డీజీపీ, ఏజీని తప్పించకుంటే తలెత్తుకోలేం: సిద్ధూ

ABN , First Publish Date - 2021-10-03T22:50:53+05:30 IST

పంజాబ్ పోలీస్ చీఫ్‌ను, అడ్వకేట్ జనరల్‌ను సొంత పార్టీ ప్రభుత్వం నుంచి ఉద్వాసన పలకాలని కాంగ్రెస్ నేత..

డీజీపీ, ఏజీని తప్పించకుంటే తలెత్తుకోలేం: సిద్ధూ

చండీగఢ్: పంజాబ్ పోలీస్ చీఫ్‌ను, అడ్వకేట్ జనరల్‌ను సొంత పార్టీ ప్రభుత్వం నుంచి ఉద్వాసన పలకాలని కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆదివారంనాడు మరోసారి డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో మనం తలెత్తుకోలేమని ఓ ట్వీట్‌లో స్పష్టం చేశారు. కీలకమైన నియామకాల విషయంలో తాను ఇప్పటికీ అసంతృప్తిగానే ఉన్నానని మరోసారి సిద్ధూ పరోక్షంగా ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి సంకేతాలిచ్చారు. మూడు రోజుల క్రితం సిద్ధూ, చన్నీ సమావేశమై రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాల విషయంలో ముందుగానే సంప్రదింపులు జరిపేందుకు సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో సిద్ధూ తాజా ట్వీట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.


''అపచారాలకు సంబంధించి కేసుల్లో న్యాయం జరగాలని, డ్రగ్ వ్యాపారం వెనుక వెనుక ప్రధాన వ్యక్తులను అరెస్టు చేయాలన్న డిమాండ్‌ను 2017లో ప్రభుత్వం దృష్టికి తెచ్చాం. ఆయన వైఫల్యం వల్లే గత సీఎంను ప్రజలను గద్దె దింపారు. ఇప్పుడు, ఏజీ/డీజీ నియామకాలతో బాధితుల గాయాలపై కారం చల్లారు. వాళ్లను తప్పించాల్సిందే. లేదంటూ తలెత్తుకోలేం'' అని సిద్ధూ ఆదివారంనాడు తన ట్వీట్‌లో ఘాటుగా స్పందించారు.

Updated Date - 2021-10-03T22:50:53+05:30 IST