తాలిబన్ల చర్యలనుబట్టి తీర్పు ఇవ్వాలి : కతార్

ABN , First Publish Date - 2021-09-08T20:45:49+05:30 IST

తాలిబన్లు తమ వ్యవహార వాదాన్ని ప్రదర్శించారని

తాలిబన్ల చర్యలనుబట్టి తీర్పు ఇవ్వాలి : కతార్

దోహా : తాలిబన్లు తమ వ్యవహార వాదాన్ని ప్రదర్శించారని, వారి చర్యలనుబట్టి వారు ఆఫ్ఘనిస్థాన్ వివాదరహిత పాలకులా? కాదా? అనే విషయాన్ని నిర్ణయించాలని కతార్ తెలిపింది. అయితే తాలిబన్ల ప్రభుత్వానికి అధికారిక గుర్తింపును ప్రకటించకపోవడం గమనార్హం.


కతారీ అసిస్టెంట్ ఫారిన్ మినిస్టర్ లోల్వాహ్ అల్-ఖతెర్ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఆఫ్ఘనిస్థాన్ సార్వభౌమాధికారంగల దేశమని, ఆఫ్ఘన్లే తమ భవిష్యత్తును నిర్ణయించుకోవాలని, వారి భవిష్యత్తును అంతర్జాతీయ సమాజం నిర్ణయించజాలదని చెప్పారు. తాలిబన్లు ప్రస్తుత పాలకులనేది నిర్వివాదాంశమన్నారు. వారి నుంచి కొన్ని మంచి సంకేతాలు వస్తున్నాయన్నారు. కాబూల్ నుంచి చాలా మంది వెళ్లిపోగలిగారన్నారు. వీరిలో విద్యార్థినులు కూడా ఉన్నారన్నారు. తాలిబన్ల సహకారం లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదన్నారు. 


ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ ప్రభుత్వానికి గుర్తింపునివ్వడంలో తాము తొందరపడబోమని, అదే సమయంలో ఆ ప్రభుత్వంతో పూర్తిగా తెగదెంపులు చేసుకోబోమని చెప్పారు. తాము మధ్యేమార్గాన్ని అనుసరిస్తామన్నారు.


తాలిబన్లు మంగళవారం తమ తాత్కాలిక ప్రభుత్వాన్ని, మంత్రివర్గాన్ని ప్రకటించారు. ముల్లా మహమ్మద్ హసన్ అకుండ్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రభుత్వానికి ఇప్పటి వరకు ఇతర దేశాల గుర్తింపు లభించలేదు. 


తాలిబన్లు తమ ప్రభుత్వాన్ని ప్రకటించడానికి ముందు లోల్వాహ్ అల్-ఖతెర్ ఈ ఇంటర్వ్యూ ఇచ్చారు.


Updated Date - 2021-09-08T20:45:49+05:30 IST