షుగర్‌ ఫ్యాక్టరీల పూర్వవైభవానికి పోరాడతాం

ABN , First Publish Date - 2021-12-01T06:17:16+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా చక్కెర కర్మాగారాలకు పూర్వవైభవం తీసుకు వచ్చేందుకు పోరాడతామని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చెప్పారు.

షుగర్‌ ఫ్యాక్టరీల పూర్వవైభవానికి పోరాడతాం
సమావేశంలో మాట్లాడుతున్న లక్ష్మీనారాయణ

సీబీఐ మాజీ జేడీ లక్మీనారాయణ


కొత్తూరు, నవంబరు 30: రాష్ట్ర వ్యాప్తంగా చక్కెర కర్మాగారాలకు పూర్వవైభవం తీసుకు వచ్చేందుకు పోరాడతామని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చెప్పారు. తుమ్మపాల వీవీ రమణ చక్కెర కర్మాగార ప్రాంగణంలో మంగళవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్తరాంధ్రలోని ఏటికొప్పాక, తాండవ, తుమ్మపాల, భీమసింగి కర్మాగారాలు మూతపడడంతో రైతులు పండించిన చెరకు పంటను ఎక్కడికి తీసుకువెళ్లాలో తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. చక్కెర కర్మాగారాలు తెరిపించేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తానన్నారు. తుమ్మపాల షుగర్‌ ఫ్యాక్టరీని నడిపేందుకు ప్రస్తుత లెక్కల ప్రకారం రూ.63 కోట్లు అవసరమవుతుందన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి ఆ నిధులు మంజూరుకు కృషి చేస్తానన్నారు. గతంలో తాను ఫ్యాక్టరీలో నిరసన చేపట్టిన తరువాత టీడీపీ ప్రభుత్వం రూ.30 కోట్లు మంజూరు చేసిందన్నారు. అనంతరం వీవీ రమణ కోఆపరేటివ్‌ షుగర్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు పలు సమస్యలపై వినతిపత్రం అందించారు. సమావేశంలో లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ, బీజేఈ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట నగేశ్‌, ఫ్యాక్టరీ ఇన్‌చార్జి ఎండీ సన్యాసినాయుడు, ఎంపీటీసీ చదరం నాగేశ్వరరావు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-01T06:17:16+05:30 IST