ముంబై 26/11 ఉగ్రదాడికి 12 ఏళ్లు.. యూఎస్ స్పందన ఇది!

ABN , First Publish Date - 2020-11-26T22:36:37+05:30 IST

భారత ఆర్థిక రాజధాని ముంబై నగరంలో 2008, నవంబర్‌లో సరిగ్గా ఇదే రోజున ఉగ్రమూకలు మారణహోమానికి పాల్పడిన సంగతి తెలిసిందే.

ముంబై 26/11 ఉగ్రదాడికి 12 ఏళ్లు.. యూఎస్ స్పందన ఇది!

ముంబై: భారత ఆర్థిక రాజధాని ముంబై నగరంలో 2008, నవంబర్‌లో సరిగ్గా ఇదే రోజున ఉగ్రమూకలు మారణహోమానికి పాల్పడిన సంగతి తెలిసిందే. నేటితో ఈ పీడ కలకు పన్నెండేళ్లు. దాయాది పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రమూకలు పాల్పడిన ఈ మారణకాండను ఇప్పటికీ ముంబై మరిచిపోలేదు. ఈ దాడిలో ఏకంగా 166 మందిని ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. ఈ మారణహోమానికి పన్నెండేళ్లు పూర్తైన సందర్భంగా అమెరికా దీనిపై స్పందించింది. ఈ ఘటనను అత్యంత క్రూరమైన చర్యగా పేర్కొంది. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఆరుగురు అమెరికన్లతో సహా మిగతావారందరికీ న్యాయం జరిగేలా అమెరికా నియబద్ధతతో ఉంటుందని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి కాలే బ్రౌన్ వెల్లడించారు. అలాగే ఉగ్రవాదంపై పోరులో తాము భారత్‌కు మద్దతుగా నిలుస్తామని ఈ సందర్భంగా యూఎస్ ప్రకటించింది. 


పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు మారణకాండకు పాల్పడిన ఈ ఘటన.. ప్రపంచ ఉగ్ర దాడుల్లోనే అత్యంత పాశవికమైన చర్యగా మిగిలిపోయింది. పాకిస్థాన్‌లోని కరాచీ రేవు నుంచి అరేబియా సముద్రం ద్వారా ముంబైలోకి చొరబడిన అజ్మల్ కసబ్ సహా 10 మంది ఉగ్రవాదులు... ఒబెరాయ్, తాజ్‌ మహాల్ హోటల్, చత్రపతి శివాజీ టెర్మినల్‌, లియోపోల్డ్ కేఫ్, నిర్మన్(చబాద్) హౌజ్ వద్ద మారణకాండ సృష్టించారు. ఈ దాడిలో 166 మంది చనిపోగా, 300 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. కాగా, 2012లో అజ్మల్ కసబ్‌కు పుణె జైలులో ఉరి శిక్షను అమలు చేశారు. ఈ పీడ కలకు 12 ఏళ్లు పూర్తైన సందర్భంగా దక్షిణ ముంబైలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్మించిన కొత్త స్థూపం వద్ద ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు, భద్రతా సిబ్బందికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే, గవర్నర్ కోశ్యారీ గురువారం నివాళులర్పించారు.   

Updated Date - 2020-11-26T22:36:37+05:30 IST