చిలకడదుంపలతో వెయిట్‌లాస్‌!

ABN , First Publish Date - 2021-01-12T17:35:25+05:30 IST

బరువు తగ్గాలంటే దుంపలు మానేయాలకుంటే పొరపాటు. అధిక బరువు తగ్గడం కోసం మరీ ముఖ్యంగా చిలకడదుంపలను మెనూలో చేర్చుకోవాలి.

చిలకడదుంపలతో వెయిట్‌లాస్‌!

ఆంధ్రజ్యోతి(12-01-2020)

బరువు తగ్గాలంటే దుంపలు మానేయాలకుంటే పొరపాటు. అధిక బరువు తగ్గడం కోసం మరీ ముఖ్యంగా చిలకడదుంపలను మెనూలో చేర్చుకోవాలి.


చిలకడదుంపల్లో పిండిపదార్థాలు ఎక్కువే అయినా వీటిలో లెక్కలేనన్ని ఖనిజ లవణాలు, ఫైటోన్యూట్రియంట్లు, పీచు, విటమిన్లు ఉంటాయి. వీటితో పాటు బీటాకెరోటిన్‌, క్లోరోజెనిక్‌ యాసిడ్‌, యాంథోసయానిన్స్‌ వంటి యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి తోడ్పడేవే! చిలకడదుంపల్లోని పీచు ఆకలికి తోడ్పడే హార్మోన్ల స్థాయిని తగ్గించి, కొలోసిస్టోకైనిన్‌ అనే హార్మోన్‌ స్థాయిని పెంచుతుంది. దాంతో కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. అదే సమయంలో జీర్ణప్రక్రియ వేగం మందగించి, రక్తంలో చక్కెర స్థాయి నిలకడగా కొనసాగుతుంది.


వీటిలోని పీచు, గ్లూకోజ్‌లు నిరంతరంగా శక్తిని అందిస్తూ ఉంటాయి. కాబట్టి వర్కవుట్‌కు ముందు లేదా తర్వాత చిలకడదుంపలను స్నాక్‌గా తీసుకోవచ్చు. వీటిలోని రెసిస్టెంట్‌ స్టార్చ్‌ దీర్ఘకాలం పాటు కడుపు నిండుగా ఉన్న భావనను కలిగించి, చిరుతిళ్ల జోలికి వెళ్లకుండా నియంత్రిస్తుంది.


ఇలా తినాలి: చిలకడదుంపలో పోషకాలు ఎక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అయితే వీటిని నూనెలో వేగించి తింటే, క్యాలరీల సంఖ్య పెరుగుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు చిలకడదుంపలను ఉడికించి, లేదా బేక్‌ చేసి తినాలి. అయితే అదనపు పిండిపదార్థాలు తోడవకుండా భోజనంలో ఇతర పదార్థాలను గమనించుకుని, వీటి మోతాదును కుదించుకోవాలి. ఇలా ప్రణాళికాబద్ధంగా తింటే చిలకడదుంపలతో అధిక బరువు తగ్గించుకోవడం కష్టమేమి కాదు!


Updated Date - 2021-01-12T17:35:25+05:30 IST