Abn logo
Sep 27 2021 @ 01:02AM

మిడ్‌మానేరు నిర్వాసితులకు అండగా ఉంటాం

పాదయాత్రలో బండి సంజయ్‌

- కేసీఆర్‌ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పండి 

- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌  


(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల )

శ్రీరాజరాజేశ్వర మిడ్‌ మానేరు భూ నిర్వాసితుల పట్ల టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దుర్మారంగా ఉందని, నిర్వాసితులకు అండగా ఉంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు.  ఆదివారం బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని బద్దెనపల్లి, రామన్నపల్లె, బస్వాపూర్‌ ఇల్లంతకుంట మండలం రామోజీపేట, పెద్దలింగాపూర్‌ వరకు 17 కిలోమీటర్ల మేర కొనసాగింది. దారి పొడవునా వివిధ వర్గాల ప్రజలు  సమస్యలను విన్నవించారు.  జిల్లాలోని మిడ్‌ మానేరు ప్రాజెక్ట్‌ నిర్వాసితులు పాదయాత్రకు సంఘీభావం తెలిపారు.  టీచర్లు, విద్యావలంటీర్లు, దివ్యాంగులు సమస్యలను విన్నవించారు.  బండి సంజయ్‌ సమస్యలు వింటూ భరోసా కల్పిస్తూ ముందుకు కదిలారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిడ్‌మానేరు నిర్వాసితులకు కనీసం నష్టం పరిహారం చెల్లించకుండా, ఉపాధి కల్పించకుండా మీనామేషాలు లెక్కిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  భూములను త్యాగం చేస్తే పరిహారం ఇవ్వకుండా  రోడ్డున పడేశారని నిర్వాసితులు  గోడు వెలబోసుకుంటున్నారన్నారు. మిడ్‌ మానేరు నిర్వాసితులకు బీజేపీ అండగా ఉంటుందని, వారి తరఫున పోరాడుతుందని అన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని, రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు. దివ్యాంగుల పట్ల టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మానవత దృక్పథంతో వ్యవహరించడం లేదని, దివ్యాంగులు అంటే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి, కేసీఆర్‌కు అంత చులకన ఎందుకని ప్రశ్నించారు.  కనీసం కొత్తపెన్షన్‌లకు కూడా నోచుకోలేని దుస్థితి నెలకొందని అన్నారు.  ఏళ్ల తరబడి దివ్యాంగుల పోస్టులను కూడా భర్తీ చేయడం లేదన్నారు. టీఆర్‌ఎస్‌ పాలనలో దివ్యాంగులు బతకడమే కష్టమైపోయిందన్నారు. ఆగస్టు నుంచే ఆసరా కొత్త పెన్షన్లు ఇస్తామని జూలైలో కేసీఆర్‌ ప్రకటించారని,  15 లక్షల మంది కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. వితంతువులు, దివ్యాంగులు, బోదకాల బాధితులు, గీత, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు పెన్షన్ల కోసం నిరీక్షిస్తున్నారని, కనీసం దరఖాస్తులను పరిశీలించడం లేదని అన్నారు.  ఇప్పటివరకు లబ్ధిదారుల గుర్తింపు, మార్గదర్శకాలు ప్రకటించలేదన్నారు. దివ్యాంగుల కేటగిరీ కింద టీచర్‌ పోస్టులు భర్తీ చేయడం లేదని, 532 బ్యాక్‌ లాగ్‌ పోస్టులను భర్తీ చేయడంలో జాప్యం చేస్తోందని అన్నారు. దివ్యాంగులకు మనోధైర్యం చాలా ఎక్కువగా ఉంటుందని, పారాలింపిక్స్‌లో అత్యధికంగా భారత్‌కు  19 పతకాలు వచ్చాయని అన్నారు. దివ్యాంగుల అభివృద్ధికి ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని, వికలాంగులు అనే పదం కాకుండా దివ్యాంగులు అనాలని మోదీ పిలుపునిచ్చారని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా మోటారు ట్రై సైకిళ్లను పంపిణీ చేస్తున్నారన్నారు. ప్రతీ రాష్ట్రంలో 50 నుంచి వంద భవనాలను దివ్యాంగులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు యోచిస్తున్నట్లు తెలిపారు. దీన్‌దయాళ్‌ డిజేబుల్డ్‌ రిహాబీగేషన్‌ స్కీం ద్వారా చిన్నతనంలోనే దివ్యాంగులను గుర్తించి వారికి అవసరమైన విద్యను అందించేందుకు కేంద్రం ఆర్థిక సహాయాన్ని అందిస్తోందన్నారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని మోదీ ప్రభుత్వ ప్రయత్నిస్తోందని, అతి త్వరలోనే అది సాకారం కాబోతోందని అన్నారు. దివ్యాంగుల హక్కులు సంక్షేమం విషయంలో బీజేపీ రాజీ పడే ప్రసక్తి లేదని, వారి తరపున పోరాడుతుందని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దివ్యాంగులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మిడ్‌మానేరు, భూ నిర్వాసితులకు అండగా ఉంటామన్నారు. కనీసం నష్టపరిహారం చెల్లించకుండా, ఉపాధి కల్పించకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాసితుల ఉపాధి కోసం ఇండస్ట్రీయల్‌ కారిడార్‌ ఏర్పాటు చేయాలన్నారు. పాదయాత్రలో ఏ ఊరికి వెళ్లినా పాఠశాలలు శిథిలావస్థలో కన్పిస్తున్నాయని, కనీస సౌకర్యాలు కూడా లేవని అన్నారు.  చివరకు చాక్‌పీస్‌లకు డబ్బులు లేవటన్నారు. విద్యావలంటీర్లను స్వచ్ఛ కార్మికులను తొలగించి రోడ్డున పడేశారని, ఇదేనా ధనిక రాష్ట్రమని ప్రశ్నించారు. స్కూల్‌ డెవలప్‌మెంట్‌ పథకం కింద రూ.2వేల కోట్లు ఖర్చు పెడతామనీ, ప్రత్యేక బృందం ఢిల్లీకి పోయి నివేదిక సమర్పిస్తుందనీ, నివేదిక రాగానే పనులుమొదలు పెడతామనీ ప్రగాల్భాలు పలికిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివేదిక వచ్చి నెలలు గడుస్తున్నా  పాఠశాలలకు నిధులు మాత్రం ఇవ్వడం లేదనీ అన్నారు. రాష్ట్రంలో 28 వేల మంది పాఠశాలల్లో పనిచేస్తున్న స్వచ్ఛ కార్మికులను కేసీఆర్‌ తొలగించారన్నారు. మాట్లాడితే రూ.2 వేల పెన్షన్‌ ఇస్తున్నామని చెప్పుకునే కేసీఆర్‌ స్వచ్ఛ కార్మికులకు కనీసం రూ.2 వేల వేతనం ఇవ్వలేరా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాల్లో పాఠాలు చెప్పేవారు లేక విద్యా వ్యవస్థ చిన్నాభిన్నమైందని, 12 వేల మంది విద్యావలంటీర్లను కేసీఆర్‌ తొలగించారని అన్నారు. వారికి ఇవ్వాల్సిన రూ.66 కోట్ల బకాయిలు కూడా చెల్లించలేదన్నారు. కేసీఆర్‌ రాష్ట్రంలోని టీచర్లను దారుణంగా మోసం చేశారనీ, పీఆర్సీ నివేదిక వచ్చిన తర్వాత మూడేళ్లకు అమలు చేశారనీ, బకాయిలు చెల్లించలేదనీ అన్నారు. కొత్త టీచర్ల పోస్టుల భర్తీకి దిక్కులేదని, ఏళ్ల తరబడి డీఎస్సీ నోటిఫికేషన్ల ప్రకటన రావడం లేదని అన్నారు. రాష్ట్రంలోని టీచర్ల లోకమంతా కలిసి కేసీఆర్‌ను సీఎం డ్యూటీ నుంచి పీకేయడంలో ముందుండాలన్నారు. అనంతరం పాదయాత్రలో కలిసిన చేనేత కార్మికుల వెతలు విన్న సంజయ్‌ వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామన్నారు. పాదయాత్రలో సినీనటి కరాటే కళ్యాణి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, పాదయాత్ర ప్రముఖ్‌ జి.మనోహర్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ప్రేమేందర్‌రెడ్డి, ప్రతీప్‌కుమార్‌, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్‌.కుమార్‌, రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్‌రెడ్డి, మానకొండూర్‌  ఇన్‌చార్జి గడ్డం నాగరాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమాకాంత్‌రావు, దరువు ఎల్లన్న, తంగళ్లపల్లి మండల అధ్యక్షుడు సురువు వెంకటి, ఇల్లంతకుంట అధ్యక్షుడు బెంద్రం తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.