మరణాన్ని జయించే ఆయుధం

ABN , First Publish Date - 2020-06-05T05:30:00+05:30 IST

ఒక జీవి పుట్టిందంటే, దానికి మరణం ఖరారు అయిందనే! మరణించాలంటే పుట్టాలి కదా! కాబట్టి తన జీవిత కాలంలో మనిషి ఏ ఒక్క క్షణాన్నీ వృఽథా చేసుకోకూడదు. కరోనా వస్తుందని కలగన్నామా? మిడతల దండు వచ్చి పడుతుందని ముందే ఊహించామా? కనుక, వేమన అన్నట్టు ‘పుట్టలోని చెద పురుగుల్లా పుట్టామా? గిట్టామా?’ అన్నట్టు కాకుండా మనం ఏం సాధించాం? ఏం శోధించాం? ఏం మిగుల్చుకున్నాం? అని ఆలోచించాలి...

మరణాన్ని జయించే ఆయుధం

ఒక జీవి పుట్టిందంటే, దానికి మరణం ఖరారు అయిందనే! మరణించాలంటే పుట్టాలి కదా! కాబట్టి తన జీవిత కాలంలో మనిషి ఏ ఒక్క క్షణాన్నీ వృథా చేసుకోకూడదు. కరోనా వస్తుందని కలగన్నామా? మిడతల దండు వచ్చి పడుతుందని ముందే ఊహించామా? కనుక, వేమన అన్నట్టు ‘పుట్టలోని చెద పురుగుల్లా పుట్టామా? గిట్టామా?’ అన్నట్టు కాకుండా మనం ఏం సాధించాం? ఏం శోధించాం? ఏం మిగుల్చుకున్నాం? అని ఆలోచించాలి. ఈ ఆలోచనను కరోనా అందరిలో బాగానే కలిగించింది.


‘ఏం మిగుల్చుకున్నాం?’ అంటే ‘ఎంత ధనాన్ని కూడబెట్టుకున్నాం?’ అని కాదు. ‘ఎన్ని మారణాయుధాలను మూటగట్టుకున్నాం?’ అన్నది కాదు. ‘ఎంతంత అహంకారాల్నీ, ఎన్నెన్ని తలబిరుసుతనాల్నీ తెచ్చి పోగుచేసుకున్నాం’ అన్నదీ కాదు. అలాంటి లెక్కలేనితనాల లెక్కలన్నిటినీ తేల్చేసింది కరోనా! కాబట్టి, మనకు మిగిలే లెక్కలు, మనం మిగుల్చుకోవాల్సిన లెక్కలు కొన్ని ఉన్నాయి. ఆ సంపద ఉంటే మన చిరంజీవులమవుతాం. చిరకీర్తి పొందుతాం. కరోనా లాంటి కోటి ఉపద్రవాలనైనా నిలువరిస్తాం. పది కాలాలు నిలుస్తాం. అలా నిలబెట్టే సత్కీర్తి సంపదను పోగుచేసుకోవడంలో సిగ్గుపడకూడదు. కాలయాపన కూడదు. మరో జన్మ ఉందో, లేదో? ‘ఈ జన్మలో కాకపోతే ఇంకో జన్మలో సంపాదించవచ్చు’ అని ఉపేక్షించడం తగదు. మరో జన్మ అనేది నమ్మకం. ఈ జన్మ మాత్రం నిజం. నిజమైన దాన్ని నిర్లక్ష్యం చెయ్యడం ఎంత తప్పో బుద్ధుడు పదే పదే చెప్పేవాడు. 


‘‘వృద్ధాప్యం, మరణం, ఉపద్రవాలు, ప్రమాదాలు అనేవి నాలుగు మహా పర్వతాలు. చాలా ఎత్తైనవీ, బలమైనవీ. ప్రతి మనిషీ ఆ నాలుగు పర్వతాల మధ్యా చిక్కి ఉంటాడు. ఆ పర్వతాలు చాలా వేగంగా గిరగిరా తిరుగుతూ, ప్రళయకాల ప్రభంజనంలా గర్జిస్తూ, విలయ వికృత జ్వాలలను వెదజల్లుతూ- మధ్యలో ఉన్న మనిషి దగ్గరకు వచ్చేస్తూ ఉంటాయి. ఇలా పుట్టుకతోనే మరణం వేట మొదలవుతుంది. అవి అలా ఆగకుండా వచ్చేస్తాయి. వచ్చి క్షణాల మీద మనిషిని నలిపేస్తాయి’’ అని కోసల రాజు ప్రసేనజిత్తుతో బుద్ధుడు చెప్పాడు. 

అంతేకాక ‘‘రాజా! ఈ మరణ ప్రమాద నుంచి ఎవరు బయటపడగలరు? మరణాన్ని ఎవరు తప్పించుకోగలరు?’’ అని బుద్ధుడు అడిగాడు.

‘‘భగవాన్‌! ఎవరూ తప్పించుకోలేరు’’ అన్నాడు ప్రసేనుడు.


‘‘కాబట్టి నీవు ఏం చేయాలి?’’

‘‘మరణం తప్పదు భగవాన్‌! కాబట్టి నా జీవితమంతా దాని నుంచి తప్పించుకొనే మార్గం కోసం ప్రయత్నించడం వృఽథా ప్రయాస అవుతుంది. కాబట్టి ప్రతి క్షణాన్నీ ధర్మసాధనలో గడిపేయాలి’’ అన్నాడు ప్రసేనుడు. 


‘‘అవును ప్రసేనా! అదే మరణాన్ని జయించే మార్గం! మనం చేసే మంచి పనులూ, మంచి ఆలోచనలూ, మానవీయ కర్మలూ, కుశల కర్మలూ... ఇవి మనల్ని చావుతో పాటు చంపేయవు. కనుక, ఉన్న ఈ ఒక్క జీవితాన్నీ వృఽథా చేసుకోవద్దు’’ అని చెప్పాడు బుద్ధుడు.

మరణాన్ని జయించే ఆయుధం మంచితనం. ఆ ధర్మాయుధాన్ని మనకు అందించాడు బుద్ధుడు.

-బొర్రా గోవర్ధన్


Updated Date - 2020-06-05T05:30:00+05:30 IST