జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం: కేటీఆర్‌

ABN , First Publish Date - 2021-03-03T23:06:21+05:30 IST

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తామని కేటీఆర్‌ అన్నారు. జర్నలిస్ట్‌ల సమస్యలపై

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం: కేటీఆర్‌

హైదరాబాద్: జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తామని కేటీఆర్‌ అన్నారు. జర్నలిస్ట్‌ల సమస్యలపై మంత్రి కేటీఆర్‌తో ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సమావేశమయ్యారు. పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు జర్నలిస్టుల సమస్యలను నారాయణ వివరించారు. ప్రెస్ అకాడమీ‌కి ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల చెల్లింపులు, చిన్న పత్రికల గ్రేడింగ్‌తో పాటు అనేక సమస్యలను మంత్రికి ఆయన వివరించారు. అలాగే జిల్లా కేంద్రాల్లో, గ్రామీణ ప్రాంతాల్లోని జర్నలిస్ట్‌లకు ఇల్లు లేదా ఇళ్ల స్థలాలు ఇవ్వడం, హైద్రాబాద్‌లోని జర్నలిస్ట్‌లకు ఇల్లు కల్పించడం, జవహర్‌లాల్ నెహ్రూ సొసైటీ’కి పేట్ బషీరాబాద్‌లోని స్థలాన్ని కేటాయించాలని కోరారు.




 చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబాలకు 7న ఇచ్చే సహాయనిధి పంపిణీ కార్యక్రమానికి హాజరవుతానని కేటీఆర్‌ తెలిపారు. అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ జర్నలిస్ట్‌ల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. దేశంలో ఎక్కడాలే విధంగా ఏ ప్రెస్ అకాడెమీ కూడా పనిచేయని విధంగా తెలంగాణ మీడియా అకాడమీ పనిచేస్తుందని ఆయన ప్రశంసించారు. కరోనా సోకిన జర్నలిస్ట్‌లకు ఒక్కొక్కరికి రూ. 20,000లను అందజేయడంపై నారాయణను కేటీఆర్‌ అభినందించారు. ప్రభుత్వం సహకారంతో అనేక రకాలుగా జర్నలిస్ట్‌లకు ప్రెస్ అకాడెమీ సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన అన్నారు. మిగిలిన సమస్యలను కూడా కొలిక్కి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తానని  కేటీఆర్‌ హామీ ఇచ్చారు. జర్నలిస్ట్‌ల ఇళ్ల సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి కూడా సుముఖంగా ఉన్నారని కేటీఆర్‌  తెలిపారు. 


 ఈ సమావేశంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, బాల్క సుమన్, టీయూడబ్ల్యూజె  ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్, TEMJU అధ్యక్ష కార్యదర్శులు ఇస్మాయిల్, రమణ, హైద్రాబాద్ యూనిట్ అధ్యక్షుడు యోగనందం, ఫోటో జర్నలిస్ట్ అధ్యక్షుడు భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.  


Updated Date - 2021-03-03T23:06:21+05:30 IST