వారాంతపు సంత.. చక్కర్లతో చింత

ABN , First Publish Date - 2021-04-17T05:29:47+05:30 IST

శాశ్వత స్థలాన్ని కేటాయించకపోవడంతో నర్సాపూర్‌లో ప్రతీ శుక్రవారం నిర్వహించే సంత ఎప్పుడు ఎక్కడ ఉంటుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. శాశ్వత మార్కెట్‌ ఏర్పాటు చేయడానికి స్థలం లేకపోవడంతో వ్యాపారులతో పాటు ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వారాంతపు సంత.. చక్కర్లతో చింత

 స్థల కేటాయింపు లేక ఒక్కోసారి ఒక్కోచోట నిర్వహణ

 మళ్లీ జూనియర్‌ కాలేజీ మైదానంలోకి నర్సాపూర్‌ అంగడి 


నర్సాపూర్‌, ఏప్రిల్‌ 16: శాశ్వత స్థలాన్ని కేటాయించకపోవడంతో నర్సాపూర్‌లో ప్రతీ శుక్రవారం నిర్వహించే సంత ఎప్పుడు ఎక్కడ ఉంటుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. శాశ్వత మార్కెట్‌ ఏర్పాటు చేయడానికి స్థలం లేకపోవడంతో వ్యాపారులతో పాటు ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తైబజార్‌ మాత్రం ముక్కు పిండి వసులు చేసే వారు తమకు మాత్రం కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడం వ్యాపారులు  తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ శుక్రవారం నర్సాపూర్‌లో నిర్వహించే సంతకు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున కూరగాయలతో పాటు ఇతర సరుకులు విక్రయించడానికి, కొనుగోలు చేయడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తారు. అయితే ఎన్నోసంవత్సరాలుగా మార్కెట్‌ కోసం స్థలం కేటాయించాలని కోరుతున్నా ఇప్పటికీ స్థలం చూపకపోవడంతో పట్టణంలోని ప్రధాన వీధులనీ సంతరోజు మార్కెట్‌ ప్రాంతాలుగా మారుతున్నాయి. దీంతో ఆ ప్రాంతంలోని నివాసితులు ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్‌కు వచ్చే వారితో పాటు రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసే మార్కెట్‌తో కనీసం నడువలేని పరిస్థితి ఉంటుంది. అయితే అధునాతన మార్కెట్‌ను ఏర్పాటు చేస్తామని, అందుకు రూ.4 కోట్లు కేటాయించామని ప్రజాప్రతినిధులు, అధికారులు పేర్కొంటున్నా ఇంకా అది కార్యరూపం దాల్చడానికి చాలా రోజులు పడుతుందని తెలుస్తోంది. పట్టణంలోని ప్రధాన వీధుల్లో రోడ్డుకు ఇరువైపులా మార్కెట్‌ను నిర్వహించడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నందున సమీకృత మార్కెట్‌ అయ్యేంతవరకు తాత్కాలికంగా హైవే రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌కు ఆనుకుని తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేసి ఇస్తామని గత నెలలో మున్సిపల్‌ పాలకవర్గం ప్రకటించింది. ఇంతవరకు అది అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం నర్సాపూర్‌లో కరోనా కేసులు పెద్ద ఎత్తున నమోదవుతుండడంతో శుక్రవారం నిర్వహించిన సంతను జూనియర్‌ కాలేజీ మైదానంలోకి మర్చారు. ముందస్తు సమాచారం లేకపోవడంతో వ్యాపారులు, ప్రజలు సంత ఎక్కడ ఉందో తెలియక ఇబ్బందులు పడాల్సి వచ్చింది. 

Updated Date - 2021-04-17T05:29:47+05:30 IST