ఫ్యాకల్టీ సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తాం

ABN , First Publish Date - 2021-09-18T05:09:26+05:30 IST

నర్సాపూర్‌ పీజీ కాలేజీలో ప్యాకల్టీ సమస్య పరిష్కరించడానికి ప్రయత్నిస్తామని ఉస్మానియా యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ డి.రవీందర్‌ పేర్కొన్నారు.

ఫ్యాకల్టీ సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తాం
నర్సాపూర్‌ పీజీ కాలేజీని ఎత్తేయొద్దంటూ వీసీ రవీందర్‌కు వినతిపత్రాన్ని అందజేస్తున్న మున్సిపల్‌ చైర్మన్‌

 నర్సాపూర్‌ పీజీ కాలేజీని సందర్శించిన ఉస్మానియా వైస్‌ ఛాన్స్‌లర్‌  

నర్సాపూర్‌, సెప్టెంబరు 17: నర్సాపూర్‌ పీజీ కాలేజీలో ప్యాకల్టీ సమస్య పరిష్కరించడానికి ప్రయత్నిస్తామని ఉస్మానియా యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ డి.రవీందర్‌ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం నర్సాపూర్‌లోని ప్రభుత్వ పీజీ కాలేజీని ఆయన సందర్శించి కాలేజీలో ఉన్న సదుపాయాలు, ఫ్యాకల్టీతో పాటు ఇతర సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైస్‌ఛాన్స్‌లర్‌ విలేకరులతో మాట్లాడుతూ.. ఇటీవల తాను బాధ్యతలు తీసుకున్నందున ఉస్మానియా పరిధిలోని పీజీ కాలేజీలను ప్రత్యక్షంగా చూసి అక్కడి పరిస్థితులు తెలుసుకోవడానికి పర్యటిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే గురువారం సిద్దిపేటతో పాటు నర్సాపూర్‌ పీజీ కాలేజీని సందర్శించినట్లు చెప్పారు. ఉస్మానియాలో ఉన్న మెదక్‌ జిల్లాను తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోకి మార్చే ప్రయత్నంపై విలేకరులు ప్రశ్నించగా అది ప్రభుత్వ పరమైన నిర్ణయమని తమ పరిఽధిలో లేదన్నారు. ముఖ్యంగా నర్సాపూర్‌ కాలేజీలో రెగ్యులర్‌ ఫ్యాకల్టీ లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించినట్లు వివరించారు. విద్యార్థులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా తక్షణ చర్యలపై త్వరలో నిర్ణయించి రిటైర్డు అయినవారితో పాటు తాత్కాలిక పద్ధతిపై నియమకాలు చేయడానికి ప్రయత్నిస్తామన్నారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా త్వరలో రెగ్యులర్‌ ఫ్యాకల్టీని నియమించడానికి ఆలోచిస్తున్నట్టు చెప్పారు.  ఇక పీజీ కాలేజీ నర్సాపూర్‌ నుంచి ఎత్తేసే ప్రయత్నం తమ దృష్టిలో ప్రస్తుతానికి లేదన్నారు. ఆయన వెంట ఓఎ్‌సడీ రెడ్యానాయక్‌, డైరెక్టర్‌ శ్యామల, మున్సిపల్‌ కమిషనర్‌ అశ్రిత్‌ తదితరులు ఉన్నారు. 


పీజీ కళాశాలను ఎత్తేయొద్దంటూ వినతి

నర్సాపూర్‌లో పీజీ కాలేజీ కోసం స్థలం చూపడంలో జాప్యం జరుగుతున్నందున కాలేజీ ఎత్తేసే ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు  ప్రచారం జరుగుతున్నది. ఈ మేరకు స్థానిక మున్సిపల్‌ ఛైర్మన్‌ మురళీధర్‌యాదవ్‌ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు పలువురు వైస్‌ ఛాన్స్‌లర్‌  రవీందర్‌కు కాలేజీని ఎత్తేసే ప్రయత్నం చేయొద్దంటూ వినతిపత్రాన్ని అందజేశారు. కాలేజీకి అవసరమైన 10 ఎకరాల స్థలాన్ని దాతల సహకారంతో కొనుగోలు చేసి ఇవ్వడంతో పాటు కాలేజీ నిర్మాణానికి రూ. కోటి విరాళం కూడా ఇస్తామన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ వెంట కౌన్సిలర్లు యాదగిరి, రామచందర్‌, నాయకులు రమే్‌షయాదవ్‌, అంజనేయులుగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. వైస్‌ఛాన్స్‌లర్‌ అయిన తర్వాత మొదటిసారి నర్సాపూర్‌ వచ్చిన సందర్భంగా మున్సిపల్‌ చైర్మన్‌ ఆధ్వర్యంలో రవీందర్‌ను శాలువాతో సత్కరించారు.   

Updated Date - 2021-09-18T05:09:26+05:30 IST