ప్రపంచంలోనే వింత.. ఈ మ్యూజియంలో అన్నీ మరుగుదొడ్లే.. ఎబ్బే అన్నవాళ్లే నోరెళ్లబెట్టారు..!

ABN , First Publish Date - 2021-06-12T19:08:37+05:30 IST

మరుగుదొడ్లను చూడటానికి ఎవరైనా మ్యూజియానికి వెళ్తారా..? అని డౌటొస్తోంది కదూ. కానీ ఆ మ్యూజియం గురించి వింటే తప్పకుండా వెళ్లి చూడాల్సిందే అన్న ఉత్సుకత పెరగడం మాత్రం గ్యారెంటీ.

ప్రపంచంలోనే వింత.. ఈ మ్యూజియంలో అన్నీ మరుగుదొడ్లే.. ఎబ్బే అన్నవాళ్లే నోరెళ్లబెట్టారు..!

ప్రపంచంలోని వింతలు విశేషాలను చూడాలనుకునే వాళ్లు, వాటి గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగిన వాళ్లు కోకొల్లలు. వింత విచిత్ర ప్రదేశాల గురించి, ఆయా ప్రాంతాల చారిత్రక నేపథ్యం గురించి తెగ సెర్చ్ చేస్తుంటారు. వీలుంటే వాటిని నేరుగా చూసేందుకు ఇష్టపడతారు. ఇక అరుదైన చారిత్రక ఆనవాళ్లు కొలువై ఉండే మ్యూజియాలకు అయితే పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ క్యూ కడుతుంటారు. కనిపించిన విడ్డూరాలను కళ్లప్పగించి మరీ చూస్తుంటారు. అవకాశం దొరికితే వాటి పక్కనే నిలబడి ఫొటోలను క్లిక్ మనిపిస్తుంటారు. నెట్టింట పోస్ట్ చేసి తమ ఆనందాన్ని పంచుకుంటారు. అయితే మీరు ఇప్పటి వరకు పురాణాలు, చారిత్రక ఆనవాళ్లకు సంబంధించిన వస్తువులనే మ్యూజియంలో చూసి ఉంటారు. కానీ ఓ మ్యూజియానికి వెళ్తే మాత్రం కేవలం టాయ్‌లెట్లు మాత్రమే కనిపిస్తాయి. అవును మీరు విన్నది నిజమే. కేవలం మరుగుదొడ్లు మాత్రమే ఆ మ్యూజియంలో కనిపిస్తాయి. మరుగుదొడ్లను చూడటానికి ఎవరైనా మ్యూజియానికి వెళ్తారా..? అని డౌటొస్తోంది కదూ. కానీ ఆ మ్యూజియం గురించి వింటే తప్పకుండా వెళ్లి చూడాల్సిందే అన్న ఉత్సుకత పెరగడం మాత్రం గ్యారెంటీ. ఇంతకీ అదెక్కడుందో, ఎప్పుడు ఏర్పాటు చేశారో.? దాని విశేషాలు ఏంటో ఓ లుక్కేయండి. 


భారత్‌లో ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్లను కలిగి ఉన్న కుటుంబాలు అరుదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున అవగాహన కల్పించి గ్రామాల్లో మరుగుదొడ్లను కట్టిస్తున్నా ఇప్పటికీ బహిరంగ మల విసర్జనను మాత్రం నిర్మూలించలేకపోతున్నాయి. సరిగ్గా ఈ అంశాన్ని తీసుకునే సామాజిక ఉద్యమకారుడు బిందేశ్వర్ పాథక్ ఓ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టాడు.


ఇప్పుడు సిటీల్లో కనిపిస్తున్న సులభ్ కాంప్లెక్స్ తరహా ఆలోచనకు పునాదులు వేసింది ఆయనే. ‘సులభ్ ఇంటర్నేషనల్’ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించిన ఆయన మరుగుదొడ్లపై దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. అయితే జనాల్లో చర్చ జరగడానికి కేవలం ప్రచారం మాత్రమే సరిపోదని ఆయనకు అనిపించింది. అందుకే ఎవరికీ కలలో కూడా రాని ఆలోచనకు ఆయన నాంది పలికారు. 


‘సులభ్ ఇంటర్నేషనల్ మ్యూజియం ఆఫ్ టాయిలెట్స్’ పేరుతో మరుగుదొడ్ల మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలని తలపోశాడు. అనుకున్నదే తడవుగా దాన్ని ఆచరణలో పెట్టాడు. చివరకు 1992వ సంవత్సరంలో దేశ రాజధాని ఢిల్లీలో ఈ మరుగుదొడ్ల మ్యూజియం ఏర్పాటయింది. మరుగుదొడ్లతో మ్యూజియం ఏంటా అని మొదట నొసలు చిట్లించిన వాళ్లే ఒక్కసారి అందులోకి ప్రవేశించాక అబ్బురపడ్డారు. కనీవినీ ఎరుగని మోడల్స్‌లో మరుగుదొడ్లు ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. భారతీయ సంప్రదాయాన్ని, కళలను వినియోగించి ఆయన సృష్టించిన మరుగుదొడ్ల మ్యూజియం ప్రపంచంలోనే వింత మ్యూజియాల్లో ఒక్కటిగా చరిత్ర పుటలకెక్కింది. 


క్రీస్తు పూర్వం 3000వ సంవత్సరం నుంచి 20వ శతాబ్దం వరకు దాదాపు 50 దేశాలకు చెందిన మరుగుదొడ్ల కళాఖండాలు ఈ మ్యూజియంలో కనిపిస్తాయి. రాజుల కాలం నుంచి బ్రిటీష్ పాలకుల వరకు వినియోగించిన మరుగుదొడ్ల ఆకృతులు ఇక్కడ కనిపిస్తాయి. రోమన్ చక్రవర్తులు ఉపయోగించిన బంగారు, వెండి టాయ్‌లెట్లు, క్వీన్ ఎలిజిబెత్ I పాలనలో సర్ జాన్ హారింగ్టన్ 1596లో రూపొందించిన ఫ్లస్ కమోడ్ నమూనాను కూడా ఇక్కడ చూడొచ్చు. 


హరప్పా నాగరికత సమయంలో ఉన్న మరుగునీటి వ్యవస్థ, సింధు లోయ నాగరికత సమయంలో కనిపించే మరుగుదొడ్ల వ్యవస్థను కూడా ఈ మ్యూజియంలో చూడొచ్చు. ఇక్కడ కనిపించే వింత విచిత్ర టాయిలెట్ కమోడ్స్‌ను కళ్లప్పగించి చూస్తూ ఉండిపోవాల్సిందే. మంచి ఆకృతిలో చెక్క కుర్చీ ఆకృతిలో ఉండే కమోడ్ నుంచి పుస్తక రూపంలో ఉండే కమోడ్ వరకు అన్నీ చూపరులను కట్టిపడేస్తాయి. 


కేవలం మరుగుదొడ్ల ఆకృతులే కాదండోయ్.. మరుగుదొడ్లపై హాస్యానికి సంబంధించిన కామిక్స్, జోకులు, కార్టూన్ల బోర్డులు కూడా ఈ మ్యూజియంలో కనిపిస్తాయి. ఇంతవరకు చారిత్రక నేపథ్యానికి సంబంధించిన మ్యూజియాలనే సందర్శించిన వాళ్లు.. ఒక్కసారి ఈ టాయ్‌లెట్ మ్యూజియాన్ని కూడా లుక్కేస్తే వింత అనుభూతిని పొందగలరంటే అతిశయోక్తి కాదు. ఈ కరోనా మహమ్మారి నుంచి కాస్త కుదుటపడ్డాక వీలుంటే ఈ మ్యూజియాన్ని మీరు కూడా ఓ లుక్కేయండి. 





Updated Date - 2021-06-12T19:08:37+05:30 IST