ఆస్తులు అమ్మేస్తాం... మలుపులు తిరుగుతున్న డీహెచ్‌ఎఫ్‌‌ఎల్ వ్యవహారం

ABN , First Publish Date - 2020-10-20T23:41:41+05:30 IST

అప్పుల భారాన్ని తగ్గించుకునే క్రమంలో... అవసరమైతే తమ ఆస్తులను అమ్మివేస్తామని దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్(డీహెచ్‌ఎఫ్‌‌ఎల్) సంస్థ ప్రమోటర్ కపిల్ వాధవాన్ ప్రకటించారు. తన కుటుంబానికి చెందిన రూ. 43 వేల కోట్ల విలువైన ఆస్తులను... రుణాలిచ్చిన బ్యాంకులకు ఇచ్చేందుకు సిద్ధమని వెల్లడించారు. డీహెచ్‌ఎఫ్‌‌ఎల్... దివాలా పరిష్కార చర్యలను ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యక్తిగత, కుటుంబ ఆస్తులను రుణదాతల బకాయిలు చెల్లించేందుకు ఉపయోగిస్తానని ఆయన ప్రకటించారు. దివాలా పరిష్కార చర్యల్లో కంపెనీ ఆస్తులకు గరిష్ట విలువ లభించేందుకు దోహదపడాలని ఈ ఆఫర్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఆస్తులు అమ్మేస్తాం... మలుపులు తిరుగుతున్న డీహెచ్‌ఎఫ్‌‌ఎల్ వ్యవహారం

హైదరాబాద్ / కోల్‌కత : అప్పుల భారాన్ని తగ్గించుకునే క్రమంలో... అవసరమైతే తమ ఆస్తులను అమ్మివేస్తామని దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్(డీహెచ్‌ఎఫ్‌‌ఎల్) సంస్థ ప్రమోటర్ కపిల్ వాధవాన్ ప్రకటించారు. తన కుటుంబానికి చెందిన రూ. 43 వేల కోట్ల విలువైన ఆస్తులను... రుణాలిచ్చిన బ్యాంకులకు ఇచ్చేందుకు సిద్ధమని వెల్లడించారు. డీహెచ్‌ఎఫ్‌‌ఎల్... దివాలా పరిష్కార చర్యలను ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యక్తిగత, కుటుంబ ఆస్తులను రుణదాతల బకాయిలు చెల్లించేందుకు ఉపయోగిస్తానని ఆయన ప్రకటించారు. దివాలా పరిష్కార చర్యల్లో కంపెనీ ఆస్తులకు గరిష్ట విలువ లభించేందుకు దోహదపడాలని ఈ ఆఫర్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. 


డీహెచ్ఎఫ్ఎల్ కార్యకలాపాల పర్యవేక్షణ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) నియమించిన అడ్మినిస్ట్రేటర్ ఆర్ సుబ్రమణియకుమార్‌‍కు అక్టోబర్ 17 న రాసిన లేఖలో కపిల్ వాధవాన్ ఈ విషయాన్ని పేర్కొన్నారు. ఆర్థిక అవకతవకలు, మనీలాండరింగ్ ఆరోపణలనెదుర్కొంటోన్న ప్రమోటర్లు కపిల్ వాధవాన్, ధీరజ్ వాధవాన్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. వీరు... 2006-07 నుండి 017-18 మధ్యకాలంలో రూ.17,394 కోట్ల అక్రమ లావాదేవీలను జరిగపినట్లుగా ఆరోపణలున్నాయి. ప్రమోటర్లు నిధుల మళ్లింపునకు పాల్పడడంతో రుణదాతలు ఈ కంపెనీ ఖాతాను మోసాల పద్దులో చేర్చారు. మరోవైపు సంస్థ తమ చేజారకుండా...  వివిధ ప్రాజెక్టుల్లో తమ కుటుంబానికున్న వాటాలను, హక్కులను బదలాయిస్తామని వాధవాన్ అన్నారు.


అంతేకాకుండా... పలు రియాల్టీ ప్రాజెక్టుల్లో తమ కుటుంబ వాటాల యాజమాన్య హక్కుల బదలీకి కూడా సిద్ధమని వాధవాన్ ప్రకటించారు. ఈ వ్యాల్యుయేషన్ జాబితాలో జుహు గల్లీ ప్రాజెక్టు, ఇర్లా ప్రాజెక్టులున్నాయి. ఇక... వీటన్నింటి విలువ రూ. 43,879 కోట్లు అని వెల్లడించారు. వీటి విలువను మార్కెట్ రేటు కంటే 15 శాతం తక్కువగానే లెక్కగట్టినట్లు తెలిపారు. కాగా... 2018 సెప్టెంబరులో ఐఎల్&ఎఫ్ఎస్ సంక్షోభం తర్వాత డీహెచ్ఎఫ్ఎల్ మాత్రమే కాదని, అన్ని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలూ కుదేలయ్యాయని వాధవాన్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఇక... క్లిష్ట సమయంలో వివిధ అనుబంధ సంస్థలను విక్రయించడం ద్వారా డీహెచ్ఎఫ్ఎల్ దాదాపు రూ. 44 వేల కోట్ల మేరకు చెల్లింపులు జరిపిందన్నారు. ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, అవాన్స్ ఫైనాన్షియల్, డీహెచ్ఎఫ్ఎల్ ప్రమెరికా అసెట్ మేనేజ్‌మెంట్, డీహెచ్ఎఫ్ఎల్ ప్రమెరికా ట్రస్టీ లిమిటెడ్ విక్రయం ద్వారా ఈ బకాయిలు చెల్లించినట్లు తెలిపారు.


డీహెచ్ఎఫ్ఎల్ కొనుగోలుకు... ఈ సంస్థను టేకోవర్ చేసుకునేందుకు ఓక్‌ట్రీ సహా నాలుగు సంస్థలు బిడ్స్ దాఖలు చేశాయి. ఓక్‌ట్రీ కంపెనీ... రూ. 20 వేల కోట్లకు బిడ్ వేసింది. కాగా... రుణసంస్థలకు డీహెచ్ఎఫ్ఎల్  భారీ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంది. కంపెనీ చేతిలో ఉన్న నగదుకు తోడు ఓక్‌ట్రీ ఆఫర్ జతకలిసినప్పటికీ కూడా... రుణసంస్థలు వేలకోట్లు నష్టపోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో... ఈ వ్యవహారం ఏ మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. 

Updated Date - 2020-10-20T23:41:41+05:30 IST