ప్రజాసంక్షేమానికి ఎంతైనా ఖర్చు చేస్తాం

ABN , First Publish Date - 2021-05-17T05:39:14+05:30 IST

రాష్ట్ర ప్రజల సంక్షేమానికి ఎంత ఖర్చు చేయడానికైనా వెనకాడబోమని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ పేర్కొన్నారు.

ప్రజాసంక్షేమానికి ఎంతైనా ఖర్చు చేస్తాం
శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి, కలెక్టర్‌, ఎమ్మెల్యే తదితరులు

కరోనా విపత్తులోనూ జిల్లాలో 4 వేల ప్రభుత్వ 

భవనాల నిర్మాణం: మంత్రి శంకరనారాయణ

ఎ. నారాయణపురంలో సచివాలయాలు, 

ఆర్‌బీకే కేంద్రం ప్రారంభం


అనంతపురంరూరల్‌, మే16: రాష్ట్ర ప్రజల సంక్షేమానికి ఎంత ఖర్చు చేయడానికైనా వెనకాడబోమని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని ఎ.నారాయణపురం పంచాయతీలో రెండు సచివాలయాలు, రైతు భరోసా నూతన భవనాల ప్రారంభోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి శంకర నారాయణ, జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి హాజరై, ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్నా సంక్షేమ కార్యక్రమాలు ఆగడం లేదన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమానికి కట్టుబడి పని చేస్తున్నామన్నారు. సీఎంగా జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు తీసుకుని రెండేళ్లువుతోందన్నారు. ప్రజలకు అవసరమైన పాలనను అందిస్తున్నామన్నారు. రాష్ట్రం అప్పులపాలైందనీ, అభివృద్ధి లేదని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించడం హాస్యాస్పదమన్నారు. నిత్యం జగన్‌పై బుదర జల్లడానికే చంద్రబాబు అండ్‌కో ప్రయత్నిస్తున్నారన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 4 వేలకుపైగా ప్రభుత్వ భవనాల నిర్మాణాలు కొనసాగుతున్నాయన్నారు. రెండేళ్లుగా విద్య, వైద్య రంగాలతోపాటు ఇతర అభివృద్ధి పనులు జోరుగా కొనసాగుతున్నాయన్నారు. పౌరసేవలన్నీ సచివాలయాల్లోనే అందుబాటులోకి వ చ్చాయన్నారు. ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. జిల్లా కేంద్రానికి దీటుగా నియోజకవర్గ పరిధిలోని నాలుగు పంచాయతీలను అభివృద్ధి చేస్తామన్నారు. ఎ.నారాయణపురం పంచాయతీలోనే రూ.18.85 కోట్లతో అభివృద్ధి సనులు చేపట్టామన్నారు. కార్యక్రమంలో జేడీఏ రామకృష్ణ, డీపీఓ పార్వతి, ఎంపీడీఓ భాస్కర్‌రెడ్డి, ఏఓ వెంకటేశ్వర ప్రసాద్‌, ఏఈఓ ప్రసాద్‌, పంచాయతీ కార్యదర్శి నరసింహారెడ్డి, వైసీపీ నాయకులు ఉమ్మడి మదన్‌మోహన్‌రెడ్డి, నాగేంద్ర, వేణుగోపాల్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-05-17T05:39:14+05:30 IST