Abn logo
Sep 20 2021 @ 23:27PM

సంక్షేమానికి కోత!



తొలుత పింఛన్లు, ఇప్పుడు రేషన్‌కార్డులు

మూడు నెలలు సరుకులు తీసుకోకపోతే కార్డు కట్‌

జిల్లా వ్యాప్తంగా 16,223 కార్డుల గుర్తింపు

ఆందోళనలో లబ్ధిదారులు

(ఇచ్ఛాపురం రూరల్‌)

తొలుత పింఛన్‌దారులు, ఇప్పుడు రేషన్‌కార్డుదారుల ఏరివేత ప్రక్రియ ప్రారంభమైంది.  అమ్మఒడి లబ్ధిదారులపై కత్తి వేలాడుతోంది. అనర్హుల పేరిట వేలాది పింఛన్లు తొలగించగా.. వరుసగా మూడు నెలలు రేషన్‌ తీసుకోని వారి కార్డును నిలిపివేయనున్నట్టు  ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా 16,223 కార్డులు నిలిచిపోనున్నట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. మరోవైపు ‘అమ్మఒడి’ పథకంలో పెద్దఎత్తున అనర్హులు ఉన్నట్టు ప్రభుత్వం చెబుతోంది. ఏరివేతకు రంగం సిద్ధం చేస్తోంది. పారదర్శకతలో భాగంగానే అని ప్రభుత్వం చెబుతున్నా..  సంక్షేమానికి కోత విధిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎప్పుడు ఏ పథకం నిలిచిపోతుందోనని సామాన్య లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. 

రేషన్‌ లబ్ధిదారులు ఆందోళనతో గడుపుతున్నారు. ఎప్పుడు కార్డు నిలిచిపోతుందోనని భయపడుతున్నారు. వరుసగా మూడు నెలల పాటు ‘రేషన్‌’ తీసుకోకపోతే కార్డు నిలిపివేయనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. జిల్లా నుంచి వలసలు అధికంగా ఉన్న నేపథ్యంలో చాలామంది సామాన్య, పేద లబ్ధిదారులు సకాలంలో రేషన్‌ తీసుకోలేకపోయారు. అటువంటి వారు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 8.22 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి. అందులో గత మూడు నెలలకు పైబడి రేషన్‌ తీసుకోనివి 16,223 కార్డులు ఉన్నట్లు పౌరసరఫరాల అధికారులు గుర్తించారు. తహసీల్దారుల ఆధ్వర్యంలో సర్వే చేపట్టారు. ఇప్పటికీ ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 16,223 కార్డుల్లో 2,960 కార్డులు అర్హమైనవిగా నిర్థారించారు. వీటిలో ఎక్కువగా చనిపోయిన వారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 9,912 కార్డులు అనర్హమైనవిగా తేల్చారు. ఇంకా 3,351 కార్డులను పరిశీలించాల్సి ఉంది. 

కార్డులు వెనక్కి ఇవ్వని ప్రభుత్వ ఉద్యోగులు

 జిల్లాలో బియ్యం కార్డులు కలిగి ఉన్నవారిలో 15.900 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్లు గుర్తించారు. పౌరసరఫరాల సంస్థ జిల్లా కార్యాలయానికి రాజధాని నుంచి వచ్చిన జాబితాలోని కార్డుదారుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించగా వారంతా ప్రభుత్వ ఉద్యోగులేనని తేలింది. ఇందులో ఎక్కువశాతం ఇటీవల గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు పొందిన వారున్నారు. బియ్యం కార్డు కలిగి ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల్లో ఇప్పటి వరకూ 10,452 మంది తమ కార్డులను స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించారు. మిగిలినవారివి అప్పగించాల్సి ఉంది. వారు స్వచ్ఛందంగా అప్పగించకపోయినా నిత్యావసర సరుకుల పంపిణీకి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ నుంచి పేర్లను తొలగించనున్నారు. 

అర్హుల కార్డులకు ఇబ్బంది లేదు 

అర్హత ఉన్న ఏ లబ్ధిదారుడి కార్డునూ తొలగించరు. అనర్హులకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నాం. త్వరలో రాష్ట్ర కార్యాలయానికి నివేదిస్తాం. అనర్హులుగా గుర్తించిన కార్డుదారులు తాము అర్హులమేనని భావిస్తే తగిన ఆధారాలతో దరఖాస్తు చేసుకోవచ్చు. పరిశీలించి పునరుద్ధరిస్తాం. 

-డి.వెంకటరమణ, డీఎస్‌వో, శ్రీకాకుళం.