వారంలోనే 2 కోట్లు

ABN , First Publish Date - 2022-01-27T08:08:04+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉధృతి మళ్లీ పెరుగుతోంది. కేవలం గత వారం రోజుల వ్యవధిలో ఏకంగా 2.1 కోట్ల మందికి కొవిడ్‌ సోకింది. కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత ఒకే ఒక వారంలో ఇంత భారీగా కేసులు నమోదవడం ఇదే తొలిసారి....

వారంలోనే 2 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ కేసుల ఉధృతి

వారంలో ఇంత భారీగా 

కేసులు నమోదవడం ఇదే తొలిసారి 

ఈ వ్యవధిలో భారత్‌లో 

21లక్షల కేసులు, 3,343 మరణాలు 

కొత్తగా 2.85 లక్షల మందికి కొవిడ్‌ 

మరో 665 మంది మృతి 

కమర్షియల్‌ అనుమతి వచ్చాక 

ఒక్కో డోసు 275 మాత్రమే!

కొవిషీల్డ్‌, కొవ్యాక్సిన్‌  

టీకాలపై అధికారుల అంచనా 

కరోనా వేరియంట్లన్నింటికీ 

ఒమైక్రాన్‌ యాంటీబాడీలతో చెక్‌

పరిశోధనలో గుర్తించిన ఐసీఎంఆర్‌


న్యూఢిల్లీ, జనవరి 26: ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉధృతి మళ్లీ పెరుగుతోంది. కేవలం గత వారం రోజుల వ్యవధిలో ఏకంగా 2.1 కోట్ల మందికి కొవిడ్‌ సోకింది. కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత ఒకే ఒక వారంలో ఇంత భారీగా కేసులు నమోదవడం ఇదే తొలిసారి. ఈవివరాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో ) బుధవారం ప్రకటించింది. గత వారం రోజుల్లో.. పశ్చిమాసియా దేశాల్లో 39 శాతం, ఆగ్నేయాసియా దేశాల్లో 36 శాతం మేర కొవిడ్‌ కేసులు పెరిగాయని పేర్కొంది. జనవరి 17- 23తో ముగిసిన వారంలో భారత్‌లో కేసులు 33 శాతం పెరిగాయని తెలిపింది. ఈ వ్యవధిలో దేశంలో కొత్తగా 21.15 లక్షల మందికి కొవిడ్‌ సోకిందని వివరించింది.


అంటే ప్రతిరోజు సగటున 3 లక్షల మందికి వైరస్‌ ప్రబలిందన్న మాట. ఇక ఇదే సమయంలో భారత్‌తో పోల్చుకుంటే అమెరికాలో రెట్టింపు సంఖ్యలో కొత్త కేసులు నమోదయ్యాయి. అక్కడ అత్యధికంగా 42.15 లక్షల మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. గత వారం రోజుల్లో.. ఫ్రాన్స్‌లో 24.43 లక్షలు, ఇటలీలో 12.31 లక్షలు, బ్రెజిల్‌లో 8.24 లక్షల కేసులు బయటపడ్డాయి. ఇక కొవిడ్‌ మరణాలు కూడా అమెరికాలోనే ఎక్కువగా సంభవించాయి. జనవరి 17- 23 మధ్యకాలంలో అక్కడ 10,795 మంది కరోనాతో చనిపోయారు. భారత్‌లో 3,343, రష్యాలో 4,792, ఇటలీలో 2,440, బ్రిటన్‌లో 1,888 మంది కొవిడ్‌తో మృతిచెందారు. భారత్‌ చేపడుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి తమవంతుగా పూర్తి సహాయ సహకారాలను అందిస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌వో సెక్రెటరీ జనరల్‌ తరఫు అధికార ప్రతినిధి స్టీఫెన్‌ డ్యుజారిక్‌ తెలిపారు. 


ఇందులో భాగంగా ఇప్పటివరకు భారత్‌లోని 60 కోట్ల మందికి చేరడంలో డబ్ల్యూహెచ్‌వో అనుబంధ సంస్థలు సఫలమయ్యాయని వెల్లడించారు. 13 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలకు కొవిడ్‌ చికిత్సా పద్ధతులపై శిక్షణ అందించామన్నారు. 


ఢిల్లీలో 2 వారాల్లోనే యాక్టివ్‌ కేసులు సగానికి.. 

కరోనా రెండోవేవ్‌ సమయంలో దేశ రాజధాని ఢిల్లీ చిగురుటాకులా వణికిపోయింది. 2021 ఏప్రిల్‌ 28న యాక్టివ్‌ కొవిడ్‌ కేసులు దాదాపు లక్ష (99,752)కు చేరాయి. అవి ఆ స్థాయి నుంచి తగ్గడానికి మూడు వారాలకుపైగా సమయం పట్టింది. మళ్లీ 2021 మే 19 నాటికి యాక్టివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గి 45,047కు చేరింది. దానితో పోల్చుకుంటే మూడోవేవ్‌లో కాస్త ఆశాజనక పరిస్థితులే ఉన్నాయని చెప్పొచ్చు. ఈసారి జనవరి 13 నాటికి ఢిల్లీలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 94,160కి చేరింది. అయితే సగానికి సగం తగ్గడానికి మాత్రం 12 రోజుల సమయమే పట్టింది. మంగళవారం నాటికి హస్తినలో మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య భారీగా తగ్గి 42వేలకు చేరింది. రెండోవేవ్‌ సమయంలో ఆస్పత్రుల్లో కొవిడ్‌ రోగుల చేరికలు ఎంత భారీగా జరిగాయో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. ఈసారి ఆస్పత్రుల్లో చేరిక రేటు సగటున 2 శాతంలోపే ఉంది. మూడోవేవ్‌ నేపథ్యంలో గత పది రోజులుగా.. కొవిడ్‌తో ఎక్కువ సంఖ్యలో ఆస్పత్రుల్లో చేరికలు జరుగుతున్న రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర (10-15 శాతం),  తమిళనాడు (6 శాతం), ఢిల్లీ (3 శాతం),  కేరళ (4 శాతం) ఉన్నాయి. మిగతా రాష్ట్రాల్లో ఇది 2 శాతంలోపే ఉంది. కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ట్రాలు ఈవివరాలను వెల్లడించాయి. కాగా, దేశంలో వరుసగా ఐదురోజుల పాటు తగ్గిన కొవిడ్‌ కేసులు.. ఆరో రోజున (బుధవారం) పెరిగాయి. కొత్తగా 2.85 లక్షల మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. మరో 665 మంది కొవిడ్‌తో మృతిచెందారు. క్రితం రోజుతో పోలిస్తే 13,824 యాక్టివ్‌ కేసులు తగ్గాయి. రోజువారీ కొవిడ్‌ పాజిటివిటీ రేటు 16.16 శాతంగా నమోదైంది. కేరళలో మరో 49,771 కొత్త కేసులు బయటపడ్డాయి. 


వేరియంట్లన్నింటికీ ఒమైక్రాన్‌ 

యాంటీబాడీలతో చెక్‌: ఐసీఎంఆర్‌

ఒమైక్రాన్‌ సోకిన వారిలో ఉత్పత్తయ్యే ప్రతిరక్షకాలు (యాంటీబాడీలు) ‘డెల్టా’ సహా ఆందోళనకర కరోనా వేరియంట్లన్నింటిపైనా సమర్థంగా పని చేస్తాయని భారత వైద్య పరిశోధనా మండ లి (ఐసీఎంఆర్‌) పేర్కొంది. ఆ యాంటీబాడీలకు బాధితుడి రోగనిరోధక శక్తి సమర్థంగా ప్రతిస్పందిస్తున్నట్లు కరోనా బాధితులపై చేసిన ప్రయోగాల్లో గుర్తించామని వెల్లడించింది. కాగా, భారత్‌లో ఒమైక్రాన్‌ సుదీర్ఘ కాలంపాటు కొనసాగే అవకాశం ఉందని హార్వర్డ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్త శివ్‌ పిళ్లై అన్నారు. కొవిడ్‌ మహమ్మారిని ఎన్నటికీ పూర్తిగా నిర్మూలించలేమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక.. ఒమైక్రాన్‌ వేరియంట్‌ మనిషి చర్మంపై 21 గంటల కంటే అధిక సమయం జీవించి ఉండగలదని జపాన్‌లోని క్యోటో ప్రీఫెక్చురల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ మెడిసిన్‌ శాస్త్రవేత్తలు గుర్తించారు.


ఒక్కో డోసు 275 మాత్రమే!

భారత్‌లో బహిరంగ విపణిలోకి కొవిషీల్డ్‌, కొవ్యాక్సిన్‌ టీకాలు వచ్చిన తర్వాత వాటి ఒక్కో డోసు ధర  రూ.275 చొప్పున ఉండే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి. అలాగే, అదనంగా రూ.150 చొప్పున సర్వీస్‌ చార్జ్‌ కూడా పడొచ్చని పేర్కొన్నాయి. సామాన్యుడూ కొనుగోలు చేసే విధంగా ధరలు ఉండాలని వ్యాక్సిన్‌ ఉత్పత్తి సంస్థలకు జాతీయ ఔషధ ధరల ప్రాధికార సంస్థ (ఎన్‌పీపీఏ) సూచనలు చేసిందన్నారు. ప్రస్తుతం ప్రైవేటు వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో కొవ్యాక్సిన్‌ డోసు ధర రూ.1,200, కొవిషీల్డ్‌ డోసు ధర రూ.780గా ఉంది. అత్యవసర వినియోగం కింద వాటిని వేయడానికి అనుమతులు ఉన్నాయి. 

Updated Date - 2022-01-27T08:08:04+05:30 IST