దాన్ని కాపాడేందుకు ఏప్రిల్‌ 10 వరకూ ఆన్‌ అండ్‌ ఆఫ్‌ పద్ధతిలో సాగు నీరు ఇస్తామని  తెలిపారు. రైతులు, రైతుబంధు సమితి సభ్యులు, ప్రజా ప్రతినిధులు సమన్వయం చేసుకుని పంట ఎండిపోకుండా కాపాడుకోవాలని సూచించారు. బావులపైన ఆధారపడిన పంటల కోసం మరో 15 రోజులు నిరంతర విద్యుత్తు ఇస్తామని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

Updated Date - 2020-03-28T09:34:20+05:30 IST