రాజధాని రాయలసీమలో ఎక్కడ ఏర్పాటు చేసినా స్వాగతిస్తాం: తిప్పేస్వామి

ABN , First Publish Date - 2020-08-03T00:03:40+05:30 IST

రాజధాని రాయలసీమలో ఎక్కడ ఏర్పాటు చేసినా స్వాగతిస్తాం: తిప్పేస్వామి

రాజధాని రాయలసీమలో ఎక్కడ ఏర్పాటు చేసినా స్వాగతిస్తాం: తిప్పేస్వామి

అనంతపురం: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి విమర్శలు గుప్పించారు.రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దవద్దంటూ ప్రభుత్వానికి హితవు పలికారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలతో రాష్ట్ర ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మాట తప్పని మడమ తిప్పని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కు నిజంగా రాష్ట్ర ప్రజల పట్ల ప్రేమాభిమానాలు ఉంటే అమరావతి రాజధాని కొనసాగించాలని తిప్పేస్వామి డిమాండ్ చేశారు.


ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకు మాయమాటలు చెప్పి నేడు మోసం చేయడం తగదన్నారు. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి నిర్మాణం కోసం 30 వేల ఎకరాల భూములను సేకరిస్తే, ప్రతిపక్ష నేతగా జగన్ 50 వేల ఎకరాలు సేకరించ మంటూ ఉచిత సలహా ఇచ్చారని టీడీపీ ఎమ్మెల్సీ విమర్శించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి  జగన్ ఏకంగా అమరావతి రాజధానికి ఎసరు పెట్టడం బాధాకరమన్నారు.


రాయలసీమలో పుట్టి పెరిగిన ముఖ్యమంత్రి జగన్ సీమ ప్రజల పట్ల అంకితభావంతో పని చేయాల్సిన సమయం ఆసన్నమైందని, కానీ అందుకు విరుద్ధంగా హైకోర్టు ఏర్పాటు చేస్తామనడం భావ్యం కాదన్నారు. వెనుకబాటుకు గురి అవుతున్న రాయసీమ అభివృద్ధి పథంలో నడవాలంటే రాష్ట్ర రాజధాని రాయలసీమలో ఎక్కడ ఏర్పాటు చేసినా స్వాగతిస్తామని తిప్పేస్వామి అన్నారు. అనంతపురానికి దూరంలో ఉన్న విశాఖలో రాజధాని ఏర్పాటు చేయడం హర్షించదగ్గ పరిణామం కాదని తెలిపారు. విశాఖలో రాజధాని ఏర్పాటు చేయదలిస్తే మడకశిర ప్రాంతాన్ని కర్ణాటకలో చేర్చాలని ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-08-03T00:03:40+05:30 IST