Abn logo
May 20 2020 @ 04:40AM

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అవినీతిని నిరూపిస్తాం

ప్రభుత్వ పెద్దల అండతోనే ఇసుక దోపిడీ జరుగుతోంది

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌


కరీంనగర్‌ అర్బన్‌, మే 19: ఉమ్మడి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అధికారులు మిల్లర్లతో కుమ్మక్కై అవినీతికి పాల్పడుతున్న వైనాన్ని తాము నిరూపించేందుకు సిద్ధమని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఈ మేరకు మంగళవారం డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు అన్యాయం జరుగుతోందని అన్నారు. తూకం, తరుగు పేరిట జరుగుతున్న అవినీతిని నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించినప్పటికీ ఆశాఖమంత్రి మౌనంగా ఉన్నార న్నారు. ఉమ్మడి జిల్లాలో ఇసుక దోపిడిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, డీజీపీలకు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ నాయకులందరి సంతకాలతో కూడిన లేఖను ఫ్యాక్స్‌, మెయిల్‌ చేశామని తెలిపారు. ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణను స్థానికంగా ఉన్న నలుగురు మంత్రులు ప్రోత్సహిస్తున్నారని పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు.


ఇసుక మాఫియాలో కొందరు ప్రభుత్వ పెద్దల బంధువులు స్వయంగా భాగస్వాములుగా ఉన్నారన్నారు. అక్రమ రవాణాను నియంత్రించేందుకు ఇసుక రీచ్‌ల గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, స్థానిక ప్రజలు ఇసుక రవాణాను పరిశీలించేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ఇసుక స్థానిక అవసరాలకు ఉపయోగించాలని, కానీ కొన్ని ప్రాంతాల్లో కోర్టు స్టే ఉన్నప్పటికీ ఇసుకను భారీ ఎత్తున హైదరాబాద్‌కు తరలిస్తున్నారని ఆరోపించారు.


వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆది శ్రీనివాస్‌ మాటట్లాడుతూ అక్రమ ఇసుకదందాపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే మాపైననే కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు. రాత్రికి రాత్రి పట్టుకున్న ఇసుకను మాయం చేస్తున్నారని అన్నారు. సమావేశంలో నాయకులు బొమ్మ శ్రీరాంచక్రవర్తి, కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, దాసరి భూమయ్య, నాగుల సత్యనారాయణగౌడ్‌, కూస రవీందర్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement