న్యాయ పోరాటం చేస్తాం

ABN , First Publish Date - 2020-08-11T10:33:41+05:30 IST

పచ్చటి పంట పొలాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు చేయడం దారుణమని, దానిపై కాంగ్రెస్‌ పార్టీ న్యాయ పోరాటం చేస్తుందని మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు దామోదర రాజనర్సింహ అన్నారు.

న్యాయ పోరాటం చేస్తాం

ఫార్మాసిటీతో భూములు కోల్పోయిన వారిని ఎలా ఆదుకుంటారో ప్రభుత్వం చెప్పాలి 

మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ


యాచారం:  పచ్చటి పంట పొలాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు చేయడం దారుణమని, దానిపై కాంగ్రెస్‌ పార్టీ న్యాయ పోరాటం చేస్తుందని మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు దామోదర రాజనర్సింహ అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలో ఫార్మాసిటీ భూ బాధితులతో ఆయన సమావేశమయ్యారు. రెండు గంటల పాటు రైతుల సమస్యలను తెలుసుకున్నారు.


అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామాలకు కి.మీ. దూరంలో భూమి తీసుకుంటామని చెబుతున్న ప్రభుత్వం తాడిపర్తిలో ఇళ్ల మధ్యలోనే సర్వే చేయడంలో అర్థమేంటని ప్రశ్నించారు. భూములు కోల్పోయిన రైతులకు పూర్తిస్థాయిలో పరిహరం ఇవ్వలేదన్నారు. ఫార్మాసిటీతో భవిష్యత్తులో తాడిపర్తి అంథకారం కానుందన్నారు. రైతుకు నాలుగు ఎకరాల భూమి ఉంటే మూడెకరాలకు మాత్రమే పరిహారం ఇచ్చారని, ఇంతకంటే దౌర్జన్యం మరోటి లేదన్నారు. భూములు లేని నిరుపేదలను ప్రభుత్వం ఏవిధంగా ఆదుకుంటుందో తెలపాలన్నారు. ఫార్మాసిటీ ఏర్పాటుతో వందలాది మంది భూమి లేని నిరుపేదల బతుకులు బుగ్గిపాలవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.


ఫార్మాసిటీ ఏర్పాటుపై వారం రోజుల్లో ఉన్నత న్యాయస్థానంలో పిల్‌ వేయడంతో పాటు రిట్‌ పిటీషన్‌ దాఖలు చేస్తామని పేర్కొన్నారు.రైతులు తమకు జరిగిన అన్యాయం గురించి చెబుతుంటే ఎంతో బాధ కలిగిందన్నారు. పచ్చటి పంట పొలాల్లో విషతుల్యమైన ఫార్మాసిటీ ఏర్పాటుపై సీఎం కేసీఆర్‌ పునరాలోచించాలన్నారు. ఈ సమావేశంలో ఆలిండియా కిసాన్‌సెల్‌ చైర్మన్‌ అన్వే్‌షరెడ్డి, రాష్ట్ర కిసాన్‌ సెల్‌ చైర్మన్‌ ఎం.కోదండరెడ్డి, ప్రముఖ పర్యావరణవేత్తలు నర్సింహారెడ్డి, కవుల సరస్వతి, తాడిపర్తి సర్పంచ్‌ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-11T10:33:41+05:30 IST