మాకూ ‘దళితబంధు’ కావాలి...

ABN , First Publish Date - 2021-08-01T05:43:02+05:30 IST

ఉప ఎన్నిక జరిగే హుజురాబాద్‌లోనే..

మాకూ ‘దళితబంధు’ కావాలి...

జిల్లా వ్యాప్తంగా వర్తింప జేయాలిని డిమాండ్‌ 

విఫలమైన భూమి కొనుగోలు పథకం 

ఏడేళ్లలో 57 మందికే చేకూరిన ప్రయోజనం


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌): ఉప ఎన్నిక జరిగే హుజురాబాద్‌లోనే కాకుండా జిల్లా అంతటా దళితబంధు పథకాన్ని అమలు చేయాలనే డిమాండ్‌ బలంగా వ్యక్తమవుతున్నది. దళితులకు మూడెకరాల భూమి కొనుగోలు పథకం జిల్లాలో విపలమై పోవడం, ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా అరకొర ఇచ్చే సబ్సీడీ రుణాలు ఉపాధికల్పించలేక పోవడంతో దళితబంధు పథకాన్ని జిల్లా వ్యాప్తంగా సంపూర్ణ స్థాయిలో అమలు చేయాలని దళితులు కోరుతున్నారు. గడిచిన ఏడేళ్లలో ప్రభుత్వం జిల్లాలో 57 మందికి మాత్రమే భూమి కొనుగోలు పథకం లబ్ధి చేకూర్చగా ఎస్సీ కార్పొరేషన్‌ సబ్సిడీ రుణాలు అంతంతమాత్రంగానే లభిస్తున్నాయి. ప్రతి ఏడాది ఐదు కోట్ల నుంచి ఏడు కోట్ల రూపాయల మేరకే జిల్లాకు కేటాయించడంతో ఉపాధికల్పనపై ఆశలు వదులుకుంటున్నారు. అది కూడా ఒక్కోసారి కార్యాచరణ ప్రణాళికను అమలు చేసే సరికి రెండేళ్లు కూడా పడుతున్నది. దీంతో దళితబంధు పథకం ద్వారా జిల్లాలో ఉన్న దళితకుటుంబాలన్నిటికి ఆర్థిక సహాయం అందించాలనే డిమాండ్‌ వస్తున్నది. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా దళితులకు భూమి కొనుగోలు పథకాన్ని ఏడేళ్లుగా అమలు చేస్తున్నా ఆచరణలో మాత్రం విఫలమైందనే చెప్పవచ్చు. 


దళితులకు ఇచ్చింది 152 ఎకరాలు ఎనిమిది గుంటలు

2014 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 57 మంది దళితులకు 152 ఎకరాల 8 గుంటల వ్యవసాయ భూమిని మాత్రమే పంపిణీ చేశారు. ఇందుకోసం 8.40 కోట్ల రూపాయలు వెచ్చించారు. 

- ఈ పథకం కింద లబ్ధి పొందిన 57 మందికి మొదటి సంవత్సరం పంట వేసుకోవడానికి 19.13 లక్షలు అందించారు. 22 బోరుబావులు తవ్వించి 12 సబ్‌మెర్జుబుల్‌ పంపుసెట్లు సమకూర్చారు. 

- 2014-15లో ఐదుగురికి 83.46 లక్షలు వెచ్చించి 15 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఇచ్చారు.

- 2015-16లో 16 మందికి 2 కోట్ల 23 లక్షల 94వేల రూపాయలతో 45.03 ఎకరాలు, 2017-18లో 34 మందికి 4 కోట్ల 94 లక్షల 37వేల రూపాయలు వెచ్చించి 86.5 ఎకరాలు, 2018-19లో ఇద్దరికి 38.40 లక్షల రూపాయలతో ఆరు ఎకరాల భూమిని కొనుగోలు చేసి అందించారు. 


జిల్లాలో దాదాపు 75 వేల కుటుంబాలు

2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 1,86,648 మంది దళితులు ఉన్నారు. వీరు జిల్లా జనాభాలో 18.54 శాతంగా ఉన్నారు. గడిచిన పదేళ్ళలో దళిత జనాభా 2లక్షల 20వేల వరకు చేరుకున్నదని అంచనా వేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 70 వేల నుంచి 75 వేల దళిత కుటుంబాలు ఉండగా 57 కుటుంబాల వారికి మాత్రమే భూమి కొనుగోలు పథకం కింద లబ్ధి చేకూరింది. ప్రభుత్వం ఎకరాకు ఏడు లక్షల రూపాయల ధర మాత్రమే చెల్లించడానికి నిర్ణయించడంతో ఆ ధరకు భూమిని అమ్మడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో భూమి కొనాల్సిన ఎస్సీ కార్పొరేషన్‌ చేతులెత్తేసింది. గడిచిన మూడేళ్లలో ఒక్కరికి కూడా భూమి కొనుగోలు చేసి ఇవ్వలేని పరిస్థితి జిల్లాలో నెలకొన్నది. 


అరకొరగా సబ్సిడీ రుణాలు

సబ్సిడీ రుణాలకు యేటేటా కార్యాచరణ పథకాన్ని రూపొందించి పంపిస్తున్నా దానికి అనుమతి ఇవ్వడానికి, అనుమతి ఇచ్చిన తర్వాత దానిని అమలు చేయడానికి మరో ఏడాది పడుతున్నది. దీంతో సబ్సిడీ రుణాలు కూడా రెండేళ్లకోసారిగానీ పొందలేని పరిస్థితి ఉత్పన్నమవుతున్నది. యేటా ఐదు కోట్ల నుంచి ఏడు కోట్ల మేరకే ఈ రుణాల కోసం కేటాయిస్తుండడంతో యువకులందరికి రుణాలు లభించక ఉపాధికల్పించుకోలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్‌ నియోజకవర్గంలోనే కాకుండా జిల్లావ్యాప్తంగా అంతటా అమలు చేయాలని, ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని దళితులు కోరుతున్నారు. దళితబంధును జిల్లావ్యాప్తంగా ఉన్న 70వేల కుటుంబాలకు అందుబాటులోకి తీసుకువస్తే ప్రతి కుటుంబం ఉపాధి పొందే అవకాశం కలిగి ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయని, ఆత్మగౌరవంతో బతికే వీలుకలుగుతుందని దళితులు అంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ పథకం కింద లక్ష కోట్లయినా వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించినందున ఆమేరకు ఒక ప్రణాళికను రూపొందించి అందరికీ దళితబంధును అందుబాటులోకి తీసుకురావాలని దళితులు కోరుతున్నారు.  జిల్లావ్యాప్తంగా దళితబంధు పథకాన్ని అన్నికుటుంబాలకు వర్తింపజేయాలని డిమాండ్లు వస్తుండడంతో రాజకీయ పార్టీలు కూడా దీనిని ఉపయోగించుకొని లబ్ధి పొందాలని చూస్తున్నాయి. ప్రస్తుతం హుజూరాబాద్‌ను పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసినా జిల్లావ్యాప్తంగా దీన్ని అన్నికుటుంబాలకు వర్తింపజేయాలని బీజేపీ, కాంగ్రెస్‌పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఇప్పటికే ఆ పార్టీలు తమ ఎస్సీ విభాగాల ద్వారా ఆందోళనకు శ్రీకారం చుట్టాయి. 


Updated Date - 2021-08-01T05:43:02+05:30 IST