కరోనా టెస్టులపై అవగాహన కల్పించాలి

ABN , First Publish Date - 2020-05-27T10:19:19+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా వ్యాధి లక్షణాలున్నవారు స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకునేలా ..

కరోనా టెస్టులపై అవగాహన కల్పించాలి

 రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని


కర్నూలు, మే 26(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా వ్యాధి లక్షణాలున్నవారు స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకునేలా అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లును ఆదేశించారు. మంగళవారం విజయవాడ తన క్యాంపు కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ఆమె వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కరోనా వైరస్‌ కట్టడి, శాంపిల్స్‌ సేకరణ, టెస్టింగ్‌, కంటైన్మెంట్‌ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి కలెక్టర్‌ వీరపాండియన్‌, జేసీ రవిపట్టన్‌ శెట్టి, ట్రైనీ అసిస్టెంట్‌ కలెక్టర్‌ నిధి మీనా, జిల్లా వైద్యాధికారి రామగిడ్డయ్య పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ కరోనా వ్యాధి నివారణ నేపథ్యంలో విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన 31 మందికి కరోనా టెస్టులు నిర్వహించామని,  వారందరికీ నెగెటివ్‌ రిపోర్టు వచ్చిందని తెలిపారు. 


అలాగే మహారాష్ట్ర నుంచి  జిల్లాకు 511 మంది వలస కార్మికులు వచ్చారని, వారిని హోమ్‌ క్వారంటైన్‌లో ఉంచి పరీక్షలు నిర్వహించగా 37 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని కలెక్టర్‌ తెలిపారు. ఇంకొంత మంది రిపోర్టులు రావలసి ఉందన్నారు. పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కావడంతో  కౌతాళం, కోసిగి, ఎమ్మిగనూరు ప్రాంతాలలో కొత్త క్లస్టర్లు ఏర్పాటు చేశామన్నారు. వచ్చే వారం నుంచి  మరింత ఎక్కువ సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తామని తెలి పారు. దీనికిగాను తగిన ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. నాలుగు వేల బెడ్లకు గాను నాలుగు వందల బెడ్లకు ఆక్సిజన్‌ సదుపాయం కల్పించామని, మరో పదహారు వందల బెడ్లకు అందించే ఏర్పాటు చేస్తున్నామన్నారు. వైద్యులు, నర్సులు,  ల్యాబ్‌ టెక్నీషియన్‌ తదితర సిబ్బంది నియామకం చేపడుతున్నామన్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఐఈసీ యాక్టివిటీ  కింద ఇప్పటి వరకు మూడు లక్షల కరపత్రాలను ముద్రించి, వలంటీర్లు, ఆశా వర్కర్ల ద్వారా పంపిణీ చేశామన్నారు.  

Updated Date - 2020-05-27T10:19:19+05:30 IST