పొరపాట్లు సరిచేస్తాం..!

ABN , First Publish Date - 2021-06-19T07:19:03+05:30 IST

దక్షిణ సింహచలంగా ప్రసిద్థి గాంచిన శ్రీ వరహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చెంత టీటీడీ తరఫున నిర్మించనున్న కల్యాణ మండపం కోసం వైసీపీ నేతలు చేసిన వసూలుపై ఆ పార్టీ నియోజకవర్గం ఇన్‌చార్జ్‌ మాదాసి వెంకయ్య స్పందించారు.

పొరపాట్లు సరిచేస్తాం..!
మాట్లాడుతున్న మాదాసి వెంకయ్య

సింగరాయకొండ, జూన్‌ 18 : దక్షిణ సింహచలంగా ప్రసిద్థి గాంచిన శ్రీ వరహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చెంత టీటీడీ తరఫున నిర్మించనున్న కల్యాణ మండపం కోసం వైసీపీ నేతలు చేసిన వసూలుపై  ఆ పార్టీ నియోజకవర్గం ఇన్‌చార్జ్‌ మాదాసి వెంకయ్య స్పందించారు. కల్యాణ మండపం కోసం ఎవరూ విరాళాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. జరిగిన పొరపాటును సరిచేస్తామన్నారు. 

కల్యాణ మండప నిర్మాణం పేరిట వైసీపీ నాయకులు సేకరిస్తున్న విరాళాలపై శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘కల్యాణ మండపం పేరిట వసూలు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో శుక్రవారం స్థానిక వైసీపీ కార్యాలయంలో ఆ పార్టీ నియోజకవర్గం ఇన్‌చార్జ్‌ విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ  వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో టీటీడీ కల్యాణ మండపం నిర్మాణం ఆవశ్యకతను టీటీడీ దేవస్థాన చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దృష్టి తీసుకెళ్లామన్నారు. దీనికి ఆయన స్పందిస్తూ దాతల సహకారంతో అవసరమైన కర్పాస్‌ ఫండ్‌ను సేకరించి టీటీడీకి జమచేస్తే కల్యాణ మండపానికి నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారన్నారు. దీంతో   దాతల నుంచి విరాళాలు ఆహ్వానించామన్నారు. కల్యాణ మండప నిర్మాణం కోసం వైసీపీ నాయకులు సేకరించిన విరాళాలను ఆయన వివరించారు. ఐదుగురు దాతలను అడగ్గా నలుగురు దాతల  నుంచి రూ.40 లక్షలు సేకరించినట్లు తెలిపారు. ఆ నిధులు టీటీడీకి జమచేస్తామన్నారు. వైసీపీ తరఫున దాతలను ఇంకెవరిని విరాళాలు అడగమని, ఎవరు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఇతర వ్యక్తులు చేసిన వసూలుకు తమ పార్టీకి సంబంధం లేదని వెంకయ్య పేర్కొన్నారు. వేగంగా నిర్మాణం చేపట్టాలున్న ఉద్దేశంతో ఆ నలుగురి సహకారం తీసుకున్నామన్నారు. ఆయన ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షులు డాక్టర్‌ ఆశోక్‌కుమార్‌రెడ్డి కూడా ఉన్నారు.

ఈ తురుణంలో పలువురు విలేకర్లు మండలంలో ఇతర వ్యక్తులను విరాళాలకోసం వైసీపీ నాయకులు ఫోన్‌ చేయడంపై ప్రశ్నించారు. ఈ తరణంలో  వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నాబత్తిన వెంకటేశ్వరరావు కలుగజేసుకోని ఆ నాలుగురు దాతలనుండి కాకుండా పాత సింగరాయకొండకు చెందిన వైసీపీ నాయకుడుని రూ.5లక్షలు అడిగినట్లు తెలిపారు. దీంతో  ఆ నాయకుడు తనతో పాటు మండలంలో చాలా మంది టీడీపీ నాయకులను కూడా విరాళాలు అడిగినట్లు తెలిపారు. దీంతోనే ఈ ప్రచారం వచ్చిందన్నారు. దీంతో నేతల వసూళ్లును గమనించిన వెంకయ్య, అశోక్‌రెడ్డీలు సమస్యను సరిచేస్తామని చెప్పారు. మండప నిర్మాణం ఆమోదం కోసం తిరుపతి వెళుతున్నట్లు తెలిపారు. అయితే అనధికారికంగా ఇష్టానుసారం వైసీపీ నేతలు వసూళ్లపై మండల వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ముఖ్యనాయుకుడి అనుచరుడిపై 

మరో వైసీపీ నాయకుడు ఫైర్‌

స్థానిక వైసీపీ పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించే ముందు మండల ముఖ్య నాయుకుడి అనుచరుడిపై వైసీపీ సీనియర్‌ నాయకుడు శ్రీ వరహ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం మాజీ చైర్మన్‌  ఫైర్‌ అయ్యారు. పార్టీ కార్యక్రమాలను పార్టీలో కష్టపడిన వారిని పిలవడం లేదని పాత్రికేయుల ముందే ఆగ్రహన్ని వ్యక్తం చేశారు. పార్టీలో మిగితా వ్యక్తుల లాగా తాము మాఫియాలకు పాల్పడంలేదని ఊగిపోయాడు. దీంతో ఒక్కసారిగా వైసీపీలో ఉన్న వర్గ విభేదాలు భగ్గుమన్నాయి.

Updated Date - 2021-06-19T07:19:03+05:30 IST