ట్రాక్టర్ల కవాతు జరిపి తీరుతాం : బీకేయూ నేత రాకేశ్

ABN , First Publish Date - 2021-01-14T20:33:40+05:30 IST

వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేసి తీరాలని రైతు సంఘాలు పట్టుబడుతున్నాయి

ట్రాక్టర్ల కవాతు జరిపి తీరుతాం : బీకేయూ నేత రాకేశ్

న్యూఢిల్లీ : వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేసి తీరాలని రైతు సంఘాలు పట్టుబడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం దిగి రాకపోతే తాము గణతంత్ర దినోత్సవాలనాడు పెద్ద ఎత్తున ట్రాక్టర్ల ప్రదర్శన నిర్వహిస్తామని మరోసారి హెచ్చరించాయి. 2024 వరకు తమ ఆందోళనను కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేస్తున్నాయి. 


భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ గురువారం మాట్లాడుతూ, నూతన సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందన్నారు. తాము 2024 వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అదే సమయంలో శుక్రవారం కేంద్ర ప్రభుత్వంతో చర్చల్లో పాల్గొంటామని తెలిపారు. గణతంత్ర దినోత్సవాలు జనవరి 26న జరుగుతాయని, ఈ మూడు చట్టాలను రద్దు చేయకపోతే, తాము ట్రాక్టర్లతో భారీ కవాతును నిర్వహిస్తామని చెప్పారు. తమను ఉగ్రవాదులుగా ప్రభుత్వం ఎంత ఎక్కువగా అభివర్ణిస్తే, అంత ఎక్కువ బలంగా ఉద్యమం జరుగుతుందని హెచ్చరించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు సోమవారం వస్తే, అప్పుడు వాటి గురించి మాట్లాడదామన్నారు. రైతులకు మద్దతివ్వాలని కోరుతూ తాము మహారాష్ట్ర వెళ్ళామని, ఆ తర్వాత ఒడిశా, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్తామని తెలిపారు. రాష్ట్రాల గవర్నర్ల కార్యాలయాల వద్ద జనవరి 23న నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. 


ఇదిలావుండగా, వివాదాస్పద సాగు చట్టాల అమలును సుప్రీంకోర్టు నిలిపేసిన సంగతి తెలిసిందే. రైతుల వాదనను వినేందుకు, ఈ సమస్యను పరిష్కరించేందుకు నలుగురు సభ్యులతో ఓ కమిటీని సుప్రీంకోర్టు నియమించింది. అయితే ఈ కమిటీలోని సభ్యులు ప్రభుత్వానికి అనుకూలురని రైతులు ఆరోపిస్తున్నారు. 


Updated Date - 2021-01-14T20:33:40+05:30 IST