బరువెక్కిన బాల్యం!

ABN , First Publish Date - 2021-03-07T07:35:09+05:30 IST

ఆడుతూ పాడుతూ హాయిగా సాగాల్సిన బాల్యం.. టీవీలకు, కంప్యూటర్లకు, ఫోన్లకు పరిమితమైపోతోంది! తూనీగల్లా పరిగెత్తాల్సిన చిన్నారులు..

బరువెక్కిన బాల్యం!

  • ప్రైవేట్‌ బడిపిల్లల్లో 40 శాతం ఊబకాయులే
  • 12 ఏళ్ల వారిలోనూ టైప్‌-2 మధుమేహం!
  • భవిష్యత్తులో తీవ్ర పరిణామాల ముప్పు
  • హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు 
  • గత సంవత్సరంతో పోలిస్తే ఊబకాయంపై ఎంక్వైరీలు 550% పెరిగాయన్న అధ్యయనాలు
  • ఆరోగ్యకర అలవాట్లు అలవరచుకోవాలని హితవు

హైదరాబాద్‌ సిటీ, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): ఆడుతూ పాడుతూ హాయిగా సాగాల్సిన బాల్యం.. టీవీలకు, కంప్యూటర్లకు, ఫోన్లకు పరిమితమైపోతోంది! తూనీగల్లా పరిగెత్తాల్సిన చిన్నారులు.. ఊబకాయంతో బాధపడుతున్నారు!! శరీరాన్ని అలిసిపోయేలా చేసి.. ఆరోగ్యంగా ఉంచే ఆటలు కనుమరుగు కావడంతో పిల్లల్లో బద్ధకం.. దాని ఫలితంగా అధికబరువు సమస్య పెరిగిపోతున్నాయి. అంకెల్లో చెప్పాలంటే మనదేశంలో దాదాపు కోటిన్నర మంది చిన్నారులు ఊబకాయంతో బాధపడుతున్నారని.. ప్రపంచంలోనే ఇది రెండో అత్యధికమని, మొదటి స్థానంలో చైనా చిన్నారులు ఉన్నారని వైద్యులు తెలిపారు. హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో దాదాపు 35-40ు మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. మరీ ముఖ్యంగా ఉన్నత ఆదాయ కుటుంబాలకు చెందిన పిల్లలు చదివే ప్రైవేట్‌ పాఠశాలల్లో ఊబకాయం కేసులు చాలా ఎక్కువగా ఉంటున్నాయని వైద్యులు చెబుతున్నారు. సహజంగా పెద్దవారిలో మాత్రమే కనిపించే టైప్‌-2 మధుమేహం 12 ఏళ్ల పిల్లల్లో కూడా కనిపిస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకే చోట కదలకుండా కూర్చుని ఉండే జీవనశైలి పెరిగిపోవడమే ఊబకాయానికి, ఇతరత్రా అనారోగ్యాలకు కారణమవుతోందని.. ఇలాంటి వారికి కరోనా సోకితే ఇన్ఫెక్షన్‌ ముప్పు చాలా ఎక్కువగా ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. కాగా.. గత సంవత్సరంతో పోలిస్తే ఊబకాయ సంబంధిత సమస్యల కోసం డాక్టర్లను ఆన్‌లైన్‌లో సంప్రదిస్తున్న వారి సంఖ్య దేశవ్యాప్తంగా 550ు పెరిగిందని ప్రాక్టో సంస్థ జరిపిన అధ్యయనాల్లో వెల్లడైంది. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (ఎన్‌ఐఎన్‌) గతంలో విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ప్రతి ఆరుగురు హైదరాబాదీల్లో ఒకరు స్థూలకాయంతో బాధపడుతున్నట్టు తేలింది.


అధిక కొవ్వు.. అనర్థదాయకం

అంతర్జాతీయ అధ్యయనాల ప్రకారం మగవారిలో శరీరంలో కొవ్వుశాతం 25ు, స్త్రీలలో 35ు కన్నా ఎక్కువగా ఉంటే వారు ఊబకాయులే! ‘బాడీ మాస్‌ ఇండెక్స్‌ (బీఎంఐ)’ లెక్క ఆధారంగా మనం సరైన బరువు ఉన్నామా లేక ఎక్కువ/తక్కువ బరువు ఉన్నామా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం 18.5 - 24.9 బీఎంఐని సాధారణంగా.. 25.0-29.9 బీఎంఐని అధిక బరువుగా... 30 దాటితే ఊబకాయంగా పరిగణిస్తారు. మనదేశంలో ఈ విలువలను మరింత కఠినంగా నిర్దేశించారు. మన లెక్కల ప్రకారం.. బీఎంఐ 18 నుండి 22.9 వరకు ఉంటే సాధారణం, 23 నుండి 25 వరకు ఉంటే అధిక బరువు.. 25 కంటే ఎక్కువగా ఉంటే ఊబకాయంగా పరిగణిస్తున్నారు.  ఈ బీఎమ్‌ఐ ప్రమాణాలతో కూడా భారతీయులు హృద్రోగాలు, ఇతర సమస్యలతో బాధపడుతూ మరణిస్తున్నారు. భారతీయులలో హృద్రోగాలు అమెరికన్ల కన్నా 3-4 రెట్లు అధికం. చైనీయుల కంటే 6 రెట్లు, జపనీయుల కంటే 20 రెట్లు అధికమని నివేదికలు చెబుతున్నాయి. అంతేకాదు.. ఆయా దేశాల వారితో పోలిస్తే భారతీయులు చాలా చిన్న వయస్సులోనే హృద్రోగాల బారిన పడుతున్నారు. మన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడమే ఊబకాయానికి ప్రధాన కారణమని అపోలో ఆస్పత్రి డైటీషియన్‌ డాక్టర్‌ గాయత్రి వివరించారు. మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ శాతం కూరగాయలు, ఫ్రూట్స్‌ ఉండాలని.. ఏ సీజన్‌లో దొరికే పండ్లు ఆ సీజన్‌లో తీసుకోవటం మంచిదని సూచించారు. అలాగే రోజుకు కనీసం 45 నిమిషాలు వ్యాయామం చేయాలని కూడా సూచించారు.


సర్వ వ్యాధులకూ మూలం.. 

స్థూలకాయం కాస్మెటిక్‌ సమస్య అని చాలామంది అనుకుంటారు కానీ, నిజానికి అది ఎన్నో జబ్బులకు మూలకారణమని వైద్యులు చెబుతున్నారు. ‘‘ఊబకాయం కారణంగా హృద్రోగాలతో పాటు.. టైప్‌-2 మధుమేహం, అధిక రక్తపోటు, కొన్ని రకాల కేన్సర్లు, ఆర్థరైటిస్‌, పాలీ సిస్టిక్‌ ఓవరీ సిండ్రోమ్‌ (పీసీవోఎస్‌) వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది’’ అని ఇండో-యూఎస్‌ హాస్పిటల్స్‌ సీనియర్‌ కన్సల్టెంట్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ శరత్‌ చంద్ర తెలిపారు. విరించి హాస్పిటల్స్‌లో సీనియర్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ సురేందర్‌ ఉగలేదీ ఇదే మాట. ‘‘స్థూలకాయం అనేక వ్యాధులకు తల్లి వంటిది. ప్రస్తుతం సమాజంలో ఫ్యాట్‌ లివర్‌ ఒక పెద్ద సమస్య. లివర్‌ సిరోసిస్‌, గుండె సమస్యలు, నిద్రలేమి, మోకాలి సమస్యలు, మూత్రపిండాల వైఫల్యం, కేన్సర్‌ వంటి సమస్యలకు ఊబకాయానికి సంబంధం ఉంది.’’ అంటారాయన. అడపాదడపా ఉపవాసం ఉండడం, వ్యాయామం చేయడం వలన శరీరం, కాలేయం నుండి కొవ్వును వదిలించుకోవచ్చని తెలిపారు. ‘‘గతంలో మేం 30 సంవత్సరాలు పైబడిన వారిలో మాత్రమే టైప్‌ 2 డయాబెటిస్‌ కేసులను చూసేవాళ్లం. కానీ ఇప్పుడు 12 ఏళ్ల పిల్లల్లో కూడా ఆ సమస్య కనిపిస్తోంది. వారు స్థూలకాయంతో బాధపడుతుండడమే దీనికి కారణం’’ అని ఆయన వివరించారు. ఊబకాయం మానసిక సమస్యలకు.. చిన్నవయసులోనే డిప్రెషన్‌కు కారణమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.


ఊబకాయాన్ని తగ్గించుకోవాలంటే..

అధిక బరువును, స్థూలకాయాన్ని సహజమైన, ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్ల దాకా వీలైనంతవరకూ తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు.. చాలా మంది పండ్ల రసాలు తాగుతారు. కానీ, వాటిలో ఫైబర్‌ ఉండదు. పండ్లను తినడం ఆరోగ్యకరమైన అలవాటు. అలాగే.. అన్నం, బంగాళాదుంపల వంటి పిండి పదార్థాలను తక్కువగా తీసుకోవాలి. కూరగాయలు, గింజలు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. మాంసాహారులైతే గుడ్డు, చికెన్‌, ఫిష్‌ వంటివాటిని తీసుకోవాలి.ఆహారాన్ని సరిగ్గా నమలాలి. నీరు అధికంగా తీసుకోవాలి. రోజూ కనీసం సుమారు 45 నిమిషాల శారీరక శ్రమ చేస్తుండాలి. రెడీమేడ్‌ జ్యూస్‌లు, మైదా, నూడుల్స్‌, పాస్తా, బ్రెడ్‌, బిస్కెట్లు, మటన్‌, పోర్క్‌, బీఫ్‌ వంటివాటికి దూరంగా ఉండాలి.                          

    అపర్ణ నెమలికంటి, పోషకాహార నిపుణురాలు 

Updated Date - 2021-03-07T07:35:09+05:30 IST