సరికొత్త ప్రపంచానికి స్వాగతం!

ABN , First Publish Date - 2020-02-22T06:36:28+05:30 IST

శాస్త్ర సాంకేతిక రంగాలు అనేక కొత్త ఆవిష్కరణలకు దారి చూపుతున్నాయి.

సరికొత్త ప్రపంచానికి స్వాగతం!

శాస్త్ర సాంకేతిక రంగాలు అనేక కొత్త ఆవిష్కరణలకు దారి చూపుతున్నాయి. ఈ ఆవిష్కరణలు జీవన శైలిని సులభతరం చేయడమే కాదు అద్భుతాలు సృష్టించనున్నాయి. అలాంటి కొన్ని కొత్త ఆవిష్కరణల గురించి తెలుసుకుందాం.


రోబోట్‌ అంటే అందరికీ గుర్తొచ్చేది.. ఒక యంత్రం అని. రోబోట్‌ కొంత ప్రోగ్రామింగ్‌ ద్వారా మనం నిర్దేశించిన పనులను చేసి పెడుతూ ఉంటుంది. అయితే జీవం లేని వాటితో పాటు, మరోవైపు ప్రాణం ఉన్న మరికొన్ని రోబోట్లు కూడా రాబోతున్నాయి. ఒక కప్ప అండంలోని స్టెమ్‌ సెల్స్‌ని ఆధారంగా చేసుకొని తయారుచేసిన ఇలాంటి రోబోట్స్‌ మానవ శరీరంలో మెడిసిన్‌ అవసరమైన భాగానికి ఈదుకుంటూ వెళ్లి మెడిసిన్‌ని నేరుగా ఆ ప్రదేశానికి అందించడంతోపాటు, సముద్రాలలో పేరుకుపోతున్న మైక్రోప్లాస్టిక్‌ని సేకరించడానికి ఉపయోగపడనున్నాయి. ఇవి కేవలం మిల్లీమీటర్‌ పరిమాణంలో ఉంటాయి.


స్పర్శతో కూడిన వర్చ్యువల్‌ రియాలిటీ

వర్చ్యువల్‌ రియాలిటీ హెడ్‌సెట్‌ని తలకు తగిలించుకుంటే మనం ఉన్న ప్రదేశాన్ని పూర్తిగా మర్చిపోయి మనం ఆడే గేమ్‌, అప్లికేషన్లో పూర్తిగా మునిగిపోతాం అన్న విషయం తెలిసిందే. వర్చ్యువల్‌ రియాలిటీ హెడ్‌సెట్‌ తగిలించుకొని వేర్వేరు దేశాలలో నివసిస్తున్న ఇద్దరు కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటుంటే, ఒకరికి ఒకరు ఎదురుగా ఉన్న అనుభూతి అయితే కలుగుతుంది.


అయితే దాంతోపాటు స్పర్శ కూడా జతచేరితే మరింత ప్రభావవంతంగా ఉంటుంది కదా? సరిగ్గా ఇదే సదుపాయం త్వరలో రాబోతోంది. ఇద్దరు వ్యక్తులు ప్రత్యేకమైన సెన్సార్లని అమర్చుకుంటే ఒకరినొకరు తాకిన అనుభూతి కూడా పొందగలుగుతారు. గేమ్స్‌ ఆడేటప్పుడు మీరు ఒక క్యారెక్టర్‌ని ఎంచుకుంటారు కదా!  వేరే ప్లేయర్‌ వచ్చి మీ క్యారెక్టర్‌ని తాకితే ఆ అనుభూతి మీకు కూడా కలుగుతుంది. అంటే మనం ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి వేరే లోకంలో విహరించవచ్చు అన్నమాట.


చిన్న సూదితో కేన్సర్‌ నిర్ధారణ

ప్రాణాంతకమైన కేన్సర్‌ని గుర్తించడం కోసం లండన్‌ శాస్త్రవేత్తలు ఒక స్మార్ట్‌ సూదిని కనుగొన్నారు. ఇప్పటివరకు కేన్సర్‌ని గుర్తించాలంటే శరీరంలోని సంబంధిత భాగాన్ని బయాప్సీగా సేకరించి, దాన్ని విశ్లేషించాల్సి వచ్చేది. అయితే కొత్తగా ఆవిష్కరించిన స్మార్ట్‌నీడిల్‌ రామన్‌ స్పెకో్ట్రస్కోపీ అనే టెక్నిక్‌ ఆధారంగా పనిచేస్తుంది. శరీరంలో పరిశీలించాల్సిన ప్రదేశంలోకి తక్కువ విద్యుత్‌ కలిగి ఉండే ఒక చిన్న లేజర్‌ కిరణాన్ని పంపిస్తుంది. క్షణాల్లో కేన్సర్‌ వ్యాధి ఉందా లేదా! అన్నది నిర్ధారణ అవుతుంది.


సిలికాన్‌ చిప్‌లలో కృత్రిమ న్యూరాన్లు

మెదడులో జ్ఞాపకాలు మొదలుకుని, అనుభూతుల వరకూ న్యూరాన్ల ద్వారా, వారి మధ్య జరిగే ఫైరింగ్‌ ద్వారా ఏర్పడుతూ ఉంటాయి. అయితే గుండెపోటు వచ్చినప్పుడు గానీ, అల్జీమర్స్‌ లాంటి జ్ఞాపకశక్తికి సంబంధించిన రుగ్మతల సమయంలో మెదడులో న్యూరాన్లు తీవ్రంగా ప్రభావితం అవుతాయి. ఈ నేపథ్యంలో పరిశోధకులు సిలికాన్‌ చిప్‌ల మీద పొందుపరచగలిగే కృత్రిమమైన న్యూరాన్లని అభివృద్ధి చేశారు. ఇవి మన నాడీవ్యవస్థలో ఉండే వివిధ రకాల న్యూరాన్ల లక్షణాలను పుణికి పుచ్చుకోగలుగుతాయి. ఒక న్యూరాన్‌ కేవలం 140 నానోవాట్స్‌ విద్యుత్‌ను మాత్రమే వినియోగించుకుంటుంది. ఒక మైక్రో ప్రాసెసర్‌కి మనం అందించే విద్యుత్‌లో ఇది బిలియన్‌ భాగం మాత్రమే. అంత తక్కువ విద్యుత్తుని తాను కూడా వినియోగించుకుంటూ న్యూరాన్ల లక్షణాలను ఈ తాజా ఆవిష్కరణ కలిగి ఉంటుంది. హార్ట్‌ ఫెయిల్యూర్‌, అల్జీమర్స్‌ వంటి సందర్భాలలో మెడికల్‌ ఇంప్లాంట్స్‌గా ఇవి ఉపయోగపడతాయి.


ప్లాస్టిక్‌ని తినేసే బ్యాక్టీరియా

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అతి పెద్ద సమస్య ప్లాస్టిక్‌. ఒక నివేదిక ప్రకారం నిమిషానికి ప్రపంచ వ్యాప్తంగా కోటి వాటర్‌ బాటిల్స్‌ అమ్ముడవుతున్నాయి. అనేక ఇతర రూపాల్లో కూడా ప్లాస్టిక్‌ వినియోగం బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు ప్లాస్టిక్‌ని తినేసే ఒక బ్యాక్టీరియాని కనుగొన్నారు. 2016 నుంచి పరిశోధనలు మొదలు పెట్టి ఒక ప్రత్యేకమైన ఎంజైమ్‌ ఆధారంగా ప్లాస్టిక్‌ని తినేసే ఈ బ్యాక్టీరియాని కనుక్కోవడం జరిగింది. దీన్ని భారీ స్థాయిలో ఉత్పత్తి చేసి ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్‌ భూతాన్ని అంతం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే గనక సాధ్యపడితే ప్లాస్టిక్‌ రహిత సమాజం ఏర్పడుతుంది.


వెరైటీ స్కానర్‌

షాపింగ్‌ మాల్స్‌లో ఉండే బార్‌కోడ్‌ స్కానర్‌ మీరే చూసే ఉంటారు. సరిగ్గా అదే విధంగా కనిపించే ఒక ప్రత్యేకమైన స్కానర్‌ని ఏదైనా ఫోటో మీద పెట్టి స్కాన్‌ చేసినప్పుడు. ఆ ఫోటో మొత్తం మెమరీలోకి వెళ్లి, ఆ తర్వాత ఆ స్కానర్‌ని టేబుల్‌, గోడ, పేపర్‌ వంటి ఏ ఉపరితలం మీద పెట్టినా ఇంతకుముందు స్కాన్‌ చేసిన ఫోటో ఉన్నది ఉన్నట్లు ప్రత్యేకమైన ఇంక్‌ ద్వారా ముద్రితమవుతుంది. ఇలాంటి ఎన్నో రకాల ప్రత్యేకమైన ఉత్పత్తులు భవిష్యత్తులో రాబోతున్నాయి. ఖచ్చితంగా ఇప్పుడు మనం జీవిస్తున్న విధానానికి భిన్నమైన జీవనశైలిని 

భవిష్యత్తులో ఆస్వాదించబోతున్నాం.


తాగి ఉంటే నడవదు

మద్యం తాగి డ్రైవింగ్‌ చేసే వాళ్లని చూస్తూనే ఉంటాం. బ్రీత్‌ ఎనలైజర్ల ద్వారా అలాంటి వాళ్ళని పట్టుకున్నా కూడా పెద్దగా ఫలితం ఉండదు. మళ్లీ మళ్లీ అలాంటి పనులు చేస్తూనే ఉంటారు. అయితే సరికొత్త కార్‌ టెక్నాలజీ వస్తోంది. యుఎస్‌ నేషనల్‌ హైవే ట్రాఫిక్‌ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్‌ దీన్ని అభివృద్ధి చేసింది. త్వరలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని కంపెనీల కార్లలో ఇది వచ్చే అవకాశం ఉంది. కార్‌ డ్రైవింగ్‌ మొదలు పెట్టడానికి ముందు స్టీరింగ్‌ పక్కన ఉండే ఒక బటన్‌ మీద వేలు పెట్టాల్సి ఉంటుంది. ఇది ఆ వ్యక్తి ఒక వేలిని స్కాన్‌ చేసి వేలిచివల్లో ఉండే రక్తాన్ని పరిశీలించి ఆ వ్యక్తి తాగి ఉన్నాడా లేదా గుర్తిస్తుంది. తాగి ఉంటే స్టీరింగ్‌ పనిచేయదు.


పది నిమిషాల్లో ఛార్జింగ్‌

వాయు కాలుష్యానికి అడ్డుకట్ట వేయడం కోసం ఎలక్ట్రిక్‌ వాహనాలు ఉపయోగించడానికి యావత్తు ప్రపంచం సంసిద్ధం అవుతోంది. అయితే ఎలక్ట్రిక్‌ వాహనాల్లో ఉండే అతి పెద్ద సమస్య ఒకసారి బ్యాటరీ ఛార్జింగ్‌ ఖాళీ అయితే మళ్లీ రీచార్జ్‌ చేసుకోవడానికి చాలా సమయం పట్టడం! దీనికి పరిష్కారంగా తాజాగా లండన్‌కు చెందిన పెన్‌ స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు కేవలం పది నిమిషాల్లో పూర్తి ప్రయాణానికి సరిపడా బ్యాటరీ చార్జింగ్‌ చేసుకునే టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ఇక మీదట ఎక్కడైనా కాఫీ తాగడానికి ఆగినపుడు కారు ఛార్జింగ్‌ పెట్టి కాఫీ తాగి వచ్చేలోపు మళ్లీ అది ప్రయాణానికి సిద్ధం అవుతుంది.


గాలిలో వ్యవసాయం

క్రమేపీ వ్యవసాయ భూములు కుదించుకుపోతున్నాయి. అనేక గ్రామాలు రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లుగా మారిపోతున్నాయి. ఇదంతా దీర్ఘకాలంలో ఆహారధాన్యాల మీద ప్రభావం చూపించబోతోంది. ఒక అంచనా ప్రకారం 2050 నాటికి ఇప్పుడున్న దానికన్నా 70శాతం అదనంగా ఆహారం ప్రపంచానికి కావలసి ఉంటుంది. అందుకే ప్రత్యామ్నాయ పద్ధతిగా గాలిలో వేలాడే వ్యవసాయ క్షేత్రాలను ఆవిష్కరిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది టెర్రాస్‌ మీద కూరగాయలు, చిన్న చిన్న తమ అవసరాలకు పంటలను పండించడం తెలిసిందే. అలా చిన్న మొత్తంలో కాకుండా తాజా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని గాలిలో వేలాడే వ్యవసాయ క్షేత్రాలు రానున్నాయి. 

Updated Date - 2020-02-22T06:36:28+05:30 IST