పోరాడితే వచ్చేదేమిటి?

ABN , First Publish Date - 2020-03-08T06:27:28+05:30 IST

‘‘స్థానిక సంస్థలకు జరగనున్న ఎన్నికలలో డబ్బు, మద్యం పంపిణీ జరగకూడదు. ఎవరైనా డబ్బు పంపిణీ చేసినట్టు రుజువైతే వారిపై అనర్హత వేటు వేయడంతోపాటు మూడేళ్ల జైలుశిక్ష విధించేలా చట్టం చేశాం’’... ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి చేసిన ప్రకటన ఇది!...

పోరాడితే వచ్చేదేమిటి?

జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ ప్రకారం ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా పోటీ చేసిన వారు ఎవరైనా డబ్బు, మద్యం పంపిణీ చేసినట్టు నిర్ధారణ అయితే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి జైలుకు పంపవచ్చు. కిటుకు అంతా ఇక్కడే ఉంది. ఎన్నికల కమిషన్‌కు ఉండే అధికారాలను రాష్ట్రప్రభుత్వం సంక్రమింపజేసుకుంది. దీని ప్రకారం ప్రత్యర్థి పార్టీలకు చెందినవారు ఎవరైనా గెలిస్తే... వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయరన్న గ్యారంటీ ఏమీలేదు. ఎందుకంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. అధికార వైసీపీ జెండా రంగులున్న దుస్తులు ధరించడం మినహా పార్టీ కార్యకర్తలను మించిపోయి వ్యవహరిస్తున్నారు.


జగన్మోహన్‌ రెడ్డి ఆంతర్యం ఏమిటో, పోలీసులు ఏమి చేయబోతున్నారో స్పష్టంగా కనిపిస్తున్న తర్వాత కూడా స్థానిక ఎన్నికలలో పోటీ చేయాలనుకోవడం దుస్సాహసమే అవుతుంది. పోటీచేసిన స్థానాల్లో కనీస స్థాయిలో కూడా ఓట్లు సాధించలేని పక్షంలో బీజేపీ– జనసేన కలయిక ఒక విఫల ప్రయోగంగా ఉండిపోతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డితో బీజేపీ చేతులు కలపడం జనసేనాని పవన్‌ కల్యాణ్‌కు ఇష్టం లేదు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుతో బీజేపీ జట్టుకట్టడం జగన్మోహన్‌ రెడ్డికి ఇష్టం లేదు. బీజేపీ పెద్దలకేమో రాజ్యసభలో వైసీపీ మద్దతు అవసరం. జగన్మోహన్‌ రెడ్డికేమో తనపై ఉన్న కేసుల విషయంలో కేంద్ర ప్రభుత్వం చల్లనిచూపు అవసరం. ఫలితంగా తెలుగుదేశం ఒంటరి పోరాటం చేయాల్సిన పరిస్థితి.


‘‘స్థానిక సంస్థలకు జరగనున్న ఎన్నికలలో డబ్బు, మద్యం పంపిణీ జరగకూడదు. ఎవరైనా డబ్బు పంపిణీ చేసినట్టు రుజువైతే వారిపై అనర్హత వేటు వేయడంతోపాటు మూడేళ్ల జైలుశిక్ష విధించేలా చట్టం చేశాం’’... ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి చేసిన ప్రకటన ఇది! ‘‘ఏ పార్టీ వారు అయినా డబ్బు పంపిణీ చేస్తే కఠిన చర్యలు తీసుకోండి’’... జిల్లా ఎస్పీలకు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ జారీచేసిన ఆదేశం ఇది! ముఖ్యమంత్రి ప్రకటన తర్వాత సోషల్‌ మీడియాలో ఒక కామెంట్‌ ప్రచారంలోకి వచ్చింది. అదేమిటంటే... పత్తిత్తు పరమాన్నం వండితే శుక్రవారం వరకు చల్లబడలేదట! నిజానికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి నిర్ణయాన్ని అభినందించాలి. ఎన్నికలలో డబ్బు, మద్యం పంపిణీ పెద్ద బెడదగా మారినందున ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతించాల్సిందే! అయితే, ఆంధ్రప్రదేశ్‌లో గత తొమ్మిది నెలలుగా చోటుచేసుకుంటున్న సంఘటనలు, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చూసిన తర్వాత ముఖ్యమంత్రి ఉద్దేశాన్ని శంకించాల్సి వస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నట్టుగా ప్రత్యర్థి పార్టీల తరఫున ఎవరైనా పొరపాటున గెలిస్తే డబ్బు, మద్యం పంపిణీ చేశారని కేసులు పెట్టి... వారిపై అనర్హత వేటు వేసే ప్రమాదముంది. అధికార పార్టీ తనకు అనుకూలంగా ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయదని చెప్పడానికి లేదు. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత ఎన్నికల నియమావళిని అమలు చేసే బాధ్యత, అధికారం ఎన్నికల కమిషన్‌కే ఉంటుంది. జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ ప్రకారం ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా పోటీ చేసిన వారు ఎవరైనా డబ్బు, మద్యం పంపిణీ చేసినట్టు నిర్ధారణ అయితే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి జైలుకు పంపవచ్చు. కిటుకు అంతా ఇక్కడే ఉంది. ఎన్నికల కమిషన్‌కు ఉండే అధికారాలను రాష్ట్రప్రభుత్వం సంక్రమింపజేసుకుంది. దీని ప్రకారం ప్రత్యర్థి పార్టీలకు చెందినవారు ఎవరైనా గెలిస్తే... వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయరన్న గ్యారంటీ ఏమీలేదు. ఎందుకంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. అధికార వైసీపీ జెండా రంగులున్న దుస్తులు ధరించడం మినహా పార్టీ కార్యకర్తలను మించిపోయి వ్యవహరిస్తున్నారు. ప్రత్యర్థులు ఇచ్చే ఫిర్యాదులు బుట్టదాఖలు అవుతున్నాయి. అదే అధికార పార్టీ వారికి నష్టం జరిగే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే వారిపై ఎస్సీ–ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పోలీసులు ఏ రీతిన రెచ్చిపోతారో చూడాలి. ప్రత్యర్థి పార్టీలకు చెందినవారు ఎవరైనా, ఎక్కడైనా గెలిస్తే వారిపై తాజా చట్టాన్ని ప్రయోగించడం తథ్యంగా కనిపిస్తున్నది. ప్రత్యర్థులు డబ్బు, మద్యం పంపిణీ చేసినట్టు అధికార పార్టీ కార్యకర్తలు, అభిమానులతో ఫిర్యాదులు చేయించి ఆయా నేతలపై కేసులు పెట్టవచ్చు. ఇప్పుడు చీమ చిటుక్కుమన్నా పోలీసులు రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెడుతుండటాన్ని చూస్తున్నాంగా! ఎన్నికలలో ప్రత్యర్థులు డబ్బు, మద్యం పంపిణీ చేసినట్టు సాక్ష్యాలు సృష్టించడం పోలీసులకు పెద్ద కష్టం ఏమీకాదు.


అక్కడా... ఇక్కడా...

ఏపీలో అన్ని జిల్లా పరిషత్తులు, మునిసిపాలిటీలను కైవసం చేసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తన మంత్రులను ఆదేశించారు. తెలంగాణలో కూడా జిల్లా పరిషత్తులు, మునిసిపాలిటీలను అధికార తెలంగాణ రాష్ట్రసమితి తన ఖాతాలో వేసుకుంది. ఒకటీ అర మునిసిపాలిటీలు చేజారినా... అధికార పార్టీ సహించలేకపోయింది. తెలంగాణ సీఎం కేసీఆర్‌ అడుగుజాడల్లో నడుస్తూ, ఆయనకంటే రెండు ఆకులు ఎక్కువ చదివిన ఏపీ సీఎం ఇప్పుడు ప్రత్యర్థులపై ప్రయోగించడానికి ఏకంగా చట్టాన్నే తెచ్చారు. ముఖ్యమంత్రి లక్ష్యం ఏమిటో, మనసులో ఏమి కోరుకుంటున్నారో తెలిసిన తర్వాత రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అందుకు అనుకూలంగా పోలీస్‌ యంత్రాంగాన్ని ప్రయోగించకుండా ఉండరు. ఈ నేపథ్యంలో డబ్బు, మద్యం పంపిణీ చేసిన వాళ్లు ఏ పార్టీ వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన జిల్లా ఎస్పీలను ఆదేశించడం హాస్యాస్పదంగా ఉంది. అధికార పార్టీకి అనుకూలంగా పోలీసులు వ్యవహరించడం ఎప్పటినుంచో జరుగుతోంది. అయితే, ఇప్పటిలా రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులపై వెంటపడి మరీ కేసులు పెట్టడం గతంలో ఎప్పుడూ చూడలేదు. ఒకటీ అర సందర్భాలలో ఒకస్థాయి నాయకులపై కేసులు పెడుతుంటారు. ఇప్పుడు మొత్తం రాష్ట్రాన్నే భయానక వాతావరణంలోకి నెట్టేశారు. విశాఖలో పర్యటించడానికై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అనుమతించి కూడా వైసీపీ కార్యకర్తలకు ఇష్టంలేదన్న కారణంగా వెనక్కు పంపించేసిన ఘనత ఏపీ పోలీసులకే దక్కింది. ఈ ఉదంతంలో తమముందు హాజరుకావాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది. డీజీపీని కోర్టుకు పిలిపించడం ఇది రెండవ పర్యాయం. పోలీసు శాఖకు ఇంతకంటే తలవంపులు ఏముంటాయి? తెలంగాణలో కూడా పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారు. ఏపీ పోలీసులు మాత్రం సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నారు! అందుకే చట్టాల గురించి ఏపీలో అధికారంలో ఉన్నవాళ్లు మాట్లాడితే పత్తిత్తు పరమాన్నం... అన్న సామెతను చెప్పుకుంటున్నారు!


విపక్షాలకు దారేది?

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షాలు స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయడం అవసరమా? అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. స్థానిక ఎన్నికలలో కలిసి పోటీ చేయబోతున్నట్టు జనసేన, బీజేపీ ఇది వరకే ప్రకటించాయి. తెలుగుదేశం పార్టీ కూడా ఎన్నికలలో పోటీకి రంగం సిద్ధం చేసుకుంటోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఆంతర్యం ఏమిటో, పోలీసులు ఏమి చేయబోతున్నారో స్పష్టంగా కనిపిస్తున్న తర్వాత కూడా స్థానిక ఎన్నికలలో పోటీ చేయాలనుకోవడం దుస్సాహసమే అవుతుంది. స్థానిక ఎన్నికలతోపాటు ఉప ఎన్నికలకు కూడా దూరంగా ఉండటం ఈ దేశంలో ప్రతిపక్షాలకు కొత్త ఏమీకాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ కూడా ఒక సందర్భంగా స్థానిక ఎన్నికలకు దూరంగా ఉండిపోయింది. తమిళనాడులో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దివంగత జయలలిత కూడా స్థానికంతోపాటు ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు. అయినా ఆ తర్వాత జరిగిన సాధారణ ఎన్నికలలో ఆమె అధికారం చేజిక్కించుకున్నారు. జనసేన, బీజేపీ కలిసి పోటీచేసినా ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు. బీజేపీ బలం అంతంత మాత్రం కాగా, జనసేనకు అంతోఇంతో ఓటింగ్‌ ఉన్నప్పటికీ గ్రామస్థాయిలో పార్టీ యంత్రాంగం నిర్మితం కాలేదు కనుక అధికార పార్టీని ఢీకొట్టలేని పరిస్థితి ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్నందున స్థానికంగా అంత బలం లేకపోయినా బీజేపీ నాయకుల వాయిస్‌ పెద్దగా వినిపిస్తోంది.


ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కూడా కేంద్రప్రభుత్వం అంటే భయపడుతుంటారు కనుక బీజేపీ అండకోసం ఇతర పార్టీలు వెంపర్లాడుతున్నాయి. నిజానికి బీజేపీతో జట్టుకట్టాలని ఒకదశలో వైసీపీ అభిప్రాయపడిందని చెబుతున్నారు. అదే జరిగితే రాష్ట్రంలో జగన్మోహన్‌ రెడ్డికి ఎదురుండేది కాదు. బహుశా ఈ పరిస్థితిని పసిగట్టే జనసేన హడావుడిగా బీజేపీతో జతకట్టి ఉండవచ్చు. తెలుగుదేశం పార్టీ కూడా కలిస్తే రాష్ట్రంలో వైసీపీకి కొంతవరకు చెక్‌ పెట్టవచ్చును గానీ, చంద్రబాబుతో చేతులు కలపడం బీజేపీ పెద్దలకు సుతరాము ఇష్టంలేదు కనుక ఇప్పట్లో అది జరగదు. రాజ్యసభలో బిల్లులకు ఆమోదం పొందాలంటే వైసీపీ మద్దతు అవసరం కనుక బీజేపీ పెద్దలు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తున్నట్టు చెబుతున్నారు. అదే సమయంలో జనసేనను కాదనుకోలేరు కనుక వైసీపీతో నేరుగా పొత్తు పెట్టుకోలేకపోతున్నారన్నది ఒక అభిప్రాయంగా ఉంది. ఈ పరిస్థితులలో స్థానిక ఎన్నికలు వచ్చినందున జనసేన–బీజేపీ చెలిమి ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి. పోటీచేసిన స్థానాల్లో కనీస స్థాయిలో కూడా ఓట్లు సాధించలేని పక్షంలో ఈ రెండు పార్టీల కలయిక ఒక విఫల ప్రయోగంగా ఉండిపోతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డితో బీజేపీ చేతులు కలపడం జనసేనాని పవన్‌ కల్యాణ్‌కు ఇష్టం లేదు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుతో బీజేపీ జట్టుకట్టడం జగన్మోహన్‌ రెడ్డికి ఇష్టం లేదు. బీజేపీ పెద్దలకేమో రాజ్యసభలో వైసీపీ మద్దతు అవసరం. జగన్మోహన్‌ రెడ్డికేమో తనపై ఉన్న కేసుల విషయంలో కేంద్ర ప్రభుత్వం చల్లనిచూపు అవసరం. ఫలితంగా తెలుగుదేశం ఒంటరి పోరాటం చేయాల్సిన పరిస్థితి. టూకీగా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ ముఖచిత్రం ఇదీ! ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఒంటరిగా స్థానిక ఎన్నికలలో పోటీచేయడం వల్ల ఫలితం ఉంటుందా? అన్న చర్చ ఇప్పుడు ఆ పార్టీలో జోరుగా సాగుతోంది. పది మాసాల క్రితం జరిగిన సాధారణ ఎన్నికలలో ఓటమిపాలైన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఆర్థికంగా కూడా కుదేలయ్యారు. మెజారిటీ అభ్యర్థులు ఇప్పటికీ అప్పుల భారాన్ని మోస్తున్నారు. వారిని ఆర్థికంగా ఆదుకునే పరిస్థితిలో పార్టీ అధిష్ఠానం కూడా లేదు. ఇక కార్యకర్తలు, అభిమానుల పరిస్థితి గ్రామాల్లో దారుణంగా ఉంది. కొంతమంది ఆర్థికంగా చితికిపోగా, మరికొంతమంది ప్రభుత్వం నుంచి రావలసిన బిల్లులు రాక విలవిల్లాడిపోతున్నారు. వీటన్నింటిని అధిగమించి ఎవరైనా తల ఎగరేస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఈ ప్రతికూలతలన్నింటినీ అధిగమించి సర్పంచులుగా, ఎంపీటీసీ, జడ్పీటీసీలుగా, మునిసిపల్‌ కౌన్సిలర్లుగా పోటీ చేయడానికి ఎంతమంది ముందుకు వస్తారో తెలియదు. ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. పరిస్థితి అనుకూలంగా లేదనుకున్నప్పుడు, శత్రువు ఊపుమీద ఉన్నప్పుడు ఒక అడుగు వెనక్కి తగ్గడం యుద్ధతంత్రంలో ఒక భాగం. ఇలా చేయడాన్ని పలాయన వాదంగా భావించడానికి లేదు. అయితే, ఎన్నికలలో పోటీచేయకుండా తప్పుకుంటే పార్టీ శ్రేణులు మరింత డీలాపడే ప్రమాదముందని తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం అభిప్రాయపడుతున్నట్టు చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన పార్టీలే తదనంతరం జరిగే స్థానిక ఎన్నికలలో గెలవడం సహజం.


తెలంగాణలో కూడా ఇదే జరిగింది. నిజానికి స్థానిక ఎన్నికలలో తెలంగాణలో అధికార పార్టీకి ఓటింగ్‌ శాతం పడిపోయింది. అయితే, ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ మధ్య ఓట్లు చీలిపోవడంతో అధికార పార్టీ భారీగా లబ్ధిపొందింది. ఎన్నికల ముందువరకు తెలంగాణలో ‘‘మేమే అధికార పార్టీకి ప్రత్యర్థులం’’ అని పోటీలుపడిన కాంగ్రెస్‌–బీజేపీ కూడా ఎన్నికల తర్వాత డీలాపడ్డాయి. లోక్‌సభ ఎన్నికల తర్వాత తమ బలం అతిగా ఊహించుకున్న బీజేపీ స్థానిక ఎన్నికల తర్వాత నీరుగారిపోయింది. తెలంగాణలో ఇక అధికారంలోకి రావడమే ఆలస్యమని నమ్మడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా కూడా అటువంటి అభిప్రాయాన్ని కలిగించిన బీజేపీ రాష్ట్ర నాయకులు ఇప్పుడు వాస్తవంలోకి వచ్చారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి చుక్కాని లేని నావలా తయారైంది. కాంగ్రెస్‌ నాయకులు ఇప్పటికీ పీతలగుంపులా ఒకరినొకరు కిందకు లాగడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. పీసీసీ అధ్యక్ష పదవి కోసం లెక్కలేనంతమంది పోటీపడుతున్నారు. ఫలితంగా కాంగ్రెస్‌ పట్ల ప్రజలలో నమ్మకం మరింత సడలింది. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మళ్లీ మరింతగా బలపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా పరిస్థితులు ఇంచుమించుగా ఇలాగే ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు తెలుగుదేశం, జనసేన–బీజేపీ కూటమి మధ్య చీలిపోతుంది కనుక అధికార పార్టీనే లబ్ధిపొందుతుంది. నిజానికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి వ్యవహారశైలి, తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజలలో కొంత వ్యతిరేకత ఏర్పడింది. అయితే అది ఏ స్థాయిలో అన్నదే ప్రశ్న. ప్రభుత్వం తీరువల్ల జరగబోయే అనర్థాలను కిందిస్థాయి జనం గ్రహించే పరిస్థితి లేదు. సంక్షేమం పేరిట తమకు డబ్బులు పంచుతున్నారు కనుక వారిలో అసంతృప్తి ఉండటానికి అవకాశం లేదు. మధ్యతరగతి ప్రజలు మాత్రం ప్రభుత్వ పనితీరు పట్ల పెదవి విరుస్తున్నారు. ఈ కారణంగా స్థానిక ఎన్నికలలో వారు ఓటింగులో పాల్గొంటారా? అన్నది సందేహమే. సంక్షేమ పథకాల వల్ల లబ్ధిపొందినవాళ్లు మాత్రం కచ్చితంగా ఓటు వేస్తారు. అధికార వైసీపీ నాయకులు అదే కోరుకుంటున్నారు. మరోవైపు రాజధాని అమరావతి తరలింపునకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమం చేపట్టి మూడు నెలలు కావస్తోంది. అమరావతిని చంపేయడం వల్ల భవిష్యత్తులో జరిగే నష్టాన్ని ఇప్పటికీ ఇతర ప్రాంతాల ప్రజలు గ్రహించలేకపోతున్నారు. ప్రస్తుతానికి రైతుల ఉద్యమ ప్రభావం కృష్ణా – గుంటూరు జిల్లాల్లో అంతోఇంతో కనిపిస్తోంది. స్థానిక ఎన్నికల ఫలితాలు ఈ రెండు జిల్లాల్లో కూడా అధికార పార్టీకి అనుకూలంగా వస్తే దాని ప్రభావం రైతులు చేస్తున్న పోరాటంపై కచ్చితంగా పడుతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఇదే కోరుకుంటున్నారు. ప్రతిపక్షాలు పోటీచేసిన తర్వాత కూడా కృష్ణా – గుంటూరు జిల్లాలలో అధికార పార్టీ గెలిస్తే రాజధాని తరలింపు విషయంలో ముఖ్యమంత్రికి అడ్డు ఉండదు. మూడు రాజధానుల నిర్ణయానికి స్థానిక ప్రజల మద్దతు కూడా ఉందని అధికార పార్టీ వాళ్లు ప్రచారం చేసుకుంటారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు... ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆచితూచి వ్యవహరించడం మంచిది. కృష్ణా– గుంటూరు జిల్లాల్లోగానీ, మరెక్కడైనాగానీ ప్రతిపక్షాలు గెలిస్తే వారిపై కొత్తగా తీసుకొచ్చిన చట్టాన్ని ప్రయోగించరన్న గ్యారంటీ లేదు.


వ్యవస్థల అవస్థలు

ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి ఏ వ్యవస్థ అన్నా లెక్కలేనితనం కనిపిస్తోంది. విజయనగరం రాజవంశానికి చెందిన పీవీజీ రాజు ఏర్పాటు చేసిన మాన్సాస్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ పదవి నుంచి అశోక్‌ గజపతిరాజుని తొలగించి.. ఆనంద గజపతిరాజు కుమార్తె సంచయితను నియమిస్తూ అర్ధరాత్రి జీవో జారీచేయడంలోనే జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వ బరితెగింపు స్పష్టమవుతోంది. విజయనగరం రాజవంశీయులను ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతగానో గౌరవిస్తారు. అశోక్‌ గజపతిరాజు సోదరుడు దివంగత ఆనంద గజపతిరాజు ఎన్టీఆర్‌ తొలి కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా ఉండేవారు. అప్పట్లో ఆనంద గజపతి ఎప్పుడైనా తనను కలవడానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్‌ లేచి నిలబడి మరీ ‘రండి గజపతులవారూ’ అని ఆహ్వానించేవారు. అంతటి గౌరవాన్ని అందుకున్న ఆనంద గజపతిరాజు సోదరుడు అశోక్‌ గజపతిరాజు... సోదరుడి మరణం తర్వాత మాన్సాస్‌ ట్రస్ట్‌ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అనారోగ్యంతో ఢిల్లీలో అశోక్‌ గజపతిరాజు చికిత్స పొందారు. ఆసుపత్రిలో ఉన్న ఆయనను అర్ధరాత్రి చైర్మన్‌ పదవి నుంచి తొలగించి ఆ స్థానంలో విజయనగరంతోనే కాకుండా స్థానిక ప్రజలకు కూడా పరిచయం లేని సంచయితను నియమించడం జగన్మోహన్‌ రెడ్డికే చెల్లుతుంది. అన్యమతస్తురాలైన సంచయితను హిందూ దేవాలయాల ఆలనాపాలనా చూసే మాన్సాస్‌ ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌గా ఎలా నియమిస్తారని అశోక్‌ గజపతిరాజు ప్రశ్నిస్తున్నారు. 


ముఖేశ్‌ అంబానీ కూడా....

ఈ విషయం అలా ఉంచితే, ఢిల్లీలో తమ సంస్థ తరఫున ప్రభుత్వంలో వ్యవహారాలు పర్యవేక్షించే పరిమళ్‌ నత్వానీ అనే ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వవలసిందిగా కోరడానికై రిలయన్స్‌ అధిపతి ముఖేశ్‌ అంబానీ స్వయంగా వచ్చి జగన్మోహన్‌ రెడ్డిని కలవడం రాష్ట్రంలో చర్చనీయాంశం అయింది. తమ తరఫున ఒకరికి రాజ్యసభ సీటు కావాలని ముఖేశ్‌ అంబానీ ఒక రాజకీయ పార్టీని కోరడం ఇదే మొదటిసారి. అదికూడా ఒకప్పుడు రాజశేఖర్‌ రెడ్డి మరణానికి తానే కారణమని నిందించిన జగన్మోహన్‌ రెడ్డిని స్వయంగా వచ్చి ముఖేశ్‌ అంబానీ కలవడం వింతగా భావిస్తున్నారు. ఈ పరిణామం వల్ల ముఖేశ్‌ అంబానీ స్థాయి తగ్గి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి స్థాయి పెరిగింది. నిజానికి ముఖేశ్‌ను కలవడానికి తానే ముంబై వస్తానని జగన్మోహన్‌ రెడ్డి చాలాకాలంగా కోరుతున్నారట. అప్పుడు ముఖ్యమంత్రిని కలవడానికి పెద్దగా ఆసక్తి చూపని ముఖేశ్‌.. ఇప్పుడు తానే స్వయంగా రావడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖేశ్‌–జగన్‌ మధ్య సమావేశాన్ని ఎంపీ విజయసాయి రెడ్డి ఏర్పాటు చేశారని చెబుతున్నారు. రాజ్యసభ పదవీకాలం ముగియనున్న నత్వానీ మళ్లీ ఆ పదవిని కోరుకుంటున్న విషయం తెలుసుకున్న విజయసాయి రెడ్డి అటునుంచి నరుక్కువచ్చారు. నత్వానీని ప్రయోగించి ముఖేశ్‌ అంబానీ స్వయంగా వచ్చి జగన్మోహన్‌ రెడ్డిని కలిసేలా ఏర్పాటుచేశారు. అంబానీ అంతటివాడు స్వయంగా వచ్చి రాజ్యసభ సీటు అడిగితే కాదనడానికి జగన్మోహన్‌ రెడ్డి అమాయకుడు కాదు కదా? అందుకే అడిగిన వెంటనే ఓకే చేశారు. ఎంతైనా విజయసాయి రెడ్డి ముఖ్యమంత్రి జగన్‌కు పెద్ద అసెట్‌ అనే చెప్పాలి. తమపై ఉన్న కేసులతోపాటు ఢిల్లీలో ఇతర వ్యవహారాలన్నీ విజయసాయి రెడ్డే పర్యవేక్షిస్తున్నారు. బీజేపీ పెద్దలకు, ముఖ్యమంత్రి జగన్‌కు మధ్య అనుసంధానకర్తగా కూడా ఆయనే వ్యవహరిస్తున్నారు. విజయసాయి రెడ్డి పన్నిన వ్యూహం కారణంగా ప్రపంచ కుబేరులలో ఒకరైన ముఖేశ్‌ అంబానీ తాడేపల్లి వచ్చి మరీ జగన్‌ను కలిసి ఆయన ఆతిథ్యం స్వీకరించారు. ముఖేశ్‌ వంటివారు కూడా బలహీనతలకు అతీతం కాదన్న మాట!


ఆర్కే


యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Updated Date - 2020-03-08T06:27:28+05:30 IST