ఎలుక పిల్ల పెళ్ళి!

ABN , First Publish Date - 2020-07-12T05:30:00+05:30 IST

ఒక చెట్టుకింద తొర్రలో ఓ ఎలుక ఉంటోంది. దానికి ఒక్కగానొక్క కూతురు. తన కూతురికి ప్రపంచంలోనే అతి బలవంతుడైన వ్యక్తిని భర్తగా తేవాలనుకుంది ఆ ఎలుక...

ఎలుక పిల్ల పెళ్ళి!

ఒక చెట్టుకింద తొర్రలో ఓ ఎలుక ఉంటోంది. దానికి ఒక్కగానొక్క కూతురు. తన కూతురికి ప్రపంచంలోనే అతి బలవంతుడైన వ్యక్తిని భర్తగా తేవాలనుకుంది ఆ ఎలుక. అనుకున్నదే తడవుగా బ్రహ్మలోకానికి వెళ్లింది. 

‘‘బ్రహ్మగారూ!  ప్రపంచాన్నే సృష్టించిన వ్యక్తి మీరు. మీకంటే శక్తిమంతుడైన అల్లుడు నాకు ఎక్కడ దొరుకుతాడు? దయచేసి మా అమ్మాయిని వివాహమాడండి’’ అని కోరింది.

బ్రహ్మ ఆలోచించి, ‘‘పిచ్చిదానా! నేను శక్తిమంతుడిని ఎలా అవుతాను? నేను కూర్చున్న పద్మం విష్ణుమూర్తి నాభి నుంచి మొలిచింది. నన్ను భరిస్తున్నది ఆయనే! కనుక ఆయనే నీకు సరైన అల్లుడు’’ అన్నాడు. 

‘అవును కదా!’ అనుకుంది ఎలుక. 

వెంటనే వైకుంఠానికి వెళ్ళింది. మహావిష్ణువుకు తను వచ్చిన పని చెప్పింది. 

ఆయన చిరునవ్వు నవ్వి ‘‘బ్రహ్మను మోస్తున్నది నేనే! కానీ నేను పడుకుంటే నన్ను మోస్తున్నది ఆదిశేషుడు. అది గమనించు. నీకు తగిన అల్లుడు ఆదిశేషుడే!’’ అని అన్నాడు.

‘నిజమే సుమీ!’ అనుకొని, ఆ ఎలుక వెళ్ళి ఆదిశేషుణ్ణి కలిసి తన కూతుర్ని పెళ్ళాడమంది. 

అంతా విని ఆదిశేషుడు ‘‘నేను అతి శక్తిమంతుణ్ణి కానమ్మా! గరుత్మంతుణ్ణి చూస్తే నాకు వణుకు. ఆయనే బలశాలి’’ అన్నాడు.

గరుత్మంతుడి దగ్గరకు వెళ్ళింది ఎలుక. 

కథంతా విని ఆయన ‘‘పిచ్చి ఎలుకా! సాక్షాత్తూ పరమేశ్వరుణ్ణే మోసే నందీశ్వరుడే నీకు తగిన అల్లుడు’’ అన్నాడు.

‘‘అవును!’’ అనుకొని. ఎలుక కైలాసం వెళ్ళి నందిని సంప్రతించింది. 

‘‘నాకు శక్తా? నా మొహం. వాయుదేవుడు గట్టిగా వీస్తే కైలాసం దిగువకు వెళ్ళిపడతాను. నీకు సరైన అల్లుడు వాయుదేవుడే!’’ అన్నాడు నంది.

వాయుదేవుడిని కలిసింది ఎలుక. 

‘‘నిజమే నా ధాటికి ఏవీ ఆగవు. కానీ ఆ కైలాస పర్వతాన్ని చూడు! అంగుళం కూడా కదిలించలేక పోతున్నాను’’ అన్నాడు వాయువు బాధపడుతూ. 

ఎలుక కైలాస పర్వతాన్ని కలిసి ‘‘ప్రపంచంలో అతిబలవంతుడివీ, శక్తిశాలివీ నీవే అని తేలిపోయింది. నా కూతుర్ని పెళ్ళాడు’’ అంది.

‘‘శక్తిశాలినా... నా బొందా! చెప్పుకుంటే సిగ్గుచేటు! లోపల మీ మూషిక సంతతి బొరియలు తవ్వుతూ నా ఒళ్ళంతా గుల్లచేస్తున్నాయి. అవే నా కంటే నిజమైన శక్తిశాలులు. కనుక ఓ చక్కని ఎలుకను చూసి నీ బిడ్దనిచ్చి పెళ్ళి చెయ్యి!’’ అని హితోపదేశం చేశాడు హిమవంతుడు.  

దాంతో ఆ ఎలుక తన పిల్లకు మరో ఎలుకతో ఘనంగా పెళ్ళి చేసింది.


- చంద్రప్రతాప్‌

8008143507


Updated Date - 2020-07-12T05:30:00+05:30 IST