కల్యాణం కమనీయం

ABN , First Publish Date - 2022-02-10T06:41:20+05:30 IST

నంది వాహనంపై నీలకంఠుడు, పల్లకిలో పార్వతీ అమ్మవారిని వేడుకగా కల్యాణవేదిక వద్దకు తీసుకొచ్చారు.

కల్యాణం కమనీయం
పార్వతీ పరమేశ్వరుల కల్యాణం నిర్వహిస్తూ.. మంగళసూత్రం చూపుతున్న అర్చకులు, పాల్గొన్న నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తదితరులు

 వైభవంగా చెర్వుగట్టు పార్వతీ పరమేశ్వరుల పరిణయ వేడుక

 పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య  

 శివనామస్మరణతో మార్మోగిన శైవక్షేత్రం

పార్వతీ జడల రామలింగేశ్వరుల దివ్య కల్యాణ మహోత్సవం బుధవారం తెల్లవారుజామున అత్యంత రమణీయంగా సాగింది. దివ్యతేజోవంతులై, జగత్కల్యాణకారకులైన పార్వతీ పరమేశ్వరుల పరిణయమహోత్సవం ఆద్యంతం భక్తులను పులకింపజేసింది.  హరహర మహాదేవ శంభోశంకర అంటూ భక్తుల నినాదాలతో చెర్వుగట్టు మార్మోగింది. శివసత్తుల నృత్యాలు, భక్తుల పూనకాలతో శైవక్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. వేడుకల్లో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు. 

నార్కట్‌పల్లి, ఫిబ్రవరి 9: నంది వాహనంపై నీలకంఠుడు, పల్లకిలో పార్వతీ అమ్మవారిని వేడుకగా కల్యాణవేదిక వద్దకు తీసుకొచ్చారు. దేదీప్యమానమై వెలుగుతున్న విద్యుత్‌ దీపకాంతులు... సువర్ణపుష్పాది బిల్వాలతో దివ్యాలంకరణ సుశోభితమైన కల్యాణవేదిక నందు పద్మాసనంపై ఉత్సవమూర్తులను ఆసీనులను చేసి యాజ్ఞీకులు సంకల్ప, విఘ్నేశ్వర పూజ నిర్వహించారు. సప్తనదీ మంత్రజలాలను చల్లి పుణ్యాహవచనంతో కల్యాణ వేదికను శుద్ధిచేసి బ్రహ్మ, విష్ణు, ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికారు. నిత్యం యజ్ఞయాగాది క్రతువులు జరిగి ఈ దేశం, ఈ ప్రాంతం సస్యశ్యామలంగా విలసిల్లాలని కోరుతూ స్వామి వారికి యజ్ఞోపవీతం, అమ్మవారికి రక్షాసూత్రధారణ చేశారు. జగద్రక్షకుడైన పరమేశ్వరుని గొప్పతనాన్ని చాటుతూ సుగంధాది ద్రవ్యాలతో హిమవంతుడు కన్యాదానం చేసే ఘట్టాన్ని వ్యాఖ్యాత వర్ణించారు. శిరస్సులపై జీలకర్ర బెల్లంను అలంకరించి పాణిగ్రహణం అనంతరం ‘మాంగల్యం తంతునానేనా లోకరక్షణ హేతునాం’ అంటూ యాజ్ఞీకులు కల్యాణ మంత్రం పఠిస్తుండగా నిర్ణీత సుముహూర్తంలో దిక్పాలకుడైన లయకారుడు పార్వతీ అమ్మవారికి మాంగల్యధారణ చేసే ఘట్టాన్ని భక్తులు తనివీతీరా తిలకించి పునీతులయ్యారు. పరిణయశోభతో దివ్య మనోహరంగా దర్శనమిచ్చిన ఆది దంపతులకు తలంబ్రాలను సమర్పించుకున్న భక్తులతో మండప పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ఉత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌ మేకల అరుణారాజిరెడ్డి, ఈవో మహేంద్రకుమార్‌, సభ్యులు స్వాగతం పలికారు. ఆనవాయితీ మేరకు ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలను ఎమ్మెల్యే అందజేశారు. యాజ్ఞీకులు అల్లవరపు సుబ్రహ్మణ్యదీక్షితావధాని ఆచార్యత్వమున, ఆలయ ప్రధాన అర్చకుడు పోతులపాటి రామలింగేశ్వరశర్మ ఆధ్వర్యంలో, వేదపండితుడు నీలకంఠశాస్ర్తి వ్యాఖ్యానం భక్తులను తన్మయులను చేయగా.. రుత్వికుల వేదమంత్రాల మధ్య పరిణయ తంతు శైవాగమోక్తంగా జరిగింది. నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి పర్యవేక్షణలో నార్కట్‌పల్లి సీఐ శంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. ఈ కళ్యాణ వేడుకల్లో ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి, ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రేగట్టె మల్లిఖార్జున్‌రెడ్డి, సర్పంచ్‌ మల్గ బాలకృష్ణ, సభ్యులు పసునూరి శ్రీనివాస్‌, మారపాక ప్రభాకర్‌రెడ్డి, రాధారపు భిక్షపతి, బూర్గు కృష్ణయ్య, కల్లూరి శ్రీను, చిక్కుళ్ల యాదగిరి, దండు శంకరయ్య, కొండేటి వేణు, బొబ్బలి దేవేందర్‌, మేక వెంకట్‌రెడ్డి, వంపు శివ, చీర మల్లేశ్‌, కంకల యాదయ్య, మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ కొండూరు శంకరయ్య, మేడి శంకర్‌ అధికారులు పాల్గొన్నారు.


చెర్వుగట్టు రామలింగేశ్వరస్వామిపై సీఎంకు ప్రేమలేదు :  ఎంపీ 

సీఎం కేసీఆర్‌కు యాదాద్రి దేవస్థానంపై ఉన్న ప్రేమ చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామిపై లేనట్టుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. కల్యాణ మండపం వద్ద ఉత్సవ మూర్తులకు తలంబ్రాల బియ్యాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో మాత్రమే చెర్వుగట్టు క్షేత్రం అభివృద్ధి జరిగిందన్నారు. రాష్ట్రం ఏర్పడిన రెండు నెలలకే చెర్వుగట్టును సందర్శిస్తానని చెప్పిన కేసీఆర్‌ ఎనిమిది సంవత్సరాలైనా క్షేత్రానికి రాలేదని విమర్శించారు. ఇచ్చిన మాట మేరకు సీఎం కనీసం వచ్చే బ్రహ్మోత్సవాల నాటికైనా చెర్వుగట్టును సందర్శించాలన్నారు. 

Updated Date - 2022-02-10T06:41:20+05:30 IST