మీడియా విచారణలు అవసరం లేదు: శిల్పాషెట్టి

ABN , First Publish Date - 2021-08-02T20:53:02+05:30 IST

తన భర్త, ప్రముఖ పారిశ్రామికవేత్త రాజ్‌కుంద్రా అరెస్టు వ్యవహారంపై ఎట్టకేలకు బాలీవుడ్ నటి..

మీడియా విచారణలు అవసరం లేదు: శిల్పాషెట్టి

ముంబై:  తన భర్త, ప్రముఖ పారిశ్రామికవేత్త రాజ్‌కుంద్రా అరెస్టు వ్యవహారంపై ఎట్టకేలకు బాలీవుడ్ నటి శిల్పాషెట్టి మౌనం వీడారు. పోర్నోగ్రఫీ వీడియోలు తీయడం, సమాచారం సర్క్యులేట్ చేయడం వంటి అభియోగాలపై కుంద్రాను ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు ఇటీవల అరెస్టు అయ్యారు. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో శిల్పాషెట్టి తొలిసారి స్పందిస్తూ, మీడియా తమను ఒంటరిగా వదిలేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రైవేసీ హక్కు తమకు ఉందని, మీడియా ట్రయిల్స్‌తో పని లేదని పేర్కొన్నారు. తనపైన, తన కుటుంబ సభ్యులపైన ట్రోల్స్‌ వస్తున్నాయని, ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున తాను ఇంతవరకూ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. తన పేరుతో ఎవరూ తప్పుడు కోట్స్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు.


శిల్పా ప్రమేయం వెలుగుచూడలేదు...

కాగా, ఫోర్న్ వీడియోల వ్యవహారంలో శిల్పాషెట్టికి చురుకైన పాత్ర ఉందా అనేది తమ విచారణలో ఇంతవరకూ బయట పడలేదని ముంబై పోలీస్ జాయింట్ కమిషనర్ తెలిపారు. దీనిపై దర్యాప్తు జరుపుతున్నామని, ఇందుకు సంబంధించి బాధితులెవరైనా ఉంటే ముంబై క్రైం బ్రాంచ్‌ను సంప్రదిస్తే తాము తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.


సోషల్ మీడియా, వెబ్‌సైట్లలో తమను కించపరచే కామెంట్లు చేయకుండా ఆంక్షలు విధించాలని కోరుతూ శిల్పాషెట్టి గతవారం హైకోర్టును ఆశ్రయంచారు. పలు వార్తలు, తప్పుడు సమాచారం తన ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని, తన పబ్లిక్ ఇమేజ్ దెబ్బతింటోందని ఆమె పేర్కొన్నారు. ఇందుకు సదరు మీడియా సంస్థలు వెంటనే క్షమాపణ చెప్పాలని, తన పరువుకు భంగం కలిగించే కథనాలు, వీడియోలు తొలగించాల్సిందిగా ఆదేశించాలని కోర్టును ఆమె కోరారు. ఇంతేకాకుండా, తనకు రూ.25 కోట్ల పరిహారం కూడా ఇచ్చేలా ఆదేశించాలని శిల్పాషెట్టి కోర్టును కోరారు.

Updated Date - 2021-08-02T20:53:02+05:30 IST