అవినీతిని సాక్ష్యాధారాలతో నిరూపిస్తాం

ABN , First Publish Date - 2021-06-23T08:58:06+05:30 IST

‘జగన్‌ రెడ్డి ఫేక్‌ ముఖ్యమంత్రి. నిత్యం అబద్ధాలతో ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు. ప్రకటనలకు మాత్రం వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు

అవినీతిని సాక్ష్యాధారాలతో నిరూపిస్తాం

జగన్‌ది బాధ్యత లేని, సమర్థత లేని అబద్ధాల పాలన

ప్రజా సమస్యలపై టీడీపీ పోరాటం

29న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు: చంద్రబాబు

పార్టీ నేతలతో సమావేశం


అమరావతి, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): ‘జగన్‌ రెడ్డి ఫేక్‌ ముఖ్యమంత్రి. నిత్యం అబద్ధాలతో ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు. ప్రకటనలకు మాత్రం వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. సంక్షేమం పేరుతో పేదల్ని మోసం చేస్తున్నారు. ఇచ్చింది గోరంత, దోచింది కొండంత. జగన్‌ రెడ్డి అవినీతిని సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తాం. సంక్షేమం విషయంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి. వీటిని ప్రజల్లో ఎండగడతాం’ అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు హెచ్చరించారు. రాష్ట్రంలో హోల్‌సేల్‌ అవినీతి జరుగుతోందని, మట్టి, ఇసుక, మద్యం, మైనింగ్‌ మాఫియాలతో రెచ్చిపోతున్నారని ధ్వజమెత్తారు. రెండేళ్లలోనే  ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, జగన్‌రెడ్డి అవినీతిపై క్షేత్రస్థాయిలో, ప్రభుత్వ వైఫల్యాలపై పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, తప్పులను ఎండగట్టేందుకు భవిష్యత్‌ కార్యాచరణపై టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిలు, ముఖ్యనేతలతో మంగళవారం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలు వాయిదా వేయాలని కోరితే మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు. జగన్‌రెడ్డిది ఉన్మాదమనాలా? మూర్ఖత్వం అనాలా? గ్రూప్‌-1 ఉద్యోగాల్లో అవకతవకలు జరిగాయి. ఇప్పుడిచ్చిన జాబ్‌ క్యాలెండర్‌పై నిరుద్యోగుల్లో తీవ్ర ఆందోళన ఉంది. అది జాబ్‌ క్యాలెండర్‌ కాదు.. జాబ్‌ లెస్‌ క్యాలెండర్‌. ఉద్యోగ, ఉపాధి కల్పనలో రాష్ట్రం పరిస్థితి దయనీయంగా మారింది. యువతకు ఉద్యోగం, ఉపాధి చూపే విధానాలను అమలు చేసే సమర్థత ఈ ప్రభుత్వానికి లేదు. బాధ్యత, సమర్థత లేని అబద్ధాల పరిపాలనలో యువత భవిత ప్రమాదంలో పడింది. రాష్ట్రవ్యాప్తంగా తెలుగు యువత, విద్యార్థి విభాగాలు జగన్‌రెడ్డి వైఫల్యాలను నిలదీస్తున్నాయి. సంక్షేమ కార్యక్రమాలు బోగ్‌సలా మారాయి. తాడేపల్లిలో యువతి అత్యాచారానికి గురైందంటే పరిస్థితి తీవ్రత అర్ధమౌతోంది. శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఇరిగేషన్‌, ప్రత్యేక హోదా అటకెక్కాయి. పన్నులు విపరీతంగా పెంచారు. 


ప్రజల్లో వీటిపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఏపీలో కరోనా మరణాలు ప్రభుత్వ లెక్కల కంటే 14ు ఎక్కువగా ఉన్నాయని ఐఐఎం ప్రొఫెసర్‌ విశ్లేషించారు. పల్లా శ్రీనివాస్‌, మాన్సాస్‌ ట్రస్ట్‌ విషయంలో ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. మాన్సాస్‌, సింహాచలం ఆలయ ట్రస్ట్‌ చైర్మన్‌ నియామకం విషయంలో హైకోర్టు తీర్పు జగన్‌కు చెంపపెట్టు. కర్నూలులో ఫ్యాక్షన్‌ హత్యలకు పాల్పడుతున్నారు.  రైతులు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. పంటలకు గిట్టుబాటు ధర దక్కడం లేదు.బకాయిల చెల్లింపులో నిర్లక్ష్యం. టీడీపీ హయాంలో రెండ్రోజుల్లో చెల్లింపులు చేశాం. మిల్లర్లు మోసం చేయకుండా చూశాం. కానీ నేడు దళారులు, మిల్లర్లు కలిసి దోచుకుంటున్నారు. ఎక్కడ చూసినా అరాచకాలే. ఇళ్ల నిర్మాణం, భూముల కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. కార్పొరేషన్ల పేరుతో హడావుడి చేస్తున్నారు. బీసీ జనార్ధనరెడ్డిపై కక్షసాధింపుతో అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. ప్రశ్నించిన వారిని, టీడీపీలో యాక్టివ్‌గా ఉన్న వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీనిపై భవిష్యత్‌లో గుణపాఠం తప్పదు. జగన్‌రెడ్డి తప్పుడు విధానాలను ప్రజల్లో ఎండగట్టాలి. 


29న 175 నియోజకవర్గాల్లో ఆందోళన

ప్రజాసమస్యలపై టీడీపీ పోరాడుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. 29న 175 నియోజకవర్గాల్లో ఆందోళనలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ‘కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్‌లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. వారం రోజులు టీకాలు వేయకుండా, ఒక్కరోజు వేసి, మమ అనిపించారు. ప్రచారం మాత్రం గొప్పగా చేసుకుంటున్నార ు. రాష్ట్ర ఆదాయం పడిపోయింది. ప్రజలను మభ్య పెట్టడానికి రోజుకో ప్రకటన జారీ చేస్తున్నారు. ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్నారు. బనకచర్లకు గోదావరి నీరు వచ్చి ఉంటే, నీటి సమస్యలు తీరేవి. పట్టిసీమను విమర్శించిన జగన్‌ ఇప్పుడు గోదావరిలో లిఫ్ట్‌ ఎందుకు పెడుతున్నారు? ఆర్డీఎ్‌సను నిర్లక్ష్యం చేశారు. జగన్‌రెడ్డి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టులో అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. చేయూత పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలను మోసం చేశారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని మోసం చేశారు. పింఛన్‌ రూ.3వేలు చేస్తానని మాటతప్పారు. సబ్‌ప్లాన్‌ నిధులు రూపాయి ఖర్చు పెట్టలేదు. జగన్‌ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది‘ అని చంద్రబాబు చెప్పారు. టీడీపీ నేతలు బుచ్చయ్యచౌదరి, కాల్వ శ్రీనివాసులు, రామానాయుడు, జ్యోతుల నెహ్రూ, జీవీ ఆంజనేయులు, అబ్దుల్‌ అజీజ్‌ తదితరులు మాట్లాడారు.

Updated Date - 2021-06-23T08:58:06+05:30 IST