ఏపీ ఫైబర్‌ నెట్‌ను లాభాల్లో నడిపిస్తాం

ABN , First Publish Date - 2021-06-13T06:42:56+05:30 IST

ఏపీ ఫైబర్‌ నెట్‌ను లాభాల బాటలో నడిపిస్తామని చైర్మన్‌ డాక్టర్‌ పూనూరు గౌతంరెడ్డి పేర్కొన్నారు.

ఏపీ ఫైబర్‌ నెట్‌ను లాభాల్లో నడిపిస్తాం
సమావేశంలో ప్రసంగిస్తున్న గౌతంరెడ్డి

చైర్మన్‌ గౌతంరెడ్డి


తిరుపతి రూరల్‌, జూన్‌ 12: ఏపీ ఫైబర్‌ నెట్‌ను లాభాల బాటలో నడిపిస్తామని చైర్మన్‌ డాక్టర్‌ పూనూరు గౌతంరెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలోని సంస్థ కార్యాలయాన్ని శనివారం పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోనే 70వేల కనెక్షన్లతో చిత్తూరు జిల్లా అగ్రభాగాన నిలిచిందని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు, పరిశ్రమలు, విద్యాసంస్థలు తమ కనెక్షన్‌ కలిగి ఉన్నాయన్నారు. శ్రీసిటీలోనూ ఫైబర్‌నెట్‌ కనెక్షన్‌ ఇవ్వడానికి చర్యలు చేపడుతున్నామని చెప్పారు. గ్రామాల నుంచి నగరాల వరకు తమ కనెక్షన్లు ఇవ్వాలనేదే లక్ష్యమన్నారు. భూగర్భ వ్యవస్థ ద్వారా ఫైబర్‌ నెట్‌ కనెక్షన్‌ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సమ్మతిని తెలిపిందన్నారు. ప్రతి గ్రామంలోనూ ఇంటర్నెట్‌ పార్క్‌లను ఏర్పాటు చేసి, ప్రతి ఇంటికీ నెట్‌ కనెక్షన్‌ ఇవ్వడానికి సీఎం జగన్‌ కృషి చేస్తున్నారన్నారు. 15 ఎంబీపీఎస్‌ను రూ.197కే అన్‌ లిమిటెడ్‌గా అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో దీనిని పైలట్‌ ప్రాజెక్టుగా చేపడుతున్నామన్నారు. విజయవంతమైతే 100 నుంచి 200 ఎంబీపీఎస్‌ సామర్థ్యానికి తీసుకెళతామన్నారు. సంస్థ పరిధిలో సేవలు అందిస్తూ కరోనా బారినపడి మృతి చెందిన వారికి సంతాపాన్ని తెలియజేశారు. సిబ్బందిని కరోనా వారియర్స్‌గా గుర్తించేందుకు తోడ్పడతానని అన్నారు. ఈ సమావేశంలో నెట్‌వర్క్‌ మేనేజర్‌ దివాకర్‌రెడ్డి, బిల్లింగ్‌ మేనేజర్‌ గోవిందరెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ మేనేజర్‌ ఈశ్వర్‌తేజ, ఎంటర్‌ప్రైనర్‌ మేనేజర్‌ సుధాకర్‌రెడ్డి, మార్కెటింగ్‌ మేనేజర్‌ నరసింహారెడ్డి, అశోక్‌రెడ్డి, కృష్ణచైతన్యప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.


ఎంఎస్‌వో ప్రవల్లికపై చర్యలు తీసుకోండి

ఏపీ ఫైబర్‌నెట్‌ ఎంఎస్‌వో ప్రవల్లికపై చర్యలు తీసుకోవాలని చైర్మన్‌కు ఏపీ ఫైబర్‌ శ్రీవేంకటేశ్వర ఎల్‌సీవో, హెల్పర్‌ అసోసియేషన్‌ నాయకులు విన్నవించారు. శనివారం గౌతంరెడ్డిని యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీధర్‌, ఎల్లయ్య కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ప్రవల్లికతోపాటు ఆమె తండ్రి సుబ్రహ్మణ్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. నిబంధనలకు విరుద్ధంగా ఆపరేటర్ల నుంచి లక్షలాది రూపాయలు అక్రమంగా వసూలు చేశారని ఆరోపించారు. నాయకులు రవి, కిరణ్‌, కృష్ణయ్య, శరత్‌యాదవ్‌, రమణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-13T06:42:56+05:30 IST