అంతరాల సమాజానికి సంపద పంపిణీ చికిత్స

ABN , First Publish Date - 2021-06-11T05:58:59+05:30 IST

కరోనా మహమ్మారి ఏడాదిన్నర కాలంలో మన దేశంలో మూడు లక్షల మందిని బలితీసుకుంది. మరోపక్క ఈ విలయం కోటాను కోట్ల ప్రజల జీవనాన్ని...

అంతరాల సమాజానికి సంపద పంపిణీ చికిత్స

కరోనా మహమ్మారి ఏడాదిన్నర కాలంలో మన దేశంలో మూడు లక్షల మందిని బలితీసుకుంది. మరోపక్క ఈ విలయం కోటాను కోట్ల ప్రజల జీవనాన్ని కకావికలం చేసింది. ఈ పరిణామాల మీద తగిన చర్చ లేకుండా పోయింది.


దేశంలో 50 కోట్లమంది ఉపాధి రంగంలో వుంటే అందులో 45కోట్లమంది (90శాతం) అసంఘటిత రంగంలోనే ఉన్నారు. అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీతో సహా అనేక సంస్థలు చేసిన సర్వేల ప్రకారం మధ్యతరగతిగా ఉన్న 3 కోట్ల మంది గత ఏడాది కాలంలో పేదరికంలోకి దిగజారారు. అసంఘటిత కార్మికుల సంపాదన తగ్గిపోవడంతో వీరిలో 40 శాతం మంది ఒక పూట భోజనంతో సరిపెట్టుకుంటున్నారు. గతంలో పొదుపు సొమ్ము చిల్లర ఆస్తులు అమ్మేసుకుంటున్నారు. స్థానిక వడ్డీ వ్యాపారుల నుండి అధిక వడ్డీలతో అప్పులు చేస్తున్నారు. ఇదే పరిస్థితి మరి కొంత కాలం కొనసాగితే ఆకలి చావుల ప్రమాదం పొంచి వుందని, అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యలు పెరిగే స్థితి వుందని, పోషకాహార లోపంతో మరణాలు వుంటాయని, వీటి సంఖ్య కరోనా మరణాలకు మించే ప్రమాదముందని నిపుణులు పేర్కొంటున్నారు.


కోవిడ్‌ కల్లోలం ప్రకృతి ప్రసాదితం. దానికి చికిత్స అవసరం. అలాగే పేదరికం దోపిడీ వ్యవస్థ ప్రసాదితం. దానికి తగ్గ శస్త్ర చికిత్స కూడా నేడు తక్షణావసరం. లేకపోతే కోటానుకోట్లమంది ప్రజలు మూకుమ్మడి ఆకలి చావులు, ఆత్మహత్యల దిశగా నెట్టివేయబడతారు. పేదరికం, అంతరాల అగాధాలపై చర్చ గత దశాబ్దకాలంగా ప్రపంచవ్యాపితంగా మొదలైంది. సంక్షిప్తంగా ఆ నేపథ్యాన్ని పరిశీలించుకుందాం.


1990 దశకంలో సోషలిస్టు దేశాలు పతనం అయ్యాయి. మరోపక్క పెట్టుబడి ప్రపంచీకరణ ఊపు అందుకుంది. పెట్టుబడిదారీ వ్యవస్థ శాశ్వతం అనీ, అది సాధించే అభివృద్ధి ఫలితాలు తిరిగి ప్రజలపై వర్షిస్తాయనీ, వారి పేదరికమూ, వారి మధ్య అంతరాలూ తొలగుతాయనీ దాని సిద్ధాంతకర్తలు ఊదరగొట్టారు. మార్క్స్ భావజాలానికి కాలం చెల్లిందని ప్రగల్భాలు పలికారు. 2008లో అమెరికాతో సహా పెట్టుబడిదారీ దేశాలు ఆర్థిక మాంద్యంతో సంక్షోభంలో పడ్డాయి. వేతన స్తంభనలూ, సంక్షేమాల కోతల వంటి చిట్కాలు వారిని గట్టెక్కించలేకపోయాయి.


మార్క్స్ భావాలకు కాలం చెల్లిందన్నవాళ్లే ఈ సంక్షోభాన్ని అర్థం చేసుకోడానికి మార్క్స్ ‘కాపిటల్’ గ్రంథాన్ని చదవాలని ప్రకటించారు. సంపద కొద్దిమంది చేతుల్లోనూ, పేదరికం అత్యధిక సంఖ్యాకుల వద్దనూ పేరుకుపోవడాన్ని గుర్తించడం మొదలైంది. ఈ దశలో పికెట్టీ రాసిన ‘21వ శతాబ్దపు పెట్టుబడి’ పుస్తకం వెలువడింది. పెట్టుబడి సృష్టించిన అంతరాల అగాధాన్ని అది బట్టబయలు చేసింది. మరోపక్క ఆక్స్‌ఫాం సంస్థ ప్రపంచంలో 1 శాతం మంది దగ్గర 70 శాతం సంపద పోగుపడ్డ తీరునీ, కోటానుకోట్ల మందిని పేదరికంతో ముంచిన స్థితినీ తన నివేదికలలో వెల్లడించింది. దీంతో పలుదేశాలలో ఈ అంతరాల అగాధాన్ని, పేదరికాన్ని తొలగించే మార్గాలుగా నగదు బదిలీలు, కనీస మౌలిక ఆదాయాన్ని అందించే ప్రయోగాలు మొదలయ్యాయి. 


ఈ నేపథ్యంలో భారతదేశంలో సంపద కేంద్రీకరణ పర్యవసానాలను పరిశీలించుకోవాలి. ఆక్స్‌ఫాం నివేదిక ప్రకారం మనదేశంలో 10 శాతం దగ్గర 77 శాతం దేశ సంపద పోగై వుంది. కరోనా ప్రారంభానికి ముందే ఇక్కడ అంతరాల అగాధాలపైన, పేరుకుపోతున్న పేదరికాన్ని తగ్గించడానికి నగదు బదిలీలు, మౌలిక ఆదాయ కల్పన వంటి అంశాలపైన చర్చ మొదలైంది. 


పన్నుల ద్వారా వచ్చే సొమ్మును పంపిణీ చేస్తూ అంతరాలను రూపుమాపటం అనేది ఒక ఉపాయంగా చర్చకు వచ్చింది. 2017 బడ్జెట్‌కి ముందు ప్రవేశపెట్టే ఆర్థిక సర్వే నివేదికలో పేదరికంలో ఉన్న కుటుంబాలకు నగదు బదిలీ చేయటం ద్వారా మౌలిక ఆదాయాన్ని కల్పించటంపై ఒక అధ్యాయాన్ని కేటాయించి చర్చించారు. కానీ ‘పన్నుల సొమ్ము’తో మౌలిక ఆదాయ కల్పన సాధ్యం కాదన్నది అంతిమంగా తేలిపోయింది. అందుకే బడ్జెట్‌లో దాని ప్రస్తావనే లేకుండాపోయింది. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో కొన్ని లక్షల కోట్ల రూపాయలను పేదల మౌలిక ఆదాయ కల్పనకు ఖర్చు చేసే స్థితి లేదు. ఎందుకంటే కార్పొరేట్‌ పన్నుకు వరుసగా రాయితీలు ఇచ్చి దాదాపు 3 లక్షల కోట్ల ఆదాయాన్ని కోల్పోయారు. తగ్గిన ఆదాయాన్ని పూడ్చుకోడానికి అప్పుల మీద, ప్రభుత్వ రంగ ఆస్తుల అమ్మకం మీద, కొన్ని ఎంపిక చేసిన సంక్షేమ పథకాల కుదింపు మీద ఆధారపడాల్సిన స్థితికి వచ్చారు. పైగా బడ్జెట్‌కు రాజకీయ లక్ష్యాలు కూడా వచ్చి చేరాయి. కొన్ని బృందాలకు నగదు బదిలీ ద్వారా ‘ఓటు బ్యాంకు’లను ఏర్పరచుకోవడం, ఎన్నికల నిధులు సమకూర్చుకోడానికి కార్పొరేట్‌ శక్తులకు రాయితీలు ప్రకటించడం వంటి లక్ష్యాలవి. బడ్జెట్లు వీటికే పరిమితం అవుతున్నాయి. అంతకుమించి దీర్ఘకాలికమైన మౌలిక ఆదాయ పథకాన్ని నెత్తికెత్తుకునే స్థితి దానికి ఎంతమాత్రమూ లేదు. 


ఇక పారిశ్రామిక లాభాల పంపిణీని పరిశీలిద్దాం. పారిశ్రామికరంగంలో కార్మికులకు బోనస్‌ అన్న అంశం మీద దాదాపు యాభై ఏళ్ళ చర్చ నడిచింది. బోనస్‌ అనేది పరిశ్రమల యజమానులు ఐచ్ఛికంగా, బహుమతిగా ఇచ్చేది అన్న వాదన చివరికి వీగిపోయింది. యజమానుల లాభంలో కార్మికుల అదనపు శ్రమ ఇమిడి ఉన్నందున లాభంలో వాటాగా బోనస్‌ చెల్లించాలన్న వాదన ఆధారంగా 1965 బోనస్‌ చట్టం వచ్చింది. కార్మికుల అదనపు శ్రమే యజమాని లాభం అన్న మార్క్స్ ‌విశ్లేషణను ఇది సమర్థించినట్లయింది. చట్టంలో నిర్దేశించిన ప్రకారం లాభంలో ఒక వాటాను వేరు చేసి విధిగా చెల్లించే పద్ధతి స్థిరపడింది. దీనికి తోడు 2013లో కంపెనీల చట్టాన్ని సవరించారు. కార్పొరేట్‌ లాభాలలో 2 శాతాన్ని సమాజం కోసం ఖర్చు చెయ్యాలన్నది చట్టబద్ధం అయింది. వస్తువు తయారీలో యజమాని పొందే అదనపు శ్రమ లాభానికి మూలం అయినప్పటికీ ఆ వస్తువును సమాజం కొనుగోలు చేసినప్పుడే అది లాభంగా స్థిర రూపం పొందుతుంది అన్నది మార్క్స్ చేసిన విశ్లేషణే. లాభాలను సమాజానికి కూడా పంపిణీ చేయాలన్నదే ఈ సవరణ సారాంశం. 


ఇవి అనేక లోటుపాట్లు వున్న అరకొర చర్యలే. కాని లాభాలకు శ్రమదోపిడీ మూలం అనీ వాటిని కార్మికులకు, సమాజానికి హక్కుగా పంపిణీ చెయ్యాలన్న సూత్రాన్ని ఇవి ఆవిష్కరించాయి. భవిష్యత్తులో సంపద పంపిణీకి ఇది దారులు వేస్తుంది.


అదనపు శ్రమ లాభాలకు మూలమైనట్లే, ‘పోగుపడ్డ అదనపు శ్రమే’ సంపద అన్నది మార్క్స్ విశ్లేషణ. లాభాలలో వాటాను బోనస్‌గా కార్మికులకు అందివ్వటం, మరో వాటాను సమాజానికి ఖర్చుచెయ్యడం చట్టబద్ధమైనట్లే ఇప్పుడు పోగుపడ్డ సంపద పంపిణీని కూడా చట్టబద్ధం చెయ్యాలి. కరోనా కల్లోలం సృష్టించిన, నిరుద్యోగాన్ని, అర్ధాకలిని, అప్పుల వలయాన్ని అధిగమించడానికి పన్నుల సొమ్ముల పంపిణీ, అరకొరగా లాభాల వాటాలు సరిపోవు. ఈ పరిస్థితిని ఎదుర్కొనడానికి, దీర్ఘకాలికంగా ప్రజలకు జీవించే హక్కును కల్పించడానికి మిగిలిన ఏకైక పరిష్కారం ‘పోగుపడ్డ సంపదను’ పంపిణీ చెయ్యడమే. సంపద పంపిణీ ద్వారా పేదలకు నగదు బదిలీ చేసే మౌలిక ఆదాయ కల్పనతో పాటు మొత్తం సమాజానికి బతుకు భరోసానిచ్చే ఉన్నత ప్రమాణాల ఉచిత విద్య, ఉచిత వైద్య సేవలు, ఉపాధి నైపుణ్యాలు అందించే ఏర్పాటు జరగాలి. ఈ చర్యలు పేదరికంలో ఉన్న కోట్లాది ప్రజలలో, మౌలిక సదుపాయాలు అందని ప్రజలందరిలో కొత్త ఆకాంక్షను రేకెత్తిస్తాయి. 10 శాతం మంది దగ్గర పోగుపడ్డ సంపదపై 70 శాతం ప్రజలు జరిపే ఉద్యమంగా అది విస్తరిస్తుంది. ఇప్పుడు సంపద పంపిణీకి ద్వారాలు తెరిస్తే అది భవిష్యత్తులో సంపద సమాజపరం కావాలన్న సమసమాజ ఆకాంక్షకు దారి తీస్తుంది. సంపద పంపిణీ ద్వారా జీవించే హక్కును సాధించడం అన్నది తక్షణ ప్రజా ఉద్యమ నినాదం కావాలి.

డి.వి.వి.ఎస్. వర్మ

‘జాతీయ స్ఫూర్తి’ సంపాదకులు

Updated Date - 2021-06-11T05:58:59+05:30 IST