సాగుకు అండగా ఉంటాం: సీఎం కేసీఆర్‌

ABN , First Publish Date - 2022-01-15T09:49:57+05:30 IST

దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా తెలంగాణలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలలో పండుగ వాతావరణం నెలకొందని, సాగుకు ఎప్పటిలానే అండగా ఉంటామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.

సాగుకు అండగా ఉంటాం: సీఎం కేసీఆర్‌

ప్రజలకు, రైతులకు ముఖ్యమంత్రి, గవర్నర్‌ సంక్రాంతి శుభాకాంక్షలు

హైదరాబాద్‌, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా తెలంగాణలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలలో పండుగ వాతావరణం నెలకొందని, సాగుకు ఎప్పటిలానే అండగా ఉంటామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. రాష్ట్ర ప్రజలు, రైతాంగానికి సీఎం మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మకరరాశిలోకి సూర్యుడి ప్రవేశంతో ప్రారంభమయ్యే ఉత్తరాయణం పుణ్యకాలమని, ప్రజలు సిరిసంపదలతో, భోగ భాగ్యాలతో తులతూగాలని సీఎం ఆకాంక్షించారు. రాష్ట్రంలో సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేసుకోగలిగామని, పంటపెట్టుబడి సాయం, పలు రైతు సంక్షేమ పథకాలు, పటిష్ఠ చర్యలతో ప్రభుత్వం వ్యవసాయ రంగంలో నిత్య సంక్రాంతి నెలకొల్పిందని సీఎం పేర్కొన్నారు. రైతుల జీవితాల్లో నిత్య సంక్రాంతులను కొనసాగించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.


ప్రజలంతా కరోనా నిబంధనలు పాటిస్తూ, సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకోవాలని సీఎం కోరారు. అలాగే రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. ప్రజలందరికీ సంక్రాంతి సంతోషం, ఆరోగ్యం తీసుకురావాలని తమిళిసై ఆకాంక్షించారు. సంక్రాంతి పండగకు సంస్కృతిపరంగా ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. అన్ని సామాజికవర్గాల్ని సంక్రాంతి వేడుకలు దగ్గర చేస్తాయని, ప్రజలందరూ కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ సంతోషంగా పండగ జరుపుకోవాలని గవర్నర్‌ సూచించారు.


కిషన్‌, సంజయ్‌ శుభాకాంక్షలు

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు ప్రజలకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు సంతోషంగా పండుగ జరుపుకోవాలని, సంక్రాంతి అష్ట్యైశ్వర్యాలు, సుఖ సంతోషాలు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.

Updated Date - 2022-01-15T09:49:57+05:30 IST