Abn logo
Sep 28 2021 @ 04:07AM

కేటీఆర్‌ను జైల్లో వేయిస్తాం

  • ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలకు ఆయనే కారణం
  • ధాన్యం కొనుగోళ్లలో కేసీఆర్‌ బ్రోకర్‌ మాత్రమే: బండి సంజయ్‌ 

సిరిసిల్ల, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే ఇంటర్మీడియెట్‌ విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన మంత్రి కేటీఆర్‌ను జైలులో వేయిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. నాడు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, కేటీఆర్‌ బినామీ సంస్థ తప్పిదంతో 27 మంది ఇంటర్‌ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. సోమవారం బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో కొనసాగింది. ఈ  సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విషయంలో సీఎం కేసీఆర్‌కు సంబంధం లేదన్నారు.  వరి ధాన్యాన్ని కేంద్రమే డబ్బులు చెల్లించి కొనుగోలు చేస్తోందని, ఇందులో కేసీఆర్‌ బ్రోకర్‌ పాత్ర పోషిస్తారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రైతులు పండిచే ధాన్యాన్ని కేంద్రంతో కొనుగోలు చేయించే పూర్తి బాధ్యత తాను తీసుకుంటానని ప్రకటించారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఉన్నందునే దళిత బంధు పథకాన్ని తెచ్చారని ఆరోపించారు. దళితుల సాధికారత కోసం కేంద్రం ఏనాడో స్టార్టప్‌ ఇండియా పేరుతో గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టిందని చెప్పారు.  రాష్ట్రంలో ఏనాడూ బీజేపీ.. టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోలేదని, కొందరు కాంగ్రెస్‌ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మరోవైపు.. దళితుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటే  దళితబంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని బండి సంజయ్‌ డిమాండ్‌ చే స్తూ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. దళితులు, గిరిజనులకు భూ పంపిణీ ఏమైందని ప్రశ్నించారు.