పకడ్బందీగా Weekend కర్ఫ్యూ

ABN , First Publish Date - 2022-01-09T17:39:45+05:30 IST

కొవిడ్‌ మూడో విడత విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం విధించిన తొలి వీకెండ్‌ కర్ఫ్యూ రాష్ట్రమంతటా బోసిపోయేలా చేసింది. శుక్రవారం రాత్రి నుంచే వీకెండ్‌ కర్ఫ్యూ అమలులోకి రాగా ఆ వెంటనే పోలీసులు

పకడ్బందీగా Weekend కర్ఫ్యూ

- స్తంభించిన కార్యకలాపాలు 

- రోడ్లపై పోలీసుల తనిఖీలు

- ఉల్లంఘనదారులపై చర్యలు


బెంగళూరు: కొవిడ్‌ మూడో విడత విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం విధించిన తొలి వీకెండ్‌ కర్ఫ్యూ రాష్ట్రమంతటా బోసిపోయేలా చేసింది. శుక్రవారం రాత్రి నుంచే వీకెండ్‌ కర్ఫ్యూ అమలులోకి రాగా ఆ వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లాల సరిహద్దులతోపాటు ప్రధాన రహదారులన్నిచోటా వాహనాలను కట్టడి చేశారు. శనివారం తెల్లవారుజామునుంచే వేలాదిమంది పోలీసులు విధులలోకి రావడంతో సర్వత్రా స్తబ్దుగా మారింది. అత్యవసరమైన వారు మినహా మిగిలినవారు రోడ్కెక్కేందుకు భయపడే పరిస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని ఫ్లై ఓవర్‌లను కట్టడి చేశారు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీ కొనసాగించారు. ఉదయం కాస్త నిత్యావసరాల కొనుగోళ్లకు ఆసక్తి చూపినా 10 గంటల తర్వాత వాహనాలో సంచరించేవారు మాత్రమే కనిపించారు. నిత్యావసరాలైనా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పాలు ఇతరత్రా కొనుగోళ్లకు అభ్యంతరం లేకపోవడంతో ప్రజలు కొనుగోళ్లు చేశారు. ఆ తర్వాత జనసందడి తగ్గిపోయింది. ఉత్తరకర్ణాటక జిల్లాల్లో బాగల్కోటె, కలబుర్గి, శివమొగ్గ ప్రాంతాలలో కొంత ప్రభావం తక్కువ అనిపించినా మిగిలిన జిల్లాల్లో పూర్తిగా స్తంభించినట్టయ్యింది. రాష్ట్రమంతటా జనజీవనం స్తంభించింది. 10శాతం బస్సులు అత్యవసరం కోసం నడిపినా ఒక చోటునుంచి మరోచోటుకు వెళ్లినా పోలీసులు అడ్డుకుంటారని ప్రతి చోటా కొవిడ్‌ టెస్టులు చేస్తారని ప్రజలు ముందుకు రాలేదు. దీంతో బస్సుల సంచారం ఉన్నా ప్రయాణీకులు అంతంతమాత్రమే అనిపించారు. ద్విచక్రవాహనాలు, కార్లలో తిరిగేవారికి తప్పనిసరిగా గుర్తింపుకార్డుల పరిశీలన ప్రతిచోటా కొనసాగింది. మంగళూరు, మైసూరు, ఉడుపి జిల్లాల్లో బెంగళూరు తర్వాత కొవిడ్‌ కేసులు అత్యధికంగా ఉండడంతో అక్కడి జిల్లా యంత్రాంగాలు పటిష్టమైన చర్యలు కొనసాగించారు. ఇక బెంగళూరులో షాపింగ్‌మాల్స్‌, సినిమాహాళ్లు మూతపడ్డంతో జనం లేక ప్రతిచోటా వెలవెలబోయినట్టు అనిపించింది. అనవసరంగా రోడ్డెక్కేవారికి పోలీసులు పలుచోట్ల అడ్డగించి హెచ్చరికలు జారీ చేశారు. బెంగళూరులో 400కు పైగా వాహనాలు సీజ్‌ చేసినట్టు సమాచారం. 

Updated Date - 2022-01-09T17:39:45+05:30 IST