స్వచ్ఛీకరణ... ఇంకెన్నాళ్లు?

ABN , First Publish Date - 2020-10-19T09:20:10+05:30 IST

గుంటూరు జిల్లా పెద్దకూరపాడు మండలం బలుసుపాడుకు చెందిన రైతు శివరామరాజు. ఆయన తండ్రి పేరిట ఉన్న ఎకరం భూమిలో 10 సెంట్లు తగ్గించి వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేశారు.

స్వచ్ఛీకరణ... ఇంకెన్నాళ్లు?

11 నెలలుగా సాగుతున్న ప్రక్రియ 

తప్పులను గుర్తించడంలోనే వేగం 

వాటి పరిష్కారం మాత్రం శూన్యం 

ప్రహసనంలా భూమి రికార్డుల స్వచ్ఛీకరణ 

ఇది పూర్తయితేనే వెబ్‌ల్యాండ్‌లో మార్పులు 


(అమరావతి-ఆంధ్రజ్యోతి) 

గుంటూరు జిల్లా పెద్దకూరపాడు మండలం బలుసుపాడుకు చెందిన రైతు శివరామరాజు. ఆయన తండ్రి పేరిట ఉన్న ఎకరం భూమిలో 10 సెంట్లు తగ్గించి వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేశారు. ఇప్పుడు 90 సెంట్లే ఉన్నట్లు రెవెన్యూ అధికారులు లెక్క చెబుతున్నారు. ఆ 10 సెంట్లు మరో రైతు ఖాతాలో వేశారు. తహసీల్దార్‌ కార్యాలయంలోని ఒరిజినల్‌ రికార్డుల్లో ఎకరం భూమి ఉంది. వెబ్‌ల్యాండ్‌ ఎంట్రీ సరిచేసి తన భూమిని కాపాడాలంటూ ఆయన కొన్నేళ్లుగా మండల రెవెన్యూ ఆఫీసు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. దీనిపై బాధిత రైతు 1902, స్పందనలో అనేకసార్లు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం, జిల్లా కలెక్టర్‌, జేసీకి లేఖలు రాయడంతో పాటు ఈ-మెయిల్‌ పెట్టారు. ఇటీవలే ఆ గ్రామంలో భూమి రికార్డుల స్వచ్ఛీకరణ చేపట్టినా ఆయన సమస్య మాత్రం తీరలేదు. స్పందనలో పెట్టిన విన్నపాలన్నీ బుట్టదాఖలయ్యాయి.


1902 నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇక సీఎంఓ, కలెక్టర్‌కు ఇచ్చిన వినతులకూ బదులు రాలేదు. ఈ రైతు కష్టం ఎప్పటికి తీరుతుందో తెలియదు. కానీ సర్కారు మాత్రం భూమి రికార్డుల స్వచ్ఛీకరణ అద్భుతంగా జరుగుతోందని, జనవరి నుంచి రీ సర్వేకు సన్నద్ధం కావాలంటూ రెవెన్యూ, సర్వే శాఖలను ఆదేశించింది. వెబ్‌ల్యాండ్‌లో ఉన్న లక్షలాది తప్పులు సరిదిద్దకుండా, రైతుల విన్నపాలు పూర్తిగా పరిష్కరించకుండానే రీసర్వే చేస్తే అందులోనూ ఇవే వివాదాలు పునరావృతం అవుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 


స్వచ్ఛీకరణ తర్వాతే ఏదైనా...

రాష్ట్రంలోని 17వేల గ్రామాల్లో భూ రికార్డుల స్వచ్ఛీకరణ అట్టహాసంగా ప్రారంభమై ఇప్పటికి 11 నెలలు అవుతోంది. ఈ నవంబరు 1తో ఏడాది కూడా పూర్తవుతుంది. కానీ తప్పులను గుర్తించినంత వేగంగా వాటిని పరిష్కరించడం ముందుకు సాగట్లేదన్న విమర్శలున్నాయి. కార్యక్రమం ప్రారంభమైన వెంటనే ఇంటి స్థలాల భూ సేకరణకే రెవెన్యూ అధికారులు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ఒత్తిడి చేశారు. అది కొనసాగుతుండగానే కరోనాతో ఈ కార్యక్రమానికి బ్రేక్‌ పడింది. ఇటీవల కొన్ని మండలాల్లో తిరిగి ప్రారంభించినా ఇంకా పూర్తిస్థాయిలో ఊపందుకోలేదు. వెబ్‌ల్యాండ్‌ ఎంట్రీల్లో తప్పులు సరిదిద్దాలని రైతులు కోరితే ‘‘రికార్డుల స్వచ్ఛీకరణ జరుగుతోంది. అది పూర్తయ్యేవరకు వెబ్‌ల్యాండ్‌ ఎంట్రీలు మార్చడం కుదరదు’’ అని అధికారులు తేల్చి చెబుతున్నారు. వాస్తవానికి వెబ్‌ల్యాండ్‌ తప్పులను సరిదిద్దడంలో కీలకమైన ప్రక్రియే రైతుల విన్నపాలను పరిష్కరించడం. ఒరిజినల్‌ రికార్డులను సరిపోల్చి వెబ్‌ల్యాండ్‌ రికార్డులో ఉన్న తప్పులు సరిదిద్దాలి. ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం కూడా ఇదే. అయితే స్వచ్ఛీకరణ పూర్తయ్యేదాకా సవరణే చేపట్టమంటే... అసలు లక్ష్యాన్ని పక్కన పెట్టేసినట్లే. పైగా ఈ కార్యక్రమం ఎప్పటికి పూర్తవుతుందో కూడా తెలియదు.  


వెబ్‌ల్యాండ్‌... తప్పుల తడక 

వెబ్‌ల్యాండ్‌ పుణ్యమా అని లక్షలాది మంది రైతులు భూ వివాదాలు ఎదుర్కొంటున్నారు. ఒరిజినల్‌ అడంగల్‌ ఆధారంగా వెబ్‌ల్యాండ్‌ రికార్డులు నమోదు చేసే క్రమంలో రైతుల సర్వే నంబర్లు, భూమి విస్తీర్ణంలో హెచ్చతగ్గులు చూపించారు. ఎకరాలకు ఎకరాల భూమిని మాయం చేస్తూ ఇతరుల ఖాతాల్లో చూపించిన ఉదంతాలు వెలుగు చూశాయి. అధికారిక నివేదిక ప్రకారమే 4,29,930 సర్వే నంబర్లను వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయలేదు. 48,52,144 ఎకరాల భూమిని రికార్డుల్లో ఎంట్రీ చేయలేదు. ఇంకా విస్తీర్ణంలో తేడాలు, సర్వే నంబర్లలో తప్పులతో 8,32,269 సబ్‌ డివిజన్లలోని 31.43 లక్షల ఎకరాలు ఒరిజినల్‌ అడంగల్‌తో సరిపోలడం లేదు. ఇవన్నీ తప్పుడు ఎంట్రీలతో వచ్చిన సమస్యలే.


వీటిని పరిష్కరించాలంటూ కొన్నేళ్లుగా రైతులు రెవెన్యూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రత్యామ్నాయం చూపడకుండానే కరణాలు, మున్సబుల వ్యవస్థను తీసేసిన అప్పటి సీఎం ఎన్టీఆర్‌... రెవెన్యూ వ్యవస్థను దెబ్బతీశారని విమర్శించిన ప్రభుత్వం భూ వివాదాల పరిష్కారం పేరిట గతేడాది రికార్డుల స్వచ్ఛీకరణ కార్యక్రమం మొదలుపెట్టింది. ఈ సందర్భంగా రెవెన్యూ తీసిన లెక్కలను చూస్తే వెబ్‌ల్యాండ్‌లో తప్పులు లక్షల్లో కాదని కోట్లల్లో ఉన్నాయని వెలుగు చూసింది. తప్పులు బయటపెట్టిన రెవెన్యూశాఖే ఇప్పుడు వాటిని పరిష్కరించాల్సి ఉంది.

Updated Date - 2020-10-19T09:20:10+05:30 IST