కరోనా కట్టడికి ఈ దేశాల్లో షాకింగ్ రూల్స్.. మద్యం, సిగరెట్లు బంద్.. స్త్రీ పురుషుల్లో ఒక్కరే రోడ్లపైకి..!

ABN , First Publish Date - 2021-06-14T18:36:54+05:30 IST

నైట్ కర్ఫ్యూలు, లాక్‌డౌన్‌లు, ప్రయాణాలపై నిషేధాలు తదితర నిబంధనలు మనకు తెలుసు. అయితే కొన్ని దేశాల్లో మాట్లాడటాన్ని కూడా నిషేధించారని తెలుసా? కొన్ని చోట్ల మద్యం సిగరెట్లపై బ్యాన్ విధించారు. ఇవన్నీ కరోనాను నిలువరించడానికి తీసుకున్న నిర్ణయాలే.

కరోనా కట్టడికి ఈ దేశాల్లో షాకింగ్ రూల్స్.. మద్యం, సిగరెట్లు బంద్.. స్త్రీ పురుషుల్లో ఒక్కరే రోడ్లపైకి..!

ప్రపంచ దేశాలన్నీ కలిసి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఓడించలేకపోయిన శత్రువు కరోనా మహమ్మారి. ఎంతమంది డాక్టర్లు, సైంటిస్టులు చెమటలు చిందించినా ఈ వైరస్ పీచమణచడం మాత్రం కలగానే మిగిలింది. అయితే ఈ మహమ్మారి ప్రపంచంపై విరుచుకుపడుతున్న తరుణంలో కొన్ని దేశాలు వింత నిబంధనలు అమల్లోకి తెచ్చాయి. ఇలాగైనా వైరస్ వ్యాప్తిని నిలువరించవచ్చనేది వారి ఆలోచన. నైట్ కర్ఫ్యూలు, లాక్‌డౌన్‌లు, ప్రయాణాలపై నిషేధాలు తదితర నిబంధనలు మనకు తెలుసు. అయితే కొన్ని దేశాల్లో మాట్లాడటాన్ని కూడా నిషేధించారని తెలుసా? కొన్ని చోట్ల మద్యం సిగరెట్లపై బ్యాన్ విధించారు. ఇవన్నీ కరోనాను నిలువరించడానికి తీసుకున్న నిర్ణయాలే. మరి ఆ దేశాలు, అవి తీసుకున్న వింత నిర్ణయాలపై ఒక లుక్కేద్దామా?


1. ఫ్రాన్స్‌లో మూతపడ్డ రెస్టారెంట్లకు నష్టపరిహారం

కరోనా తీవ్రమైన ప్రభావం చూపిన యూరప్ దేశాల్లో ఫ్రాన్స్ ఒకటి. ఇక్కడ 57 లక్షలపైగా కరోనా కేసులు, లక్షపైగా కరోనా మరణాలు నమోదయ్యాయి. అందుకే ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి ఫ్రాన్స్ కొన్ని కఠిన నిబంధనలు అమలు చేసింది. ప్యారిస్ ప్రాంతం మొత్తం లాక్‌డౌన్ అమలు చేసింది. స్థానికులు ఎక్సర్‌సైజులు చేయడానికి బయటకు వెళ్లొచ్చు. కానీ ఇంటి నుంచి 10 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరం వెళ్లకూడదు. సరైన కారణం, దానికి సంబంధించిన ఆధారాలు లేకుండా దేశంలో ఇతర ప్రాంతాలకు ప్రయాణించకూడదు. దేశం మొత్తం సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకూ కర్ఫ్యూ విధించారు.


అదే సమయంలో కేఫ్‌లు, రెస్టారెంట్లు ఇలా మూతపడ్డ వ్యాపారాలు పూర్తిగా నష్టపోకుండా నెల నెలా 12వేల డాలర్లు నష్టపరిహారం చెల్లించింది ప్రభుత్వం. ఇలా 2019 నుంచి ఇస్తూనే వచ్చింది. ప్రజా రవాణా వ్యవస్థల్లో మాస్కు తప్పనిసరి. అదే సమయంలో ఫ్రాన్స్‌కు చెందిన నేషనల్ అకాడమీ ఆఫ్ మెడిసిన ఒక వింత సూచన చేసింది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టులో ఉండగా ఎవరూ మాట్లాడొద్దని, ఫోన్ కాల్స్ కూడా చేయొద్దని చెప్పింది. సామాజిక దూరం పాటించడం కుదరని చోట్ల ఇలా చేయడం వల్ల వైరస్ వ్యాప్తిని నిలువరించవచ్చని సైంటిస్టులు తెలిపారు. ఇది తప్పనిసరి కాదు కానీ, ముఖ్యమైన సూచన.


2. అబుదాబి, యూఏఈ‌లో ప్రత్యేక రిస్ట్‌బ్యాండ్..

సెప్టెంబరు 2020 నుంచి యూఏఈ వచ్చే ప్రయాణికులు ఓ వింత రూల్ పాటించాల్సి వచ్చింది. అదేంటంటే వాళ్లంతా 10 రోజులు కచ్చితంగా హోం క్వారంటైన్‌లో ఉండాలి. దీనికితోడు ఆ సమయంలో ప్రభుత్వం ఇచ్చిన ట్రాకింగ్ రిస్ట్‌బ్యాండ్ ధరించాలి. అలాగే ఎయిర్‌పోర్టులోనే థర్మల్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. ఇమిగ్రేషన్ ప్రక్రియ పూర్తికాగానే అధికారులు మన చేతిలో ఈ రిస్ట్‌బ్యాండ్ పెడతారు. అయితే 18 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న వారు, 60 ఏళ్లు పైబడిన వారు, తీవ్రమైన వ్యాధులతో ఉన్నవారు, డిప్లొమాట్ పాస్‌పోర్టు ఉన్న వారికి ఈ నియమం నుంచి మినహాయింపు ఇచ్చింది యూఏఈ.


3. సింగపూర్‌లో స్పెషల్ యాప్ ద్వారా ట్రాకింగ్

ఈ దేశంలో ప్రజలు ఒక ప్రత్యేక డిజిటల్ సాధనం లేదా ఒక యాప్ ద్వారా తమ లొకేషన్ తెలుసుకునే అధికారం అధికారులకు ఇవ్వాలి. అలాగే ఇక్కడకు వచ్చే ప్రయాణికులు  14 రోజులు క్వారంటైన్‌లో ఉండాలి. ఈ క్వారంటైన్‌ను ప్రభుత్వం చాలా గట్టిగా పర్యవేక్షిస్తుంది. అలాగే క్వారంటైన్‌లో ఎక్కడ ఉండాలో కూడా ప్రభుత్వమే ఎంపిక చేస్తుంది. అయితే దీనికి అయ్యే ఖర్చు మాత్రం మనదే. సొంతఖర్చుతో ఇలా ఉండాల్సి రావడం ప్రయాణికులకు చాలా ఇబ్బంది కలిగించింది. అలాగే కొందరు ఫైవ్ స్టార్ హోటళ్లలో క్వారంటైన్ కాలం గడపగా.. మరికొందరు బొద్దింకలతో నిండి ఉన్న ఇరుకు గదుల్లో గడపాల్సి వచ్చిందట.


4. మెక్సికో‌లో పిల్లల చిరుతిళ్లు, స్వీట్ డ్రింక్స్‌పై నిషేధం

అత్యధిక కరోనా మరణాలు నమోదైన దేశాల్లో అమెరికా పొరుగు దేశం మెక్సికో నాలుగో స్థానంలో ఉంది. ఇక్కడ కరోనాతో పోరాడేందుకు వింత నిబంధనలు తీసుకొచ్చారు. అవేంటంటే.. మైనర్లకు చిరుతిళ్లు, తియ్యటి డ్రింకులు అమ్మడంపై నిషేధం విధించిందీ దేశం. ఇలాంటి ఆహారం వల్ల డయాబెటీస్, ఒబేసిటీ వస్తాయని, ఇవి సోకిన వారికి కరోనా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని అధికారులు చెప్పారు. స్కూలు వెండింగ్ మెషీన్లు, స్టోర్లకు ఈ నిబంధనలు వర్తించాయి. అలాగే గ్రాసరీ దుకాణాలు, ముఖ్యంగా మెక్సికో పట్టణంలో ఉన్న దుకాణాలు కూడా కొన్ని నిబంధనలు పాటించాయి. ఒక కుటుంబం నుంచి ఒక్కరిని మాత్రమే దుకాణాల్లోకి అనుమతించారు. ఇలా చేయడం వల్ల ప్రజలు గుంపులుగా చేరడం కుదరదని, తద్వారా వైరస్ వ్యాప్తి తగ్గుతుందని వాళ్లు చెప్పారు.


5. స్పెయిన్‌లో ఆ ప్రాంతంలో వ్యాక్సిన్ తీసుకోకపోతే భారీ జరిమానా

కరోనా విలయతాండవం చేసిన మరో యూరప్ దేశం స్పెయిన్. ఇక్కడ కూడా కఠినమైన లాక్‌డౌన్ అమలు చేశారు. ప్రాంతాన్ని బట్టి రాత్రి 10 లేదా 11 నుంచి ఉదయం 6గంటల వరకూ కర్ఫ్యూ విధించారు. ప్రజలు ఆరుగురికంటే ఎక్కువ మంది గుంపులుగా చేరడాన్ని ప్రభుత్వం నిషేధించింది. నైట్ క్లబ్బులను మూసివేసి, కనీసం 6 అడుగుల సామాజిక దూరం పాటించలేని పబ్లిక్ ప్రాంతాల్లో ధూమపానం చేయడాన్ని కూడా బ్యాన్ చేసింది. ఇలా సిగరెట్ తాగేవాళ్లు పొగ వదలడం వల్ల వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దేశంలోని కాటలోనియా ప్రాంతంలో ప్రభుత్వం.. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో వెళ్లేటప్పుడు మాట్లాడం, తినడం, తాగడం వంటివి చేయొద్దని కోరింది. గలీసియా అనే ప్రాంతం వ్యాక్సిన్ తీసుకోవడానికి నిరాకరించే వారిపై 1100 డాలర్ల నుంచి 71వేల డాలర్ల వరకూ జరిమానా విధించడానికి సిద్ధమైంది.


6. జర్మనీలో ఏ మాస్కు పడితే ఆ మాస్కు వాడటం అస్సలు కుదరదు

కరోనా తీవ్రత బాగా ఎక్కువగా పడిన దేశాల్లో జర్మనీ కూడా ఒకటి. అందుకే ఇక్కడ లాక్‌డౌన్ చాలా కఠినంగా అమలు చేశారు అధికారులు. ఈ క్రమంలోనే ఒక ఇంట్లో రెండు కుటుంబాలకు చెందిన ఐదుగురికి మించి గుంపులుగా చేరకూడదని ప్రభుత్వం నిషేధించింది. అయితే 14 ఏళలోపు పిల్లలకు ఈ నిబంధనలో మినహాయింపు ఉంది. చాలా వరకూ రెస్టారెంట్లు, బార్లు వంటివి మూసేశారు. హోటళ్లు కూడా కేవలం పర్యాటకులకు మాత్రమే అకామడేషన్ కల్పించాలనే నిబంధన విధించారు. అలాగే ప్రజలు ఏ మాస్కులు పడితే ఆ మాస్కులు ధరించడానికి జర్మనీ ఒప్పుకోలేదు. అయితే సర్జికల్ మాస్కు, లేదంటే ఉత్తమ ఫిల్టరేషన్ ఉన్న ఎన్95 లేక ఎఫ్ఎఫ్‌పీ-2 మాస్కులు ధరించాలని జర్మనీ రూల్. ఉద్యోగం చేసే ప్రాంతంలో, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టుల్లో ఇవి ధరించడం ద్వారా వైరస్ వ్యాప్తిని నియంత్రిచవచ్చని ప్రభుత్వం భావించింది.


7. పనామాలో బయటికొచ్చేందుకు స్త్రీ పురుషులకు వేర్వేరు రోజులు

కరోనా భయంతో పనామా దేశం ఒక వింత రూల్ తీసుకొచ్చింది. ఒక కుటుంబంలోని స్త్రీ, పురుషులను వేరు వేరు రోజుల్లో గ్రాసరీ షాపింగ్‌కు వెళ్లేలా ప్రభుత్వం చట్టం చేసింది. ఇక్కడి నిబంధనల ప్రకారం, వారంలోని సోమ, బుధ, శుక్రవారాల్లో కుటుంబంలోని ఆడవాళ్లు.. మంగళ, గురు, శనివారాల్లో మగవాళ్లు బయటకు వెళ్లి షాపింగ్ చేసుకోవచ్చు. ఆదివారం అందరూ ఇంట్లోనే ఉండాలి. ఈ షాపింగ్ కూడా కేవలం రెండు గంటల్లోనే ముగించుకోవాలి. ఫిబ్రవరి నెలలో ఈ రూల్ తీసేశారు.


8. సౌతాఫ్రికా‌లో మద్యంపై నిషేధం..

కొత్త కరోనా వేరియంట్ పుట్టిన ఈ దేశం కూడా కరోనా నియంత్రణ కోసం చాలా కఠినమైన లాక్‌డౌన్ అమలు చేసింది. ఇక్కడ కరోనా వచ్చిన వెంటనే తీసుకున్న నిర్ణయం ఆల్కహాల్ బ్యాన్. ఆ తర్వాత గతేడాది జూన్ 1న ఈ బ్యాన్ తొలగించేశారు. మళ్లీ అదే ఏడాది జూలైలో ఈ నిషేధం అమల్లోకి వచ్చింది. ఒక నెల తర్వాత మళ్లీ నిషేధాన్ని తొలగించారు. మళ్లీ గతేడాది డిసెంబరులో మరోసారి ఆల్కహాల్‌పై నిషేధం విధించారు. ప్రజలు తప్పతాగి చేసే చర్యల వల్ల వైరస్ వ్యాప్తి జరుగుతోందనే కారణంతోనే ఇలా ఆల్కహాల్ బ్యాన్ విధించినట్లు తెలుస్తోంది. ‘‘మద్యం మత్తులో నిర్లక్ష్యంగా ప్రవర్తించడం వల్ల వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. ఆల్కహాల్ సంబంధిత ప్రమాదాలు, నేరాలు ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న ఆస్పత్రుల్లోని అత్యవసర విభాగాలపై మరింత ఒత్తిడి తెస్తున్నాయి’’ అని ఆ దేశాధ్యక్షుడు సిరిల్ రామఫోస వెల్లడించారు. అలాగే కరోనా వల్ల వచ్చే ఊపిరితిత్తుల సమస్యలను ధూమపానం మరింత తీవ్రతరం చేస్తుందనే అనుమానంతో సిగరెట్లపై కూడా నిషేధం విధించిందీ దేశం. 



Updated Date - 2021-06-14T18:36:54+05:30 IST