ప్రతీ గడపకు సంక్షేమం

ABN , First Publish Date - 2020-10-29T06:38:49+05:30 IST

ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ప్రతీ గడపకు సంక్షేమాన్ని చేరుస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు

ప్రతీ గడపకు సంక్షేమం

రైతుల వద్దకే వచ్చి పంటల కొనుగోలు

రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

ఏజెన్సీ గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన 


కొత్తగూడెం, అక్టోబరు 28: ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ప్రతీ గడపకు సంక్షేమాన్ని చేరుస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. యాసంగి పంటలను ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర ప్రకారం  కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి బుధవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఏజెన్సీ ప్రాంతాలైన పినపాక నియోజకవర్గంలో కరకగూడెం మండలంలో రూ.2.18కోట్లతో అనంతారం నుంచి గొల్లగూడెం వయా కొత్తూరు, బండారిగూడెం, శ్రీరంగపురం, చొప్పల వరకు ఆర్‌ అండ్‌ బీ బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలోని మణుగూరు మండలంలో రూ.4.63కోట్లతో రామానుజవరం నుంచి పగిడేరు వరకు వయా గొల్ల కొత్తూరు, కొత్తూరు కాలనీ వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. మణుగూరు మునిసిపాలిటీ పరిధిలోని కుంకుడుచెట్టు గుంపు వద్ద రూ.60లక్షల వ్యయంతో కట్టవాగుపై నిర్మించనున్న వంతెన, ఆదర్శనగర్‌లో రూ.70లక్షలతో కట్టవాగుపై నిర్మించనున్న వంతెనల నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. పినపాక నియోజకవర్గంలోని అశ్వాపురం మండలంలో రూ.3.43కోట్ల వ్యయంతో అశ్వాపురం నుంచి ఆమర్ధ మీదుగా అమ్మగారిపల్లి వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం కొత్తగూడెం పట్టణంలోని కొత్తగూడెం క్లబ్‌లో వ్యవసాయ, మార్క్‌ఫెడ్‌, పౌర సరఫరాల శాఖాధికారులతో ధాన్యం కొనుగోలు, యాసంగి పంటల సాగు, కార్యాచరణ ప్రణాళికలపై సమీక్ష సమావేశాన్ని మంత్రి నిర్వహించారు.  ఈ కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు, మహబూబాబాద్‌ ఎంపీ మాళోతు కవిత, కలెక్టర్‌ ఎంవీ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్‌ దిండిగల రాజేందర్‌, రైతు సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి,  ఎస్పీ సునిల్‌దత్‌ తదితరులు పాల్గొన్నారు. 


రైతుల ధైర్యంగా ఉండాలి..

 రైతు వద్దకే వచ్చి పంటలు కొనుగోలు చేస్తామని, రైతులు అధైర్యపడొద్దని  మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ తెలిపారు. కొత్తగూడెం క్లబ్‌లో వ్యవసాయ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.  ధాన్యం కొనుగోలుకు 50లక్షల గన్నీ బ్యాగుల అంచనాకుగాను ఇప్పటి వరకు 31.75లక్షల గన్నీ బ్యాగులు సిద్ధంగా ఉన్నాయని అన్నారు.. మొక్కజొన్న సాగును నియంత్రణ చేసినప్పటికీ జిల్లాలో 17,568 ఎకరాల్లో సాగు చేశారని రైతులు నియంత్రణ పాటించకుండా ఎలా సాగు చేశారని వ్యవసాయ అధికారులను ప్రశ్నించారు. వన్‌ టైం కొనుగోలుకు 12 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. జిల్లాలో 67 క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణాలు చేపట్టామని ఈ నెలాఖరు నాటికీ ఎట్టి పరిస్థితుల్లో పూర్తిచేసి వ్యవసాయ అధికారులకు అప్పగించాలన్నారు.  

Updated Date - 2020-10-29T06:38:49+05:30 IST