మీ సమస్యకు పరిష్కారం చూపుతాం

ABN , First Publish Date - 2020-07-07T10:25:23+05:30 IST

కరోనా కారణంగా గతంలో ప్రతీ సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం ఆగిపోయింది.

మీ సమస్యకు పరిష్కారం చూపుతాం

ఖమ్మం కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌

‘వీడియో ప్రజావాణి’ ద్వారా ఫిర్యాదుల స్వీకరణ


ఖమ్మం కలెక్టరేట్‌, జూలై 6: కరోనా కారణంగా గతంలో ప్రతీ సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం ఆగిపోయింది. ఈ క్రమంలో మూడు నెలల తర్వాత కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ ఆన్‌లైన్‌ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. నేరుగా కాకుండా కలెక్టరేట్‌లోని పరిష్కృతి విభాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక చాంబర్‌లో ఫిర్యాదు దారులను ఉంచి.. గూగుల్‌మీట్‌  ద్వారా ఆన్‌లైన్‌లో వీడియో ద్వారా సమస్యలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన వారితో ఆయన సోమవారం వీడియో ద్వారా మాట్లాడి.. సమస్యలకు తక్షణమే పరిష్కారాన్ని చూపుతామని హామీ ఇచ్చారు. తొలుత కలెక్టరేట్‌ సిబ్బంది ఫిర్యాదు దారులకు థర్మల్‌ స్ర్కీనింగ్‌, కరోనా నియంత్రణ చర్యలు చేసిన అనంతరం భౌతికదూరాన్ని పాటించేలా ఏర్పాట్లు చేశారు. ఈ వీడియో ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టరేట్‌ ఏవో మదన్‌గోపాల్‌ పాల్గొన్నారు. 


ఫిర్యాదుల్లో కొన్ని..

ఎర్రుపాలెం గ్రామంలో పెట్రోల్‌బంకు ఎదురుగా మెయిన్‌రోడ్డుపై వైన్‌షాపును అక్కడి నుంచి మార్చాలని, ఏపీ సరిహద్దు కావడంతో వందల మంది వస్తున్నారని దీంతో స్థానికంగా ఇబ్బందులు పడుతున్నారని సర్పంచ్‌ ఎం.అప్పారావు, ఎంపీపీ డి.శిరీష, జడ్పీటీసీ సభ్యురాలు శీలం వనిత తదితరులు ఫిర్యాదు చేశారు. ముదిగొండ మండలం పండ్రేగుపల్లిలో సర్వెనెంబర్‌ 125/7లో ఎకరం 10గుంటల భూమిని 15ఏళ్లుగా తాము సాగు చేసుకుంటున్నామని దీనికి పట్టాదారు పాస్‌ బుక్‌ కోసం దరఖాస్తు చేసినా పాస్‌ పుస్తకాన్ని ఇవ్వకుండా తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారంటూ ఎస్కే డౌలత్‌ అనే మహిళ ఫిర్యాదు చేసింది.


రఘునాథపాలెంలోని ఎస్టీ కాలనీలో ఇళ్లపై నుంచి హెవీ విద్యుత్‌ తీగలు వేశారని దీని మూలంగా తమ ప్రాణాలకు ముప్పు ఉందని, వాటిని తక్షణమే తొలగించేలా ఆదేశాలివ్వాలని ఎల్‌హెచ్‌పీఎస్‌ నాయకుడు భద్రూనాయక్‌ విన్నవించారు. నగరంలోని వెలుగుమట్ల  వినోభా నవోదయ కాలనీలో తాగునీరు, విద్యుత్‌ సౌకర్యాన్ని కల్పించాలని ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని, దీంతో హైకోర్టుకు వెళ్లగా ఆ కాలనీకి అన్ని సౌకర్యాలు కల్పించాలంటూ ఉత్వర్వులు జారీ చేసిందని, ఆ ఉత్తర్వులను అమలు చేయాలని గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి పోలెబోయిన ముత్తయ్య కలెక్టర్‌కు విన్నవించారు. 

Updated Date - 2020-07-07T10:25:23+05:30 IST