కొవిడ్‌పై పోరులో భాగస్వామ్యులు కావాలి

ABN , First Publish Date - 2021-04-20T05:37:08+05:30 IST

కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తున్నందున ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి కోరారు.

కొవిడ్‌పై పోరులో భాగస్వామ్యులు కావాలి

 ప్రభుత్వానికి సహకరించకుంటే ప్రైవేటు  వైద్యకళాశాలలను సీజ్‌ చేస్తాం: కలెక్టర్‌ 


గజ్వేల్‌, ఏప్రిల్‌ 19: కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తున్నందున ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి కోరారు. ములుగు మండల కేంద్రంలోని కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లాలో కొవిడ్‌ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు, వ్యాక్సినేషన్‌, కరోనా పాజిటివ్‌ వచ్చిన వారికి అందుతున్న చికిత్సపై ప్రైవేటు కళాశాలల ప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సంద్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో కరోనా వ్యాప్తి వేగంగా ఉందని, జిల్లాలోని ప్రైవేటు, ప్రభుత్వ కళాశాలలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కొవిడ్‌ నియంత్రణకు ప్రైవేటు వైద్యకళాశాలల భాగస్వామ్యం తప్పనిసరి అన్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు వైద్య కళాశాలలకు చికిత్స నిమిత్తం వచ్చిన ప్రతీ బాధతుడ్ని చేర్చుకోవాలని, లాభాపేక్షతో కాకుండా మానవతాథృక్పథంతో సేవలు అందించాలని సూచించారు. రోగులకు వైద్యం అందించని ప్రైవేటు వైద్యకళాశాలలను సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. ప్రైవేటు కళాశాలల్లో కొవిడ్‌ రోగులకు అందుతున్న సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, జాప్యం చేస్తే చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ ముజమిల్‌ఖాన్‌కు సూచించారు. జిల్లాలోని సురభి కళాశాల సూపరిండెంట్‌ గోపీచంద్‌ పనితీరు మార్చుకోవాలని కలెక్టర్‌ సూచించారు. కళాశాల పనితీరుపై క్షేత్రస్థాయి రిపోర్టును తనకు అందజేయాలని అడిషనల్‌ కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌ను కలెక్టర్‌ ఆదేశించారు. తాను ఆకస్మిక తనిఖీలు చేస్తానని, పనితీరులో తేడా వస్తే వైద్య కళాశాల గుర్తింపును రద్దు చేసేందుకు సిఫారసు చేస్తామని హెచ్చరించారు.


వ్యాక్సినేషన్‌ వేగంగా జరిగేందుకు సహకరించాలి


గ్రామాల్లో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ వేగంగా జరిగేందుకు కార్యదర్శులు సహకరించాలని కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి సూచించారు. కార్యదర్శులతో పాటు అంగన్వాడీలు, ఏఎన్‌ఎంలు స్థానిక డాక్టర్లకు సహాయకారిగా ఉంటూ కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ వేగంగా వ్యాక్సినేషన్‌ జరిగేలా చూడాలని కోరారు. ప్రజలు బయటకు రావొద్దని, తప్పనిసరి పరిస్థితుల్లో వస్తే మాస్కు ధరించాలని, శానిటైజర్‌ ఉపయోగించాలని సూచించారు. కాన్ఫరెన్స్‌లో జిల్లా వైద్యాధికారి మనోహర్‌, ప్రభుత్వ వైద్య కళాశాల డైరెక్టర్‌ తమిళ అరసు, ఏవో గోపీచంద్‌, ఆర్వీఎం కళాశాల ఏవో గోపీకృష్ణ పాల్గొన్నారు.


 

Updated Date - 2021-04-20T05:37:08+05:30 IST