సంపదయే ధర్మానికి, కామానికి ఆలంబన

ABN , First Publish Date - 2020-03-13T08:36:09+05:30 IST

‘సంపద వల్లనే అన్ని కార్యాలూ నెరవేరుతాయి. సంపద లేకపోతే ధర్మమూ కామమూ సిద్ధించవు’ అని భారతంలోని శాంతిపర్వం చెబుతోంది. నిజానికి ఐహిక ఆధ్యాత్మిక సాధనకు సంపదయే మూలం. సంపద ఉంటేనే ధర్మాచరణ...

సంపదయే ధర్మానికి, కామానికి ఆలంబన

  • అర్థ ఇత్యేవ సర్వేషాం కర్మణామవ్యతిక్రమః
  • న హ్యృతేర్థేన వర్తేతే ధర్మకామావితి శ్రుతిః


‘సంపద వల్లనే అన్ని కార్యాలూ నెరవేరుతాయి. సంపద లేకపోతే ధర్మమూ కామమూ సిద్ధించవు’ అని భారతంలోని శాంతిపర్వం చెబుతోంది. నిజానికి ఐహిక ఆధ్యాత్మిక సాధనకు సంపదయే మూలం. సంపద ఉంటేనే ధర్మాచరణ సాధ్యమవుతుంది, కామము అనుభవింపబడుతుంది. భారతీయ సనాతన సంప్రదాయం ప్రకారం ప్రతి వ్యక్తీ ధర్మబద్ధంగా సంపదను ఆర్జించి, కామ్యాలను అనుభవించి, మోక్షాన్ని సాధించాలి. ఈ ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే.. నాలుగు పురుషార్థాలుగా చెప్పారు. భౌతిక జీవితంలో వర్ణభేదం, వయోభేదం, లింగభేదం లేకుండా అందరూ సంపదను, ఆ సంపదతో వచ్చే భోగాలను అపేక్షిస్తారు. అందుకే ‘ధనం మూలం ఇదం జగత్‌’ అన్నారు. అభ్యుదయ కారకమైన సంపదను ధర్మబద్ధంగా అపారంగా సంపాదించి, సద్వినియోగం చేయాలని సనాతన ధర్మం సూచిస్తుంది. సంపదను తాననుభవించడం, అర్హత ప్రాతిపదికగా అవసరార్థులకు దానం చేయడం వల్ల అది సద్వినియోగం అవుతుంది. అర్హతలేని వారికి ఇవ్వడం, అప్రయోజన కార్యక్రమాలకు వెచ్చించడం వల్ల దుర్వినియోగం అవుతుంది. ఒకరికి పెట్టక, తాను తినక, లోభత్వంతో దాచడం వల్ల నిరుపయోగం అవుతుంది. పర్వత శిఖరాల నుండి జలజలా పారే జీవనదులు పంటలను సుభిక్షం చేస్తున్నట్లుగా.. సంపద ఉంటే అన్ని కార్యాలూ సుసంపన్నమవుతాయి. సంపద లేకపోతే ఎండాకాలంలో ఎండిపోయిన చిన్న జలాశయాలవలె కార్యభంగం అవుతుందని రామాయణంలోని యుద్ధకాండ చెబుతోంది.

సంపద ఉన్నచోటే మిత్రులు ఉంటారు, బంధువులు ఉంటారు. ఐశ్వర్యం కలవాడినే లోకం కీర్తిస్తుందని.. సంపదను పొందడంలో మాత్రమే ఆసక్తి కలిగి మానవతను మరిచే వారిని ద్వేషిస్తుందని రామాయణం చెబుతోంది. భూమి, బంగారం, వెండి, అధికారం ఇవి కలహాలకు కారణా లవుతాయని రామునితో వాలి అంటాడు. భారతీయ సంప్రదాయం ప్రకారం వ్యక్తి కర్తవ్యాలు నాలుగు. అవేంటంటే.. బ్రహ్మచర్యాశ్రమంలో విద్యాధనాన్ని సాధించడం. గృహస్థాశ్రమంలో సంతానాన్ని కనిపెంచడం, సంపదను సృష్టించడం, పెంచడం, రక్షించుకోవడం, దానధర్మాలు చేయడం. అలా సంపాదించిన సొమ్మును వానప్రస్థంలో వారసులకు అందజేసి అంతర్ముఖులై యోగ సంపదను సాధించడం. సన్యాసాశ్రమంలో భౌతిక జగత్తును విడిచి ముముక్షత్వ సంపదను సాధించడం. అర్థసాధన ధర్మాభిముఖమైతే శ్రేయస్సు.. కామాభిముఖమైతే దుర్గతులు ప్రాప్తిస్తాయని భారతీయ ఆధ్యాత్మిక ధర్మం బోధిస్తోంది.

- పాలకుర్తి రామమూర్తి, 9441666943


Updated Date - 2020-03-13T08:36:09+05:30 IST