Abn logo
Jan 27 2021 @ 00:19AM

ప్రతీ ఒక్కరికి టీకా వేస్తాం

సంగారెడ్డి కలెక్టరేట్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేస్తున్న జిల్లా కలెక్టర్‌ హన్మంతరావు

 డంపింగ్‌ యార్డులు, వైకుంఠధామాల  నిర్మాణంలో అగ్రగామిగా జిల్లా

 మార్కెట్‌ కమిటీల అభివృద్ధికి  రూ.25.78 కోట్లు

 గణతంత్ర వేడుకల్లో కలెక్టర్‌ హన్మంతరావు


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, జనవరి 26: కరోనా వ్యాక్సిన్‌ రావడంతో ప్రజల జీవితాల్లో వెలుగులు వచ్చాయని,  భయాన్ని వీడి స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నారని కలెక్టర్‌ హన్మంతరావు అన్నారు. 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి పోలీస్‌ పరేడ్‌ మైదానంలో మంగళవారం జాతీయ పతాకాన్ని ఎగురవేసి, పోలీసుల వందనాన్ని స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.  తొమ్మిది నెలల నుంచి యావత్‌ ప్రపంచంలో కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థను మందగమనంలో పడేసిందని, ఎంతో మందికి ఉపాధి లేకుండా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే ప్రజలు కోలుకుంటున్నారని చెప్పారు. కాగా కరోనా బాధితులకు అహర్నిశలు సేవలందించిన వైద్యాధికారులకు, సిబ్బందికి కలెక్టర్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 16న వ్యాక్సినేషన్‌ ప్రారంభంకాగా ఇప్పటి వరకు జిల్లాలో 10,314 మంది వైద్య సిబ్బందికి టీకా వేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరలోనే జిల్లాలోని ప్రతీ పౌరుడికి టీకా వేస్తామని కలెక్టర్‌ చెప్పారు. 


అటవీ శాఖ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు


 విధి నిర్వహణలో భాగంగా విశిష్ట సేవలందించిన అటవీ శాఖలోని ఐదుగురు అధికారులను ప్రశంసాపత్రాలతో పాటు రూ.10వేల నగదును అందజేశారు. ప్రశంసాపత్రాలు అందుకున్న వారిలో డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌ వి.రవికుమార్‌, అటవీ శాఖ సెక్షన్‌ అధికారి ఎస్‌.మంజీత్‌సింగ్‌, బీట్‌ అధికారులు కె.రమేశ్‌, ఖాజాఫారూక్‌ అలీ, జె.ఇల్లయ్య ఉన్నారు. కాగా కరోనా కాలంలో ఉత్తమ సేవలందించినందుకు డాక్టర్‌ కాంతకు జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ మంగళవారం ప్రశంసాపత్రాన్ని అందజేశారు.


కలెక్టరేట్‌లో


సంగారెడ్డి రూరల్‌: గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కలెక్టరేట్‌లో జాతీయ పతాకాన్ని కలెక్టర్‌ హన్మంతరావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఆర్వో రాధికారమణి, ఆర్డీవో నగే్‌షగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement