Abn logo
Sep 25 2021 @ 02:46AM

వారం వారం.. యాత్రా స్పెషల్‌

ఆ ఐఏఎస్ కు ప్రత్యేక హోదా.. వీకెండ్‌ రాగానే ఢిల్లీ టూర్‌

శని, ఆదివారాలు సెలవులు.. అయినా అధికార పర్యటనే

అనుమతి ఇచ్చేసిన సర్కారు.. ఖర్చులన్నీ ఖజానా నుంచే


శుక్రవారం రాగానే... సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలకు చెందిన ఉద్యోగులు చాలామంది హైదరాబాద్‌కు వెళతారు. తమ కుటుంబాలు అక్కడే ఉండటంతో... వారం వారం ఇదో తప్పనిసరి యాత్ర! ఎవరి ఖర్చులు వారివేనండోయ్‌! 

ఒక పెద్ద ఐఏఎస్‌ అధికారి ఉన్నారు. వీకెండ్‌ రాగానే ఆయన ఢిల్లీ ఫ్లైటు ఎక్కేస్తారు. శని, ఆదివారాలు అక్కడే ఉండి... సోమవారానికి తిరిగి వస్తారు. ఖర్చులు మాత్రం ప్రభుత్వానివే! విమానంలో బిజినెస్‌ క్లాస్‌ కదా... రానూపోనూ సుమారు ఓ యాభై వేల రూపాయలు! ఇవి జనం సొమ్ములే!


(అమరావతి - ఆంధ్రజ్యోతి): ఆయన పేరు... ప్రవీణ్‌ ప్రకాశ్‌! ముఖ్యమంత్రికి ఆయన ముఖ్య కార్యదర్శి! అక్కడ ఆయనే సర్వస్వం! ఓరకంగా చెప్పాలంటే... ముఖ్యమంత్రి తర్వాత అంతటి వ్యక్తి! గతంలో అనేకానేక వివాదాల్లో గట్టిదెబ్బలే తిన్న ప్రవీణ్‌ ప్రకాశ్‌... ముఖ్యమంత్రి జగన్‌కు అత్యంత ప్రీతిపాత్రమైన అధికారి. అంత వరకు ఓకే!  కానీ, ప్రవీణ్‌ ప్రకాశ్‌కు జగన్‌ ఒక బంపర్‌ ఆఫర్‌ ఇచ్చేశారు. ‘ప్రత్యేక హోదా’ కల్పించారు. అదేమిటంటే... ప్రతి వారాంతం, అంటే... శని, ఆదివారాల్లో ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఢిల్లీలో ఉండొచ్చు. ఆయన శుక్రవారం ఇక్కడి నుంచి బయలుదేరి... సోమవారం మధ్యాహ్నానికి తిరిగి వస్తారు. ఇది ‘అధికారిక పర్యటన’! అయితే... అక్కడ ఆయనేం చేస్తారన్నది ఎవరికీ తెలియదు. అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే... ప్రవీణ్‌ ప్రకాశ్‌ సతీమణి భావనా సక్సేనా ఢిల్లీలో ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా పనిచేస్తున్నారు.


ఆమె దేశ రాజధానిలోనే ఉంటారు. అంటే... ప్రవీణ్‌ ప్రకాశ్‌ ప్రతివారం ఢిల్లీలోని తన నివాసానికి వెళుతున్నారన్న మాట! అది కూడా ప్రభుత్వ ఖర్చులతో! సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలకు శని, ఆదివారాలు సెలవు! ఆ రెండు రోజులు ఎక్కడ ఉండాలన్నది ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఇష్టం! ఢిల్లీలో ఉన్న తన ఇంటికి వెళ్లి రావడంపై ఎవరికీ అభ్యంతరం ఉండక్కర్లేదు. కానీ... దీనిపై ‘అఫిషియల్‌ టూర్‌’ ముద్ర వేయడమే ఇక్కడ విచిత్రం! ప్రతి వీకెండ్‌లో ఢిల్లీ యాత్ర చేసేందుకు ప్రవీణ్‌ ప్రకాశ్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చేసింది. విమాన ప్రయాణ ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుంది. ఇతర అధికారుల మాదిరిగా ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఎకానమీ క్లాసులో వెళ్లరు. బిజినెస్‌ క్లాస్‌ కావాల్సిందే. వెరసి... ఒక్క విమాన ప్రయాణ ఖర్చే సుమారు 50వేల రూపాయల  దాకా ఉంటుంది. ఈ లెక్కన నెలకు రూ.2 లక్షల వ్యయం!


ఆయనకు మాత్రమే ఎందుకో...

రాష్ట్ర విభజన తర్వాత... పరిపాలనను అమరావతికి మార్చాక ప్రభుత్వం శని, ఆదివారాలను సెలవులుగా ప్రకటించింది. చాలామంది ఉన్నతాధికారులు వివిధ కారణాలవల్ల కుటుంబాలను హైదరాబాద్‌లోనే ఉంచి... తాము మాత్రం ఇక్కడికి వచ్చారు. వారానికి ఒకసారి ఇంటికి వెళ్లివచ్చేందుకే ఈ వెసులుబాటు. చాలామంది సీనియర్‌ ఐఏఎ్‌సల నుంచి సామాన్య జూనియర్‌ అసిస్టెంట్‌ వరకు అనేక మంది సొంత ఖర్చులతోనే హైదరాబాద్‌కు వెళ్లి వస్తుంటారు. శుక్రవారం సాయంత్రం విధులు ముగించుకొని బయలుదేరి... సోమవారం ఉదయం ఆఫీసు సమయానికి తిరిగి చేరుకుంటారు. ఇది వారి సొంత పని కాబట్టి... సొంత ఖర్చుతోనే వెళ్లి వస్తారు. కానీ... ఢిల్లీలో ఫ్యామిలీ ఉన్న ప్రవీణ్‌ ప్రకాశ్‌ మాత్రం ప్రభుత్వ ఖర్చులతోనే వెళ్లి వస్తున్నారు. ‘‘ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ ప్రతీ వారాంతం (శని, ఆదివారం) అధికారిక హోదాలో ఢిల్లీ వెళ్లి వచ్చేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది’’ అని సాధారణ పరిపాలన శాఖ ధ్రువీకరించింది. సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు ఈ సమాధానం చెప్పింది. ‘అధికారిక హోదా’లో పర్యటన అంటే అందుకయ్యే ప్రయాణం, ఇతర ఖర్చులన్నీ ప్రభుత్వమే  భరిస్తుంది. 


అధికారికంగా చేసేదేముంది?

ప్రవీణ్‌ ప్రకాశ్‌ కేంద్ర సర్వీసులో ఉండేవారు. జగన్‌ సీఎం అయ్యాక ఆయన్ను ఏరికోరి డిప్యుటేషన్‌పై ఇక్కడికి తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్యకార్యదర్శిగా నియమించారు. విజయవాడలోని స్టేట్‌ గెస్ట్‌హౌ్‌సలో ఆయనకు విలాసవంతమైన గదులు ఇచ్చారు. అయితే... ప్రవీణ్‌ ప్రకాశ్‌ సతీమణి భావనా సక్సేనా ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వానికి  చెందిన ఏపీ భవన్‌లో రెసిడెంట్‌ కమిషనర్‌గా ఉన్నారు. తన కుటుంబంకోసం ప్రతీ  వారం ఢిల్లీ వెళ్లిరావడాన్ని ఎవరూ తప్పుపట్టరు.  కానీ, దీనికి ‘అధికార’ ముద్ర వేయడమే విశేషం. శనివారం, ఆదివారం కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కూడా పని చేయవు. మరి ఆ రెండు రోజులు ఢిల్లీలో ఏం చేస్తారు? ప్రధానమంత్రి, హోం మంత్రి, ఇతర కేంద్ర మంత్రులను నేరుగా ఆయన కలువలేరు.


ఆయా శాఖల కార్యదర్శులు, కిందిస్థాయి అధికారులను కలిసే అవకాశం ఉంది. కానీ... వీకెండ్‌లో ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఏపీ నుంచి వస్తున్నారని వారు సెలవు రోజుల్లో పనిచేస్తారా? ఇది అయ్యేపనేనా? గత కొన్నేళ్లలో అప్పుడప్పుడు ప్రవీణ్‌ ప్రకాశ్‌ కొందరు ఢిల్లీ అధికారులను కలవడం నిజమే! కలిసి ఏం చేస్తారంటే... రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఓ ఖరీదైన శాలువాకప్పి సన్మానిస్తారు. తిరుమల వెంకటేశ్వరస్వామి ప్రసాదమున్న లడ్డూల కవర్‌ను, ఒక దేవుడి  ఫోటోను అందించి వారితో ఓ ఫోటో దిగుతారు.ఆ వెంటనే ఈ విషయాన్ని ఇక్కడి ఏపీ ఐఏఎస్‌ అధికారుల గ్రూపులు, ఫేస్‌బుక్‌లో పోస్టుచేస్తారు. ఇంతకు మించి ప్రవీణ్‌ప్రకాశ్‌ రాష్ట్రానికి తీసుకొచ్చిన అదనపు నిధులు, వనరులు, ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా? అంటే... తెలియదు!


అక్కడ అందరున్నా...

రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, ఫైళ్లపై కేంద్ర అధికారులను కలిసి ఫాలోఅప్‌ చేయడానికి ఇక్కడి నుంచి ఎవరూ వెళ్లక్కర్లేదు. అది ఢిల్లీలోని ఏపీ భవన్‌లో రెసిడెంట్‌ కమిషనర్ల బాధ్యత! రెసిడెంట్‌ కమిషనర్‌గా ఉన్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అభయ్‌ త్రిపాఠి ఇటీవలే పదవీ విరమణ చేశారు. ఆయనకు కేంద్ర ప్రభుత్వంలోని సీనియర్‌ అధికారులతో  సత్సంబంధాలున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయిన సమీర్‌ శర్మ కూడా ఇక్కడికి రాకముందు ఢిల్లీలో డైరెక్టర్‌ జనరల్‌ హోదాలో పనిచేశారు. ఆయనకు కూడా కేంద్రంలోని టాప్‌ ర్యాంకు అధికారులు, ప్రజాప్రతినిధులతో పరిచయాలున్నాయి. వారి వల్ల అనేక కీలకమైన ప్రాజెక్టులు, పెండింగ్‌ వర్క్‌లు పూర్తయ్యాయి. మరోవైపు...  ప్రాజెక్టులు, నిధులు, పనులపై సంబంధిత శాఖల ముఖ్యకార్యర్శులు, విభాగాధిపతులు ఢిల్లీకి వెళ్తుంటారు.


ఏపీ రెసిడెంట్‌ కమిషనర్‌తో కలిసి కేంద్ర ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో సమావేశమవుతుంటారు. ఇటీవలి కాలంలో కేంద్రం నుంచి అదనపు నిధులు, అదనపు అప్పులకు అనుమతులు రాబట్టేందుకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌.ఎస్‌ రావత్‌ తరచూ ఢిల్లీ వెళుతున్నారు. ఇలా అధికారిక పర్యటనకు వెళితే మాత్రం ప్రభుత్వం ఖర్చులు భరించవచ్చు. మరి... ప్రవీణ్‌ ప్రకాశ్‌ వారం వారం ప్రభుత్వ ఖర్చుతో ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారో... వెళ్లి రాష్ట్రం కోసం ఏం చేస్తున్నారో! కొసమెరుపు ఏమిటంటే... ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఇంతకు ముందు ఢిల్లీలో ఉన్నా, ఆయన వైఖరితో కేంద్రంలోని కొందరు అధికారులు దగ్గరకు కూడా రాని వచ్చేవారు కాదని చెబుతారు.