Abn logo
Jun 28 2020 @ 01:26AM

సెప్టెంబరు నాటికి 20 కోట్ల కేసులు!

 • వాటిని తట్టుకొనే శక్తి వైద్య రంగానికి లేదు
 • వీలైనంత త్వరగా సమూహ వ్యాప్తిని నిరోధించాలి

మన దేశంలో సెప్టెంబరు నాటికి 20 కోట్ల కరోనా కేసులు రావచ్చని కొవిడ్‌ నేషనల్‌ టాస్క్‌ఫోర్స్‌ సభ్యుడు, ప్రముఖ సాంక్రామిక వ్యాధుల నిపుణుడు డాక్టర్‌ జయప్రకాశ్‌ మలీల్‌ అంచనా వేశారు. దేశ జనాభాతో పోల్చి చూస్తే ఇది తక్కువే కానీ, అన్ని కేసులను తట్టుకునే సామర్థ్యం మన వైద్య, ఆరోగ్య రంగానికి లేదని అభిప్రాయపడ్డారు. ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజీన్‌ ‘నేచర్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ప్రముఖ జర్నలిస్టు కరణ్‌ థాపర్‌ నిర్వహించే ‘డెవిల్స్‌ అడ్వొకేట్‌’ కార్యక్రమంలోనూ ఆయన తన అభిప్రాయాలను విస్పష్టంగా వెల్లడించారు. అసలు ఈ వైరస్‌ ఎందుకు ఇలా వ్యాపిస్తోంది? 

దీనిని ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు? దీనికి ఉన్న పరిష్కార మార్గాలేమిటి? వంటి అనేక ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు. 


 • పట్టణాలతోపాటు పల్లెలకూ వైరస్‌ వ్యాప్తి
 • యువత ఎక్కువ కావడంతోనే మరణాలు తక్కువ
 • మృతులకు పరీక్షలు చేయకపోవడమూ కారణమే
 • లాక్‌డౌన్‌తో లాభం కన్నా నష్టమే ఎక్కువ
 • సామాజిక వ్యాప్తి ప్రభుత్వాల వైఫల్యం కాదు
 • మన దేశంలో వైరస్‌తో సహజీవనమే పరిష్కారం
 • వృద్ధులకు స్వచ్ఛంద క్వారంటైన్‌ మంచిది
 • వైద్య సదుపాయాలు పెంచుకోవడమే మార్గం
 • కొవిడ్‌ నేషనల్‌ టాస్క్‌ఫోర్స్‌ సభ్యుడు 
 • జయప్రకాశ్‌ మలీల్‌ ఇంటర్వ్యూ


అమెరికా, ఇటలీ, స్పెయిన్‌ కొవిడ్‌తో తీవ్రంగా దెబ్బతిన్నాయి కదా! భారత్‌ పరిస్థితి ఎలా ఉంది?

కరోనాతో ఆయా దేశాలు బాగా దెబ్బతిన్నాయి. మన దేశంలో వైరస్‌ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రజలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవటం లేదు. దాంతో పట్టణాల్లో బాగా వ్యాపిస్తోంది. కొద్ది వారాలుగా పల్లెలకూ వ్యాపించింది. పాశ్చాత్యదేశాల్లో వైరస్‌ వ్యాప్తి చెందుతున్నప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. లండన్‌లో బాగా వ్యాప్తిస్తున్నప్పుడు బ్రిటన్‌లోని ఇతర పట్టణాల్లో కట్టడి చర్యలు తీసుకున్నారు. దాంతో, వైరస్‌ వ్యాప్తి తగ్గిపోయింది. మన దేశంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. సెప్టెంబరు నాటికి భారత్‌లో 20కోట్ల కేసులు వస్తాయని అంచనా. ఈ సంఖ్య ఎక్కువ అనిపించవచ్చు. కానీ, మన జనాభా 138 కోట్లలో 20 కోట్లు ఎక్కువ కాదు. కానీ, ఇన్ని కేసులను తట్టుకొనే సామర్థ్యం మన వైద్య, ఆరోగ్య రంగానికి లేదు. వెంటనే చికిత్స, ఆక్సిజన్‌ సదుపాయాలు అందించే ఏర్పాట్లు చేసుకోవాలి.


భారత్‌లో మరణాల రేటు తక్కువ.. నిజమేనా?

10 లక్షల జనాభాలో ఎంతమంది మరణిస్తున్నారనే గణాంకాల ఆధారంగా మరణాల రేటును లెక్కగడతారు. భారత్‌ జనాభాలో యువత సంఖ్య ఎక్కువ. దాంతో, మరణాల సంఖ్య కూడా తక్కువే. చాలా ప్రాంతాల్లో మరణించిన వారందరికీ ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయటం లేదు. 138 కోట్ల జనాభాలో ఇది సాధ్యం కాదు. అలాగే, భారత్‌లో 66ు మరణాలు పల్లెల్లోనే. అక్కడ మరణాలకు కారణాలు తెలుసుకోవటం కష్టం.


కరోనా వ్యాప్తిని నివారించటానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మీ అభిప్రాయమేమిటి?

లాక్‌డౌన్‌కు దేశంలో మంచి స్పందన రాలేదు. ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. కరోనాతో సమాజంలోని అనేక వర్గాల ప్రజలకు ఎదురైన ఇబ్బందులను పరిష్కరించలేకపోయాం. ముందే జాగ్రత్తగా ఆలోచించి లాక్‌డౌన్‌ను ప్రకటిస్తే ఇంత నష్టం జరిగేది కాదు. సమయం మించిపోతోందనే ఆలోచనతో లాక్‌డౌన్‌ను ప్రకటించారు. దానివల్ల మనకు కలిగిన లాభం కన్నా నష్టం ఎక్కువనేది నా అభిప్రాయం. 


ప్రజలకు 4 గంటల వ్యవధి ఇచ్చి లాక్‌డౌన్‌ ప్రకటించారు. ముందుగా ప్రకటిస్తే లాభం ఉండేదా?

భారత్‌లాంటి పెద్ద దేశంలో కొవిడ్‌పై అందరికీ సమాచారం ఇవ్వడం కష్టమే. వైరస్‌ వ్యాపిస్తోందని లాక్‌డౌన్‌ వల్లే అందరికీ తెలిసింది. సాంక్రామిక వ్యాధు ల గురించి సామాన్యులకు అవగాహన కల్పించటం సులభం కాదు. అయితే, లాక్‌డౌన్‌ గురించి ప్రజలకు ముందే హెచ్చరించి, ఎంత బాధ్యతాయుతంగా ప్రవర్తించాలో చెబితే బాగుండేది. హఠాత్తు లాక్‌డౌన్‌తో ప్రజలు ఆశ్చర్యపోయారు. వలస కార్మికులు, దినసరి కూలీలు.. అనేక మంది నష్టపోయారు.


కొన్ని పట్టణాల్లో సామాజిక వ్యాప్తి జరిగినట్లు తెలు స్తోంది. ప్రభుత్వాలు కాదంటున్నాయెందుకు?

సామాజిక వ్యాప్తి జరిగిందని అంగీకరించడం కరోనాపై పోరాటంలో ఓటమి అని వారు భావిస్తుండొచ్చు. సామాజిక వ్యాప్తి ప్రభుత్వాల వైఫల్యం కాదు. వైరస్‌ ఎలాంటి లక్షణాలు లేని వారి ద్వారా వ్యాప్తి చెందుతుంది. అందుకే దాని వ్యాప్తిని ఆపటం కష్టం. ప్రభుత్వం ఇటీవల చేసన సీరో సర్వేలో 0.73ు గ్రామీణ జనాభాలో యాంటీ బాడీలు ఉన్నాయని తేలింది. ఆదివాసీలు కాకుండా గ్రామాల్లో నివసిస్తున్న జనాభా 73 కోట్లు. యాంటీ బాడీల ఆధారంగా వీరిలో 50 క్షల మందికి ఇప్పటికే కొవిడ్‌ వచ్చి తగ్గిందని తెలుస్తోంది. గ్రామీణ ప్రజలు విదేశాలకు వెళ్లరు. అక్కడి ప్రజలకు వచ్చిందంటే పట్టణాల నుంచి వ్యాప్తి చెందినట్లే.


కొవిడ్‌ బాగా వ్యాప్తి చెందిన పట్టణాల్లో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి?

కకొవిడ్‌ ఉన్న రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్‌ చేస్తున్నారు. నా ఉద్దేశంలో వీరిని హోటళ్లలోనో, ఆస్పత్రుల్లోనో క్వారంటైన్‌ చేయకుండా ఇంటికి పరిమితం చేస్తే మంచిది. ఇక, వీరిలో చాలామందికి పరీక్షలు జరగడం లేదు. దాంతో, వారికి అసలు కొవిడ్‌ సోకిందో లేదో కూడా తెలియదు. సామాజిక వ్యాప్తి జరుగుతోందనే విషయం స్పష్టంగా తెలుస్తున్నప్పుడు వీరిని ఆస్పత్రుల్లో ప్రభుత్వ ఖర్చుతో క్వారంటైన్‌ చేయటం వల్ల ప్రయోజనం ఉండదు. ఈ నేపథ్యంలో, మనం రెండు అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తే మంచిది. మొదటిది, వృద్ధులను స్వచ్ఛందంగా క్వారంటైన్‌ చేయటం. తద్వారా, వారిని ఇతరుల నుంచి కాపాడటం. ఇక రెండోది, ఆస్పత్రుల్లో సదుపాయాలను కల్పించటం. రోగులకు ఆక్సిజన్‌ సౌకర్యాలు కలగజేయటం. వీటితో అనేకమందిని రక్షించవచ్చు.


వైర్‌సపై పోరాటంలో మనం ఓడిపోతున్నామనే అభిప్రాయం వ్యక్తమవుతోంది కదా!

వైర్‌సపై పోరాటంలో జయాపజయాలు ఉండవు. ఒకసారి వ్యాపించటం మొదలుపెట్టిన తర్వాత ఒక షెడ్యూల్‌ ప్రకారమే వ్యాపిస్తుంది. జాగ్రత్తలు తీసుకుం టే వ్యాప్తి తగ్గుతుంది. తొలుత, మనం లాక్‌డౌన్‌తో అడ్డుకునేందుకు ప్రయత్నించాం. తర్వాత వైర్‌సను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ రెండింటిలోనూ విజయం సాధించలేదు. తక్కువ జనాభా ఉన్న దేశాల్లోనే ఇది సాధ్యమవుతుంది. ఎక్కువ జనాభా దేశాల్లో వైర్‌సతో సహజీవనం చేయడం నేర్చుకోవాలి. వీలైనంత త్వరగా హెర్డ్‌ ఇమ్యూనిటీని పెంచుకోవాలి.


సీరో సర్వేతో ప్రయోజనం ఎంత చేకూరింది?

కట్టడి ప్రాంతాలు, హాట్‌ స్పాట్లలో 30 శాతం మందికి వైరస్‌ సోకిందంటూ సీరో సర్వేలో తేలిన విషయం నిజమే. ఈ సర్వేను చాలా శాస్త్రీయంగా నిర్వహించారు. దీనిపై ఇంకా విశ్లేషణ జరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో 30 శాతం మందికి సోకిందనే విషయం బయటకు వస్తే ప్రజలు ఆందోళన చెందుతారని ప్రభుత్వం భావిస్తూ ఉండవచ్చు. ఈ తరహా సర్వేలను తరచూ చేస్తూ ఉండాలి. అప్పుడు జనాభాలో ఎంత శాతం మందికి వైరస్‌ సోకిందనే విషయం తెలుస్తుంది.


సమూహ వ్యాప్తి ప్రభావం ఎలా ఉండవచ్చు?

గత నెల 20న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. కొవిడ్‌తో మరణించే వారిలో 48.8 శాతం అరవై ఏళ్లలోపువారే. యూర్‌పలో ఇది కేవలం 5 శాతం మాత్రమే. దీని ఆధారంగా చూస్తే.. హెర్డ్‌ ఇమ్యూనిటీ మన దేశంలో పనిచేయటం లేదనే వాదన ఉంది. 60 ఏళ్లు దాటిన వారి మరణాల్లో ఎక్కువ శాతం కొవిడ్‌ మరణాలుగా నమోదు కావడం లేదు. పరీక్షలే కాకుండా మనం ఇతర వ్యూహాలను కూడా ఆలోచించాలి. ప్రస్తుతం వైరస్‌ ఒక ప్రాంతంలో మాత్రమే కాకుండా.. అన్ని ప్రదేశాలకు వ్యాపించింది. ఇప్పుడు మనం చేసే పరీక్షలు ఎంతమందికి కొవిడ్‌ ఉందనే విషయంతోపాటు ఎంతమందికి వైద్యం అవసరం ఉందనే విషయాన్ని తెలియజేసేలా ఉండాలి.


- స్పెషల్‌ డెస్క్‌Advertisement
Advertisement
Advertisement