లక్షల ప్రాణాలు కాపాడాం!

ABN , First Publish Date - 2022-01-18T06:44:26+05:30 IST

కొవిడ్‌ కాలంలోనూ భారత్‌లో సుస్థిర అభివృద్ధి కొనసాగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ

లక్షల ప్రాణాలు కాపాడాం!

  • ప్రపంచానికి ప్రాణాలను నిలబెట్టే ఔషధాలిచ్చాం
  • ‘వన్‌ వరల్డ్‌.. వన్‌ హెల్త్‌’ నినాదంతో పనిచేశాం
  • కొవిడ్‌ కాలంలోనూ భారత్‌లో సుస్థిర అభివృద్ధి
  • వచ్చే 25 ఏళ్లకు వర్తించేలా విధానాలు
  • పెట్టుబడులకు భారత్‌ చక్కటి గమ్యస్థానం
  • వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సమ్మిట్‌లో ప్రధాని మోదీ


న్యూఢిల్లీ, జనవరి 17: కొవిడ్‌ కాలంలోనూ భారత్‌లో సుస్థిర అభివృద్ధి కొనసాగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కరోనా సమయంలోనూ ఆర్థికాభివృద్ధిపై ప్రభావం పడకుండా జాగ్రత్తపడ్డామన్నారు. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం(డబ్ల్యూఈఎఫ్‌) ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు ఆన్‌లైన్‌లో జరగనున్న ‘దావోస్‌ అజెండా 2022 సమ్మిట్‌’ సోమవారం ప్రారంభమైంది. తొలిరోజు సమ్మిట్‌లో ప్రధాని మోదీ వర్చువల్‌గా మాట్లాడారు. ‘‘సుస్థిర అభివృద్ధి దిశలో భారత్‌ వడివడిగా సాగుతోంది. వచ్చే 25 ఏళ్లు స్థిర అభివద్ధి, క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ విధానాలు, నమ్మదగ్గ లక్ష్యసాధనల దిశగా పయనిస్తాం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. కొవిడ్‌ నుంచి ఎంతో నేర్చుకున్నామని.. మరో కొవిడ్‌ వేవ్‌ సమయంలో ఈ వేదికపై మాట్లాడుతున్నాని చెప్పారు.


‘‘కరోనా కాలంలో మేము సంస్కరణలపై దృష్టి సారించాం. ప్రపంచ ఆర్థికవేత్తలు సైతం సరైన దిశలో అమలు చేసిన సంస్కరణలకు కితాబిచ్చారు. వన్‌ వరల్డ్‌.. వన్‌ హెల్త్‌ నినాదంతో ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్‌, ప్రాణాలను నిలబెట్టే ఔషధాలను అందజేశాం. లక్షల మంది ప్రాణాలను కాపాడగలిగాం. 21వ శతాబ్దిలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లేలా.. సాధికారతకు సాంకేతిక, ప్రతిభను పంచుతున్నాం. ప్రపంచంలోనే మూడో అదిపెద్ద సాఫ్ట్‌వేర్‌ మానవ వనరులను భారత్‌ అందించింది. డిజిటల్‌ ఇండియాలో కొవిడ్‌ సమయంలో తీసుకువచ్చిన ఆరోగ్యసేతు, కొవిన్‌ యాప్‌లు మహమ్మారి కట్టడికి, వ్యాక్సినేషన్‌కు దోహదపడ్డాయి. 156 కోట్ల డోసుల కొవిడ్‌ వ్యాక్సిన్‌ను ప్రజలకు అందజేసిన అతిపెద్ద దేశం భారత్‌’’ అని ఆయన వివరించారు. భారత్‌లో సాంకేతికను అందిపుచ్చుకునే వనరులు ఉన్నాయని, పెట్టుబడులకు ఇది మంచి గమ్యస్థానమని మోదీ వ్యాఖ్యానించారు.


‘‘2014కు మునుపు భారత్‌లో వందల సంఖ్యలో స్టార్ట్‌పలు ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 60 వేలకు పైగా ఉన్నాయి. వాటిల్లో అత్యుత్తమ స్టార్ట్‌పలు(యూనికార్న్‌) 80 దాకా ఉన్నాయి. అందులో 40 స్టార్ట్‌పలు కొవిడ్‌ ఉధృతంగా ఉన్న 2021లో ప్రారంభమయ్యాయి’’ అని పేర్కొన్నారు. కాగా.. కరోనా నేపథ్యంలో ప్రజలు ఇప్పుడప్పుడే మాస్కులు లేకుండా స్వేచ్ఛగా తిరిగే పరిస్థితులు లేవని అమెరికా ఇమ్యూనాలజిస్టు ఆంథొనీ ఫౌచీ పేర్కొన్నారు. ప్రజలు స్వేచ్ఛ మున్ముందు వచ్చే వేరియంట్ల తీవ్రతపై ఆధారపడి ఉంటుందన్నారు.



పర్యావరణ పరిరక్షణకు కృషి అవసరం: డబ్ల్యూఈఎఫ్‌

ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పర్యావరణ పరిరక్షణ కోసం చర్యలు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నా.. సున్నా ఉద్గారాల(నెట్‌ జీరో) లక్ష్యాన్ని చేరడానికి అవి సరిపోవని వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం(డబ్ల్యూఈఎఫ్‌) స్పష్టం చేసింది. ముఖ్యంగా కార్పొరేట్‌ రంగం నుంచి మరింత కృషి అవసరమని పేర్కొంది. ఇప్పటి వరకూ 20ు సంస్థలు మాత్రమే తాము విడుదల చేస్తున్న ఉద్గార వివరాలను వెల్లడించాయి. 9ు సంస్థలు మాత్రమే గత ఏడాది పారిస్‌ ఒప్పంద లక్ష్యాన్ని చేరుకున్నాయి’’ అని డబ్ల్యూఈఎఫ్‌ వెల్లడించింది.


Updated Date - 2022-01-18T06:44:26+05:30 IST